iDreamPost
android-app
ios-app

కాసేపట్లో ఐదు రాష్ట్రాల ఫలితాలు : ఓడేదెవరు.. గెలిచేదెవరు?

కాసేపట్లో ఐదు రాష్ట్రాల ఫలితాలు : ఓడేదెవరు.. గెలిచేదెవరు?

ఐదు రాష్ట్రాలు.. కానీ వాటి ఫలితాలపై ఎన్నో రాజకీయ సమీకరణాలు ఆధారపడి ఉన్నాయి. గెలిచేందుకు, గెలిపించేందుకు, ఓడించేందుకు పాటుపడ్డ ఎందరో ప్రముఖుల భవితవ్యం ఆధారపడింది. గతేడాది జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఫెయిలైన కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఎంత వరకు పుంజుకుందనే విషయం తేలనుంది. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు నిజం కానున్నాయా, లేక భిన్నమైన ఫలితాలు వెలువడనున్నాయా అనేది నేడు వెల్లడి కానుంది. దేశంలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాసేపట్లో వెలువడనున్నాయి.

అతిపెద్ద రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వానికి ఆయువు పట్టు అయిన ఉత్తరప్రదేశ్‌తో పాటు పంజాబ్‌, ఉత్తరాఖండ్‌, గోవా, మణిపూర్‌ రాష్ట్రాల్లో హోరాహోరీగా మినీ ఎన్నికల సంగ్రామం నడిచింది. ప్రధానంగా యూపీలో పోరు ఉత్కంఠగా సాగింది. ఏడు దశల్లో పోలింగ్‌ కొనసాగింది. పశ్చిమబెంగాల్‌ ఎన్నికలను గుర్తు చేసింది. మరి ఫలితాలు ఎలా ఉంటాయనేది ఆసక్తిగా మారింది. మెజార్టీ ఎగ్జిట్‌పోల్స్‌ అయితే బీజేపీకే పట్టం కట్టాయి. ఐదు రాష్ట్రాల్లోని దాదాపు 1,200 కౌంటింగ్‌ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. అత్యధికంగా 403 అసెంబ్లీ స్థానాలున్న ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోనే 750కి పైగా కౌంటింగ్‌ కేంద్రాలు ఉన్నాయి.

ఓట్ల లెక్కింపు ప్రక్రియ కోసం ఈ రాష్ట్రాల్లో 50,000 మందికిపైగా అధికారులను, 671 మంది కౌంటింగ్‌ పరిశీలకులు, 130 మంది పోలీసు పరిశీలకులు, 10 మంది స్పెషల్‌ పరిశీలకులను నియమించారు. కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నప్పటికీ.. కరోనా లక్షణాలు కలిగిన వారినెవరినీ కౌంటింగ్‌ కేంద్రాల్లోకి అనుమతించరు. తొలుత బ్యాలెట్‌ ఓట్లను లెక్కిస్తారు. లెక్కింపు ప్రారంభమయ్యాక కొన్ని గంటల్లోనే ఫలితాలపై ప్రాథమిక అంచనాలు వెలువడతాయి. గురువారం సాయంత్రం లేదా రాత్రికల్లా ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మొత్తం వచ్చేస్తాయి. ఈ ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 మధ్యకాలంలో ఏడు విడతల్లో జరిగాయి.

లెక్కింపునకు ముందు కీలక పరిణామాలు

ఓట్ల లెక్కింపు జరగడానికి ఒకరోజు ముందు ఉత్తరప్రదేశ్‌లో పలు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ముగ్గురు అధికారులను ఎన్నికల విధుల నుంచి తప్పిస్తూ ఎన్నికల కమిషన్‌ (ఈసీ) నిర్ణయం తీసుకుంది. ఈవీఎంల తరలింపు ప్రక్రియపై అభ్యంతరం తెలుపుతూ సమాజ్‌వాదీ పార్టీ ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఈమేరకు చర్యలు చేపట్టింది. ఆ ముగ్గురి స్థానంలో కొత్త అధికారులను నియమించింది. ఈవీఎంల తరలింపులో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే కారణంతో వారాణసీ జిల్లా నోడల్‌ ఆఫీసర్‌ (ఈవీఎంలు)గా ఉన్న జిల్లా అదనపు మెజిస్ట్రేట్‌ (ఏడీఎం) నళినీకాంత్‌ సింగ్‌ను సస్పెండ్‌ చేస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలిచ్చింది. ఈవీఎంల తరలింపులో నళినీకాంత్‌ ప్రొటోకాల్‌ను పాటించలేదనేది వాస్తవమని వారాణసీ కమిషనర్‌ దీపక్‌ అగర్వాల్‌ నిర్ధారించారు.

ఈవీఎంలను బుధవారం తరలించాల్సి ఉండగా.. ఎవరికీ సమాచారం ఇవ్వకుండా మంగళవారం రాత్రే నళినీకాంత్‌ తరలించారని వారాణసీ జిల్లా మెజిస్ట్రేట్‌ కౌశల్‌రాజ్‌ శర్మ చెప్పారు. ఆమె స్థానంలో కొత్త నోడల్‌ ఆఫీసర్‌ (ఈవీఎంలు)గా మరో ఏడీఎం (ఫైనాన్స్‌, రెవెన్యూ) సంజయ్‌ కుమార్‌ను నియమించారు. ఇక యూపీలోని బరేలీలో అదనపు ఎన్నికల అధికారి (ఏఈవో) వి.కె.సింగ్‌ను ఎన్నికల విధుల నుంచి ఎన్నికల కమిషన్‌ తప్పించింది. బరేలీ మునిసిపాలిటీ పరిధిలోని బహేరీ ప్రాంతంలో ఉన్న ఓ చెత్తకుండీలో బ్యాలెట్‌ పెట్టెలతో పాటు ఇతరత్రా ఎన్నికల సామగ్రి బయటపడటంతో వి.కె.సింగ్‌ను తప్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లా ఘోరవాల్‌ పట్టణ రిటర్నింగ్‌ ఆఫీసర్‌ రమేశ్‌కుమార్‌ను ఎన్నికల విధుల నుంచి తొలగించారు. ఆయన వాహనంలోని ఓ పెట్టెలో బ్యాలెట్‌ పేపర్లు లభ్యమవడంతో ఎన్నికల కమిషన్‌ ఈ నిర్ణయాన్ని తీసుకుంది.