iDreamPost
iDreamPost
తనపై వస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన అవసరం కనిపించడం లేదంటూ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావు తెలిపారు. అయినా ఆయనే స్వయంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అంతా టైమ్ వేస్ట్ ఆరోపణలేనని కొట్టిపారేస్తూనే వాటిపై పరువు నష్టం దావా వేస్తున్నట్టు హెచ్చరించారు. దావా వేసేందుకు ప్రభుత్వ అనుమతి కోరానని వెల్లడించారు. సాక్షి పత్రిక,సాక్షి ఛానెల్, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, అబ్బయచౌదరి, విజయసాయిరెడ్డి, పయనీర్ పత్రిక, స్వర్ణాంధ్ర మధ్యాహ్న పత్రిక,గ్రేట్ ఆంధ్ర డాట్‍కామ్‍పై పరువునష్టం దావా వేసేందుకు అనుమతి రావాల్సి ఉందని తెలిపారు.
పెగాసస్ వ్యవహారాన్ని ఏపీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అక్కడి అసెంబ్లీ వేదికగా చేసిన వ్యాఖ్యలపై విచారణకు సభలో చర్చించింది. హౌస్ కమిటీ వేస్తున్నట్టు స్పీకర్ తమ్మినేని సీతారాం వెల్లడించారు. విచారణ కమిటీ సభ్యుల పేర్లు ఒకటి రెండు రోజుల్లో వెల్లడిస్తామన్నారు. ఇది జరుగుతున్న సమయంలోనే మాజీ ఇంటిలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వర రావు మీడియా ముందుకొచ్చారు. ప్రజల భయాలను తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనంటూ వ్యాఖ్యానించారు.
పెగాసస్‍పై వస్తున్న సందేహాలను నివృత్తి చేయడం తన బాధ్యతగా భావిస్తున్నానంటూ ఆయన పేర్కొన్నారు. పెగాసస్ కొనలేదని ఇప్పటికే డీజీపీ కార్యాలయం తెలిపిందన్నారు. అప్పటి డీజీపీ ఆఫీస్ కాకుండా మరొకరు కొన్నారని ఆరోపిస్తున్నారని, వాటిని కోడిగుడ్డు మీద ఈకలు పీకే వ్యవహారం అంటూ అభిప్రాయపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో ఎవరి ఫోన్లు ట్యాప్ కాలేదని, అందరూ నిశ్చింతగా ఉండండి అంటూ తెలిపారు. గతంలో నిఘా విభాగం చీఫ్ గా నాకు పూర్తి అవగాహన ఉందని, ఎవరూ అలాంటి స్పైవేర్ కొనుగోలు చేయలేదని మీడియాకు తెలిపారు. మే 19, 2019 వరకూ పెగాసస్ కొనలేదని, ఆతర్వాత తనకు తెలియదని అన్నారు.విచారణ విషయంలో తాను సిద్ధమేనన్నారు. బెంగాల్ సీఎం ఏమన్నారో తనకు తెలియదని, కానీ ప్రజల్లో అపోహలు తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందన్నారు. తనపై చేస్తున్నదంతా అసత్య ప్రచారమేనన్నారు.