iDreamPost
android-app
ios-app

కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ వేగవంతం, ఏప్రిల్ 2 నుంచి పాలన అక్కడి నుంచే

  • Published Feb 27, 2022 | 11:44 AM Updated Updated Feb 27, 2022 | 4:36 PM
కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ వేగవంతం, ఏప్రిల్ 2 నుంచి పాలన అక్కడి నుంచే

ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్తజిల్లాల ఏర్పాటు ప్రక్రియ వేగవంతమయ్యింది. ఇప్పటికే నోటిఫికేషన్ పై వచ్చిన అభ్యంతరాల పరిశీలన జరుగుతోంది. అదే సమయంలో సిబ్బంది కేటాయింపులపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ముఖ్యంగా జోనల్ నిబంధనలను గమనంలో ఉంచుకుని ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. మార్చి 11 నాటికి ఈ ప్రక్రియ పూర్తి అవుతుందని అధికారికంగా ప్రకటించారు. కొత్త జిల్లా కేంద్రాలుగా ప్రతిపాదించిన చోట్ల నూతన భవనాలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. వాటిని పాలనా వ్యవహారాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నారు. సిబ్బంది కేటాయింపులు కూడా పూర్తయితే కీలక అంకం గడిచినట్టవుతుంది.

కొత్తగా ప్రతిపాదించిన బాలాజీ తిరుపతి జిల్లాకు నెల్లూరు జిల్లాలోని నియోజవర్గాల నుంచి సిబ్బంది కేటాయింపుల విషయంపై గతం నుంచి అమలవుతున్న జోనల్ నిబంధనలు అడ్డంకిగా ఉన్నాయి. ముఖ్యంగా కోస్తా ప్రాంతంలో ఉన్న నెల్లూరు, రాయలసీమ జోన్ లో ఉన్న తిరుపతితో అనుసంధానం చేస్తూ సిబ్బంది కేటాయింపులకు కొన్ని నిబంధనలు వర్తిస్తాయి. ఈ తరుణంలో వాటిని మార్చాలంటే రాష్ట్రపతి ఆమోదముద్ర ఉండాలి. అప్పటివరకూ ఉన్న పరిమితులలోనే కేటాయింపులు చేసేందుకు సన్నద్ధమయ్యారు.

సిబ్బంది కేటాయింపులన్నీ తాత్కాలిక ప్రాతిపదికన జరపబోతున్నారు. కొత్తగా నియామకాలు లేవు. ఆర్డర్ టూ సర్వ్ పద్ధతిలో ఈ కేటాయింపులు ఉంటాయి. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ సిబ్బందిని కూడా సర్దుబాటు చేయబోతున్నారు. అర్హతను బట్టి టీఏ చెల్లించేలా ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు అన్ని శాఖల్లోనూ ఇవే నిబంధనలు వర్తింపజేసేలా కేటాయింపులు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ నియామకాల, సర్దుబాటు ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చినట్టు భావిస్తున్నారు. వాటిని రాష్ట్రస్థాయి అధికారులు పరిశీలించి ఖాయం చేయబోతున్నారు. ప్రతి జిల్లాకేంద్రంలోనూ సంబంధిత అధికారి కార్యాలయం పరిపాలనా అధికారి అందుబాటులో ఉండి, మిగలిన వ్యవహారాలను పూర్తి చేసేందుకు అనుగుణంగా సిద్ధం చేస్తున్నారు.

ఏప్రిల్ 2 నుంచి ఏపీలో కొత్త జిల్లాల నుంచే పాలన సాగబోతోంది. ఇప్పటికే కలెక్టర్లు, ఎస్పీలను కూడా కొత్తజిల్లాలకు కేటాయించారు. వారు పాతజిల్లా కేంద్రాలకు ఇన్ఛార్జులుగా ఉంటారు. జిల్లాలు అందుబాటులోకి రాగానే కొత్తగా కలెక్టర్లు, జేసీలు, ఎస్పీల బదిలీల ప్రక్రియ ఉంటుంది. ఇదంతా తొలి పక్షంరోజుల్లోనే పూర్తవుతుందని భావిస్తున్నారు. ఏపీలో పాలనాపరంగా వస్తున్న పలుమార్పుల్లో జిల్లాల ప్రక్రియ ఓ కొత్త ప్రస్థానం కాబోతోంది. దాదాపుగా నాలుగు దశాబ్దాల తర్వాత తొలిసారిగా కొత్త జిల్లాలు ఏపీలో అందుబాటులోకి రాబోతుండడం ఆసక్తికరం.