iDreamPost
android-app
ios-app

ఏపీ బీజేపీలో ముదురుతున్న వార్, సోము వీర్రాజు వర్సెస్ చంద్రబాబు అనుచరులు

  • Published Apr 02, 2022 | 6:42 PM Updated Updated Apr 02, 2022 | 6:47 PM
ఏపీ బీజేపీలో ముదురుతున్న వార్, సోము వీర్రాజు వర్సెస్ చంద్రబాబు అనుచరులు

ఏపీ బీజేపీలో మొదటి నుంచి చంద్రబాబు అనుకూల వర్గం పెత్తనం చేయాలని చూస్తూ వస్తోంది. కొంతకాలం దానికి అనుగుణంగా వాతావరణం కూడా కనిపించేది. కానీ సోము వీర్రాజు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయిన తర్వాత అందుకు అడ్డంకులు పడ్డాయి. ముఖ్యంగా పలు సందర్భాల్లో సోమ వీర్రాజు బాబు బ్యాచ్ కి చెక్ పెట్టేలా చర్యలు తీసుకున్నారు. ఆఖరికి ఒత్తిడికి తలొగ్గినా తొలుత ఏబీఎన్, ఆంధ్రజ్యోతిని ఏకంగా బహిష్కరిస్తున్నామనే నిర్ణయం కూడా తీసుకున్నారు. దాంతో సోము వీర్రాజు అంటే గిట్టని చంద్రబాబు అనుకూల బీజేపీ నాయకులు సోము వీర్రాజుకి వ్యతిరేకంగా అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అధిష్టానం వద్ద అనేకమార్లు ఫిర్యాదులు కూడా చేశారు. చివరకు ఇటీవల ఏకంగా వీర్రాజు స్థానంలో కొత్త అధ్యక్షుడిని నియమించాలనే ఒత్తిడి పెంచారు.ఆ క్రమంలోనే విజయవాడలో ఓ సమావేశం కూడా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక ఉత్సవాలను వీర్రాజు నేతృత్వంలో రాజమహేంద్రవరంలో నిర్వహిస్తుండగా, విజయవాడలో సత్యకుమార్ సత్కార సభ పేరుతో నిర్వహించిన కార్యక్రమం వివాదాస్పదమయ్యింది.

ఈ వ్యవహారంలో తాజాగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి పాత్ర లేకుండా నిర్వహించినందుకు బాధ్యుడిగా ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు వల్లూరు జయప్రకాష్‌ పై చర్యలు తీసుకున్నారు. దాంతో ఈ వ్యవహారం మరింత ఆసక్తిగా మారింది. ఏపీ బీజేపీలో వీర్రాజు వర్సెస్ బాబు బ్యాచ్ అన్నట్టుగా బాహాటంగా కనిపిస్తోంది. జయప్రకాష్‌ పై చర్యలను ఆ సమావేశంలో పాల్గొన్న నేతలు తప్పుబడుతున్నారు.వాస్తవానికి సమావేశం నిర్వహణని లంక దినకర్ సహా పలువురు మాజీ టీడీపీ నేతలు చూసుకున్నారు. కానీ ఏపీ బీజేపీనాయకత్వం మాత్రం కీలక నాయకులను వదిలేసి ఎస్సీ మోర్చా అధ్యక్షుడి మీద చర్యలు తీసుకోవడం ద్వారా వారికో సంకేతం పంపించినట్టుగా భావిస్తున్నారు. దాంతో వీర్రాజు ప్రత్యర్థి వర్గం కూడా దీనిని సీరియస్ గా పరిగణిస్తున్నట్టు కనిపిస్తోంది.

త్వరలోనే సోము వీర్రాజు స్థానంలో కొత్త అధ్యక్షుడు ఏపీ బీజేపీకి వస్తారని ఆయన వ్యతిరేకులు అంచనా వేస్తున్నారు. ఆధైర్యంతోనే విజయవాడలో సమావేశం నిర్వహించి సత్యకుమార్ పేరుని ప్రతిపాదించేందుకు సిద్ధమయినట్టు కథనాలు వచ్చాయి. సత్యకుమార్ కూడా గతంలో వెంకయ్యనాయుడు వ్యక్తిగత కార్యదర్శిగా ఉండడం, రాయలసీమకు చెందిన బీసీ నాయకుడు కావడంతో అన్నీ కలిసి వస్తాయని భావించారు. అయితే వీర్రాజు మాత్రం తన దూకుడు తగ్గేదేలే అన్నట్టుగా చర్యలకు పూనుకున్నారు. ఈ పరిణామాలతో ఏపీ బీజేపీ వ్యవహారాలు మరింత వేడెక్కుతున్నాయి. ఈ వివాదం త్వరగా సమసిపోవాలని బీజేపీలోని బాబు బ్యాచ్ భావిస్తోంది. జనసేన, బీజేపీ కూడా తమతో కలిసి రావాలంటే సోము వీర్రాజు వంటి వారు సారథ్యంలో ఉండకూదని వారు ఆశిస్తున్నారు. దానికి తగ్గట్టుగా వారు వేగంగా అడుగులు వేస్తున్నారు. అందుకు అడ్డుకట్ట వేసేందుకు వీర్రాజు రంగంలో దిగారు. దాంతో ఈ వివాదం ఎటు మళ్లుతుందన్నది ఏపీ బీజేపీ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీస్తోంది.