iDreamPost
android-app
ios-app

ఏపీకి అప్పు ఇవ్వడం నేరమట..! ఆంధ్రజ్యోతి అడ్డగోలు రాతలు

ఏపీకి అప్పు ఇవ్వడం నేరమట..! ఆంధ్రజ్యోతి అడ్డగోలు రాతలు

అధికారంలోకి వచ్చిన రోజు నుంచి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సర్కార్‌ను ఇరుకునపెట్టేలా ప్రతిరోజూ టీడీపీ అనుకూల మీడియా కథనాలు వండి వారుస్తోంది. ముఖ్యంగా ఆంధ్రజ్యోతి పత్రిక వ్యవహరిస్తున్న తీరు ఆశ్చర్యంగా ఉంది. జగన్‌ సర్కార్‌కు అప్పులు కూడా పుట్టకూడదని భావిస్తున్నట్లుగా ఆ పత్రిక ఈ రోజు రాసిన కథనాన్ని చూస్తే అర్థమవుతోంది. ఏపీకి బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా అప్పులు ఇస్తోందని, ఇతర బ్యాంకులు వెనక్కి తగ్గినా, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా అప్పులు ఇవ్వడం వెనుక రహస్యం ఏమిటంటూ కథనం వండి వార్చింది. బ్యాంకు ఉన్నతాధికారులను బెదిరించేలా.. ఏపీకి అప్పులు ఇవ్వడంపై కేంద్ర ప్రభుత్వ అధికారులు ఆరా తీస్తున్నారని, దీని వెనుక ఏదో మర్మం ఉందని తనకు తానే తీర్మానం చేస్తూ.. కేంద్ర కూపీ లాగుతోందంటూ రాసుకొచ్చింది.

ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలకు బ్యాంకులు రుణాలు ఇవ్వడం సర్వసాధారణం. తాకట్టు, ప్రభుత్వ షూరిటీలు పెట్టుకునే ఏ బ్యాంకులు అయినా రుణాలు ఇస్తాయి. ప్రతి ఏడాది రాష్ట్ర స్థాయిలో బ్యాంకులతో సీఎం ప్రత్యేకంగా సమావేశం అవుతారు. గత టీడీపీ ప్రభుత్వమైనా బ్యాంకుల నుంచే అప్పులు తీసుకుంది. ఇప్పుడు వైసీపీ సర్కార్‌కు కూడా అవే బ్యాంకులు అప్పులు ఇస్తున్నాయి. అయితే వైసీపీ సర్కార్‌కు అప్పులు ఇవ్వడం నేరమనేలా ఆంధ్రజ్యోతి కథనం రాసుకొచ్చింది. ఇదేదో తప్పు అనేలా బ్యాంకు అధికారులను కేంద్రం పేరుతో భయపెట్టేందుకు యత్నించింది.

ఏపీకి బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా అప్పులు ఎందుకు ఇస్తున్నట్లు..? ఇందులో మర్మం ఏమిటి..? అంటూ ఆంధ్రజ్యోతి ప్రశ్నించడం విడ్డూరంగా ఉంది. పైగా ఏపీలోని కార్పొరేషన్లు సూట్‌కేస్‌ కార్పొరేషన్లు అంటూ జగన్‌ సర్కార్‌పై తన అక్కసును వెళ్లగక్కింది. ఏపీ ఆర్థిక పరిస్థితిపై తాము అడ్డగోలు రాతలు రాస్తున్నా.. బ్యాంకులు అప్పులు ఇవ్వడాన్ని ఆంధ్రజ్యోతి జీర్ణించుకోలేక పోతున్నట్లుగా ఉంది. తమ రాతల ద్వారా బ్యాంకులను ప్రభావితం చేయాలని యత్నిస్తోంది.

కరోనా వల్ల ఆర్థిక వ్యవస్థ గాడి తప్పినా.. ప్రభుత్వాలకు ఆదాయం తగ్గినా దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయని విధంగా ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని సీఎం జగన్‌ అమలు చేస్తున్నారు. ఆర్థిక పరిస్థితి బాగాలేదని వివిధ రాష్ట్రాలు గగ్గోలు పెడుతుంటే.. వైఎస్‌ జగన్‌ మాత్రం విజయవంతంగా పథకాలను, పరిపాలనను కొనసాగిస్తున్నారు. ఏ ఒక్క హమీ అయిన అమలు చేయకపోయి ఉంటే.. జగన్‌కు వ్యతిరేకంగా కథనాలు రాసే అకాశం టీడీపీ అనుకూల మీడియాకు లభించేది. కానీ ఆ అవకాశం జగన్‌ ఇవ్వలేదు. మూడేళ్లుగా పథకాలు కొనసాగుతూనే ఉన్నాయి. హామీలు అమలుపై ఏమీ రాయలేక, ఆయా పథకాలు చంద్రబాబు హయాంలోనే ఉన్నాయనో, లబ్ధిదారుల సంఖ్య తగ్గించారనో లాంటి కథనాలు ఆంధ్రజ్యోతి వండి వారుస్తోంది. బ్యాంకులు అప్పులు ఇవ్వడం మానేస్తే.. ఆయా పథకాల అమలు, పరిపాలన కష్టం అవుతుందని, అప్పుడు ఎంచక్కా వైఎస్‌ జగన్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేయవచ్చనే దుర్భుద్ధితో ఉన్న టీడీపీ అనుకూల మీడియా.. ఆ పరిస్థితి తీసుకొచ్చేందుకు బ్యాంకులనే బెదిరించేలా కథనాలు రాస్తుండడం జర్నలిజంలో పరాకాష్టని చెప్పవచ్చు.