iDreamPost
android-app
ios-app

రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి తిరుగులేనట్లే..!

రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి తిరుగులేనట్లే..!

ఐదు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుత ఫలితాలు సాధించిన భారతీయ జనతా పార్టీ(బీజేపీ) రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో డబుల్‌ ధమాకా కొట్టింది. నాలుగు రాష్ట్రాల్లో బలమైన పార్టీగా ఎదగడంతో పాటు.. రాష్ట్రపతి ఎన్నికల అంశంలో తిరుగులేని స్థానంలో నిలిచింది. ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, గోవా, మణిపూర్‌ రాష్ట్రాల్లో దక్కిన విజయాలు.. రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు కోసం బీజేపీ ఇతర పార్టీల సాయంకోరే అవసరాన్ని దాదాపుగా లేకుండా చేసేశాయి. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పదవీకాలం వచ్చే జులై 22తో ముగియనుంది. దీంతో అదే నెలలో రాష్ట్రపతి ఎన్నికలు జరిగే అవకాశముంది. ఇంకో విషయం ఏంటంటే.. రాష్ట్రపతి అభ్యర్థిగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్‌ను బరిలోకి దించాలని బీజేపీ భావిస్తున్నట్లు విస్తృత ప్రచారం జరుగుతోంది.

రాష్ట్రపతి ఎన్నిక ప్రాతినిధ్య నిష్పత్తి ప్రకారం ఎంపీ, ఎమ్మెల్యేల ఓట్లతో జరుగుతుంది. ఓ ప్రజాప్రతినిధి తాను ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గంలోని జనాభా ఆధారంగా అతని ఓటు విలువ ఉంటుంది. అత్యధిక జనాభా ఉన్న యూపీలో ఎంపీ ఓటు విలువ 708, ఎమ్మెల్యే ఓటు విలువ 208గా ఉంది. ఎలక్టోరల్‌ కాలేజీలో సగం ఓట్లు సాధించాలన్నా నిబంధన ప్రకారం రాష్ట్రపతిగా ఎన్నికయ్యే అభ్యర్థికి కనీసం 5,49,452 ఓట్లు రావాలి. గత రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిగా బరిలోకి దిగిన రామ్‌నాథ్‌కు అన్నాడీఎంకే, జేడీ(యూ), బీజేడీ, టీఆర్‌ఎస్‌, టీడీపీ, వైసీపీ, శివసేన, అకాలీదళ్‌తోపాటు ఇతర ప్రాంతీయ పార్టీలు మద్దతు పలికాయి. దీంతో కోవింద్‌కు 7,02,044 ఓట్లు వచ్చాయి. ఇందులో 63,440 ఓట్లు ఉత్తరప్రదేశ్‌ నుంచి లభించాయి.

కానీ తాజా పరిణామాల వల్ల ఈసారి శివసేన, అకాలీదళ్‌, అన్నాడీఎంకే మద్దతు ఎన్డీయే అభ్యర్థికి లేకుండా పోయింది. దీంతో ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ నేపథ్యంలో అత్యధిక జనాభా ఉన్న యూపీలో సానుకూల ఫలితం రావడంతో బీజేపీ తిరుగులేని స్థానానికి చేరింది. ఒకవేళ యూపీలో సమాజ్‌వాది పార్టీ ఆధిక్యంలోకి వచ్చి ఉంటే రాష్ట్రపతి ఎన్నికల విషయంలో బీజేపీ అంచనా తలకిందులయ్యేవి. అప్పుడు మద్దతు కోసం టీఆర్‌ఎస్‌, వైసీపీ, బీజేడీ వంటి ప్రాంతీయ పార్టీల సాయం కోరాల్సి వచ్చేది. కాగా, కీలకమైన యూపీతోపాటు ఉత్తరాఖండ్‌, మణిపూర్‌లో మెజార్టీ స్థానాలు నెగ్గడంతో రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ ప్రతిపాదిత అభ్యర్థి అది ఆజాద్‌ అయినా మరొకరైనా వారి విజయం లాంఛనమే అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే, బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఒక్కతాటిపైకి వస్తే మాత్రం సమీకరణాలు మారే అవకాశం ఉందంటున్నారు.