iDreamPost
android-app
ios-app

ఫిరాయింపులపై అచ్చెన్నకు కోపమొచ్చింది!

  • Published Mar 30, 2022 | 8:17 AM Updated Updated Mar 30, 2022 | 8:21 AM
ఫిరాయింపులపై అచ్చెన్నకు కోపమొచ్చింది!

తన దాకా వస్తే కాని తెలియదంటారు?  తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి ఇప్పుడు ఆ పరిస్థితి ఎదురైంది. ఇన్నాళ్లూ కలసి పనిచేసి,సడన్‌గా పార్టీ ఫిరాయించి, తమపై విమర్శలు చేస్తే ఎలా ఉంటుందో ఆయనకు ఇప్పుడు తెలిసివచ్చింది. అందుకే పార్టీ మారినవారు బతికున్నా చనిపోయినట్టే లెక్క. అటువంటి వారు చంద్రబాబునాయుడిని విమర్శిస్తే సహించేది లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం ఆయన అమరావతిలో మాట్లాడుతూ పార్టీ  ఫిరాయించిన వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీని ఎలా నడపాలో అర్థం కాక తలపట్టుకుంటున్న ఆయన… నాయకులు టీడీపీ నుంచి వెళ్లిపోవడాన్ని తట్టుకోలేకపోతున్నారు. పుండు మీద కారం చల్లినట్టు అలా వెళ్లిపోతున్నవారు టీడీపీపై,  చంద్రబాబుపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ పరిస్థితిని తట్టుకోలేక అచ్చెన్న కోప్పడిపోతున్నారు.

గతం మరిచిపోయారా..

తాను అధికారంలో ఉండగా ముఖ్యమంత్రి హాదాలో చంద్రబాబునాయుడు పార్టీ ఫిరాయింపులను ప్రోత్పహించారు. వైఎస్సార్‌ సీపీ నుంచి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలకు బాహాటంగా కండువాలు కప్పి మరీ తెలుగుదేశం పార్టీలో చేర్చుకున్నారు. అందులో నలుగురికి మంత్రి పదవులు కూడా ఇచ్చారు. పార్టీ ఫిరాయింపుల నిరోధకచట్టం ప్రకారం వారిపై అనర్హత వేటు వేయాలని వైఎస్సార్‌ సీపీ ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా అప్పటి స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ స్పందించలేదు. దీనికి నిరసనగా నాటి ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీని కూడా బహిష్కరించారు.

అప్పుడు బురద జల్లలేదా?

ఫిరాయించిన వారితో రోజూ ప్రెస్‌మీట్లు పెట్టించి మరీ జగన్‌మోహన్‌రెడ్డిపై విమర్శలు చేయించేవారు. అప్రజాస్వామికమైన ఈ పద్ధతులు పెంచి పోషించిన టీడీపీ నాయకులు ఇప్పుడు అదే పరిస్థితి తమకు ఎదురయ్యే సరికి ఆగ్రహావేశాలతో ఊగిపోతున్నారు. ఏ మాత్రం విలువలు పాటించకుండా టీడీపీ నాడు నడిపిన ఈ అరాచకీయాన్ని జనం ఈసడించుకున్నారు. అందుకే 2019లో టీడీపీని 23 సీట్లకే పరిమితం చేసి బుద్ధి చెప్పారని జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల ఫలితాల అనంతరం వ్యాఖ్యానించారు.

విలువలకు కట్టుబడిన జగన్‌

అఖండమైన మెజార్టీతో వైఎస్సార్‌ సీపీ గెలిచిన తరువాత టీడీపీ నుంచి కొందరు ఎమ్మెల్యేలు అధికారపార్టీలో చేరడానికి సిద్ధపడ్డారు. అయితే అలా వచ్చేవారు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని జగన్‌మోహన్‌రెడ్డి షరతు విధించారు. ఈ విషయాన్ని అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్‌ ప్రకటించారు కూడా. టీడీపీలాగే తామూ విలువలకు తిలోదకాలిచ్చి గేట్లు తెరిస్తే చాలామంది ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరతారు. కానీ తాము అటువంటి నీచ సంస్కృతిని పోషించబోమని విస్పష్టంగా ప్రకటించారు. దానికే కట్టుబడే ఉన్నారు.

ఇప్పుడు తెలిసొచ్చిందా..

అయినా కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబు వైఖరి నచ్చక, ఆ పార్టీకి భవిష్యత్తు లేదని నిర్ణయించుకుని దూరంగా ఉంటున్నారు. ఎన్టీఆర్‌ స్థాపించిన టీడీపీని సర్వనాశనం చేస్తున్న చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారు. దాన్ని తట్టుకోలేక పోతున్న అచ్చెన్న ఇలా ఆవేశపడి పోతున్నారు. నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా అన్నట్టు టీడీపీ ఒకప్పుడు తెరలేపిన దుష్ట సంప్రదాయమే ఇప్పుడు వారిని వెక్కిరిస్తోంది. ఆ వాస్తవం గమనించకుండా అచ్చెన్న చిందులు తొక్కితే ప్రయోజనం ఏమిటి?