iDreamPost
android-app
ios-app

రెండేళ్ల తర్వాత ఇంటర్నేషనల్ ఫ్లైట్ సర్వీసుల మీద నిషేధం ఎత్తివేత

రెండేళ్ల తర్వాత ఇంటర్నేషనల్ ఫ్లైట్ సర్వీసుల మీద నిషేధం ఎత్తివేత

రెగ్యులర్ ఇంటర్నేషనల్ విమాన సర్వీసుల పునరుద్ధరణ కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు కేంద్రం శుభవార్త చెప్పింది. భారత ప్రభుత్వం షెడ్యూల్డ్ కమర్షియల్ ఇంటర్నేషనల్ ప్యాసింజర్ సర్వీసులను 27 మార్చి 2022 నుంచి తిరిగి ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. అయితే అంతర్జాతీయ ప్రయాణాల కోసం ఆరోగ్య మంత్రిత్వ శాఖ యొక్క మార్గదర్శకాలు ఖచ్చితంగా కట్టుబడి ఉండాలని పేర్కొంది. కోవిడ్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్న క్రమంలో భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

దేశంలో వ్యాక్సినేషన్ కవరేజీ కూడా పెరుగుతోంది. దేశంలో షెడ్యూల్డ్ కమర్షియల్ ఇంటర్నేషనల్ ప్యాసింజర్ సర్వీసులు 23 మార్చి 2020 నుండి నిలిపివేయబడ్డాయి. ఈ సస్పెన్షన్ సమయంలో ‘ఎయిర్ బబుల్’ ఏర్పాటు చేసుకున్న భారతదేశం అలాగే దాదాపు 40 దేశాల మధ్య ప్రత్యేక విమానాలు నడుస్తున్నాయి. నిజానికి డిసెంబర్ 15 నుండి ఈ అంతర్జాతీయ విమాన కార్యకలాపాలను తిరిగి ప్రారంభించాలని భారత ప్రభుత్వం ముందుగా ప్లాన్ సిద్ధం చేసింది. అయితే కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ దృష్ట్యా ఈ నిర్ణయం వాయిదా పడింది.

కరోనావైరస్ మహమ్మారి యొక్క మొదటి వేవ్ ఎదుర్కోవటానికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన తర్వాత మార్చి 2020లో దేశంలో మొదటిసారిగా అంతర్జాతీయ విమానాలు నిలిపివేయబడ్డాయి. ఒకరకంగా ఇది శుభవార్త అనే చెప్పాలి. సామాన్యులు విదేశీయానం చేయకున్నా ఈ ఆంక్షల ఎత్తివేత అనేది మళ్ళీ కరోనా పూర్వం జీవన స్థితిగతులకు దగ్గరయ్యేందుకు ఒక మార్గం. నెమ్మదిగా మాస్క్ నుంచి కూడా ప్రజలకు విముక్తి లభిస్తుందని కొందరు ఆరోగ్య నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆ దిశగా అడుగులు పడి జనజీవనం మళ్ళీ తమ పనుల్లో బిజీ అయితే కొంత వరకు ఆర్థిక వ్యవస్థ కూడా కోలుకునే అవకాశం ఉంటుంది.