iDreamPost
android-app
ios-app

పంజాబ్ లో ఊడ్చేసిన ఆప్

పంజాబ్ లో ఊడ్చేసిన ఆప్

పంజాబ్ ఎన్నికల్లో ఆమాద్మీ పార్టీ (ఆప్) ఘనవిజయం వైపు దూసుకుపోతోంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని… గతంలో అధికారం పంచుకున్న శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏపి), భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లను ఆప్ ఊడ్చేసింది. తలపండిన రాజకీయ పార్టీ నేతలు, విశ్లేషకుల అంచనాలు తిరగరాస్తూ ఆప్ పంజాబ్ అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది.

పంజాబ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ సంచలన విజయం వైపు దూసుకుపోతోంది. ఇక్కడ ఎన్నికల లెక్కింపు గురువారం ఉదయం మొదలయ్యింది. మొత్తం 117 అసెంబ్లీ స్థానాలకు గాను ఆప్ పార్టీ 90 స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యం సాధించింది. ఎగ్జిట్ పోల్ అంచనాలను అధిగమించి విజేతగా నిలిచింది. లెక్కింపు ఆరంభం నుంచి ఆప్ ఆధిక్యం కొనసాగుతూనే ఉంది. ఎన్నికల ప్రక్రియ మొదలైన నాటి నుంచి పంజాబ్ లో ఆప్ జోరు కనిపించింది. అయితే అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి గట్టి పోటీ ఉంటుందని అంచనా వేశారు. కానీ ఎక్కడా ఆ పార్టీ నుంచి గట్టిపోటీ ఎదురుకాలేదు. గత పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పార్టీకి కేవలం 12 అసెంబ్లీ స్థానాలు మాత్రమే వచ్చాయి. అటువంటిది ఇప్పుడు ఏకంగా 90 స్థానాల వరకు గెలుచుకునే స్థాయికి ఆప్ చేరింది. ఆప్ గెలుపు ఊహించిందే అయినా ఈ స్థాయిలో మెజారిటీ వస్తుందని ఆ పార్టీ నాయకులే అంచనా వేయలేక పోయారు.

ఢిల్లీ తర్వాత ఆమాద్మీ పార్టీ బలంగా ఉన్న రాష్ట్రాల్లో పంజాబ్ ఒకటి. 2014 లోక్ సభ ఎన్నికల్లో పార్టీ 4 ఎంపీ స్థానాలను గెలుచుకుని దేశ ప్రజలను ఆకర్షించింది. అయితే 2019 ఎన్నికల్లో కేవలం ఒక లోక్సభ స్థానానికి మాత్రమే పరిమితం అయింది. పంజాబ్ లో ఆ పార్టీ ప్రాబల్యాన్ని కోల్పోతుందని అంచనా వేశారు. అయితే వారి అంచనాలు తిరగరాస్తూ లోక్సభ ఎన్నికలు ముగిసిన కేవలం రెండున్నరేళ్లలో అధికారాన్ని కైవసం చేసుకునే స్థాయికి ఎదగడం విశేషం. ఆప్ విజయానికి ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తోడు పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్థి భగవత్ మాన్ సమన్వయంతో పనిచేయడమే కారణం. దీనికితోడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమించిన పంజాబ్ రైతులకు అప్పట్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కన్నా ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆప్ అధినేత కేజ్రీవాల్ ఇచ్చిన మద్దతు గెలుపు కారణమైంది. ఏడాదిపాటు ఢిల్లీని దిగ్భందించిన రైతులకు కేజ్రీవాల్ సంపూర్ణ మద్దతు సహకారాన్ని అందించారు. పంజాబ్ ను ఆనుకునే ఢిల్లీ ఉండటం, అక్కడ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు పంజాబ్ ఓటర్లు ఆకర్షితులయ్యారు. ఇవన్నీ ఆప్ మెజారిటీకి కారణమయ్యాయి.

నిండా ముంచేసిన సిద్ధూ..

పంజాబ్లో అధికార కాంగ్రెస్ పార్టీ పరాజయానికి పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ ప్రధాన కారణమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అమరేందర్ సింగ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీ పంజాబ్ లో బలంగా ఉండేది. అయితే సిద్దూకు, అమరేందర్ సింగ్ కు మధ్య ఏర్పడిన విభేదాల కారణంగా అమరేందర్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆయన పార్టీని కూడా వీడి సొంత కుంపటి పెట్టుకోవాల్సి వచ్చింది. వీరిద్దరి మధ్య సయోధ్య చేయడంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పూర్తిగా విఫలం అయింది. ఈ కారణంగానే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కేవలం 15 స్థానాలకు మాత్రమే పరిమితం కానుంది. అమరేంద్రను దింపిన తర్వాత కూడా సిద్ధూ సంతృప్తి పడలేదు. పార్టీ అధిష్టానాన్ని దిక్కరిస్తూనే వచ్చాడు. దీనికితోడు పార్టీలో అంతర్గత కలహాలు హెచ్చు మీరాయి. సిద్దు తరచూ పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు వత్తాసు పలకడం కూడా కాంగ్రెస్ పార్టీ భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వచ్చింది.

పంజాబ్ లో గతంలో అధికారంలో ఉన్న శిరోమణి అకాలీదళ్, ఆ పార్టీ అధికారం పంచుకున్న భారతీయ జనతా పార్టీలు సైతం ఆప్ గాలిలో కొట్టుకుపోయాయి. శిరోమణి అకాలీదళ్ కేవలం 7 స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. బిజెపి, ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నా మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరేంద్ర సింగ్ పార్టీ పంజాబ్ లోక్ కాంగ్రెస్ కేవలం రెండు స్థానాలకు మాత్రమే పరిమితం కావడం విశేషం.