iDreamPost
android-app
ios-app

శుక్ర గ్రహం మీద భారతీయ మహిళలు

శుక్ర గ్రహం మీద భారతీయ మహిళలు

సౌరకుటుంబంలో అన్ని గ్రహాలమీద జరిగే ఉల్కాపాతం వలన ఆయా గ్రహాల ఉపరితలం మీద వివిధ పరిమాణంలో బిలాలు ఏర్పడతాయి. వాటిలో పెద్దవిగా ఉండే బిలాలకు పేర్లు పెట్టడం కోసం అంతర్జాతీయ అంతరిక్ష సంఘం ఒక శాస్త్రవేత్తల బృందాన్ని ఏర్పాటు చేసింది. గ్రహాలలో ఒక్క వీనస్ తప్ప మిగిలిన అన్నీ పురుషుల పేర్లతో ఉన్నాయి కాబట్టి ఆడ పేరు ఉన్న ఏకైక గ్రహం మీద ఉన్న బిలాలకు ఆడ పేర్లు పెట్టారు.

వీనస్ గ్రహం మీద దట్టమైన వాతావరణం ఉంటుంది కాబట్టి చిన్నపాటి ఉల్కలు ఆ గ్రహపు ఉపరితలం చేరకుండానే మాడిపోతాయి. అందువల్ల ఒక మోస్తరు పరిమాణం ఉన్న ఉల్కలే వీనస్ ఉపరితలాన్ని తాకి బిలాలు ఏర్పాటు చేయగలవు. ఈ కారణంగా వీనస్ మీద ఉన్న బిలాల్లో ఏది మూడు కిలోమీటర్ల కన్నా తక్కువ వ్యాసంతో ఉండదు. 2018 డిసెంబర్ నాటికి శాస్త్రవేత్తలు వెయ్యి బిలాలను గుర్తించి వాటికి పేర్లు పెట్టారు. ఈ వెయ్యి పేర్లలో మూడు పేర్లు భారతీయ మహిళలకు చెందినవి. వివిధ రంగాల్లో మొదటిసారిగా ప్రవేశించిన ముగ్గురు వైతాళికులను గుర్తించి ఆ పేర్లు పెట్టారు.

జోషీ బిలం

భారతదేశంలో వైద్య విద్య అభ్యసించిన తొలి మహిళల్లో ఒకరు ఆనందిబాయి గోపాలరావు జోషి. యుక్తవయసులోనే పెళ్ళి చేసుకుని, తల్లి అయిన ఆనందిబాయికి పుట్టిన కుమారుడు పదిరోజులకే సరైన వైద్యం అందక మరణించడంతో వైద్యురాలు కావాలని నిర్ణయించుకుంది. సంప్రదాయవాదులైన కుటుంబ సభ్యులు ఆమె నిర్ణయాన్ని వ్యతిరేకించినా భర్త గోపాలరావు ప్రోత్సాహంతో, కలకత్తాకు చెందిన క్రైస్తవ మిషనరీల సహాయంతో అమెరికాలోని పెన్సిల్వేనియా నగరంలోని మహిళా వైద్య కళాశాల నుంచి 1886లో తన ఇరవై ఒకటో ఏట ఎండి పట్టా పొందింది ఆనందిబాయి.

అదే సంవత్సరం భారతదేశానికి తిరిగివచ్చి, కొల్హాపూర్ లోని ఆల్బర్ట్ ఎడ్వర్డ్ ఆసుపత్రిలో మహిళా విభాగంలో అధిపతిగా తన సేవలందిస్తూ, ఆ మరుసటి సంవత్సరమే క్షయవ్యాధితో మరణించింది ఆనందిబాయి గోపాలరావు జోషి.

జిరాద్ బిలం

ఇంగ్లాండు నుంచి గైనకాలజి మరియు ప్రసూతి వైద్యంలో డిగ్రీ పొందిన మొదటి భారతీయ మహిళా వైద్యురాలు జెరూషా జిరాద్. 1891లో కర్ణాటకలోని శివమొగ్గ /షిమోగా లో జన్మించిన జిరాద్ మహారాష్ట్రలోని పూణేలో స్కూలు చదువు పూర్తి చేసి, బొంబాయిలోని గ్రాంట్ మెడికల్ కాలేజీలో వైద్యశాస్త్రంలో పట్టా పొందారు. విదేశాల్లో విద్యాభ్యాసం కోసం ఉపకార వేతనం పొందిన మొదటి భారతీయురాలిగా లండన్ యూనివర్సిటీలో గైనకాలజి విభాగంలో ఎండి పూర్తి చేశారు.
తరువాత భారతదేశానికి తిరిగివచ్చి ఢిల్లీ, బెంగుళూరులో పనిచేసి, బొంబాయిలోని కామా ఆసుపత్రిలో 1928 నుంచి 1947 వరకూ పనిచేశారు. ఈమె సేవలకు మెచ్చి, నాటి బ్రిటిష్ ప్రభుత్వం 1945లో ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ అవార్డు ఇచ్చి సత్కరించింది. జిరాద్ తన 93వ ఏట 1984లో మరణించారు.

మాధవి బిలం

ఇక మూడవది అయిన మాధవి బిలం రమాభాయి మాధవి అనే సంస్కృత పండితురాలి పేరుతో పెట్టారు. రమాభాయి మాధవి 1858లో మద్రాసు ప్రెసిడెన్సీలో జన్మించారు. ఆమె తండ్రి అనంత శాస్త్రి డోంగ్రే సంస్కృత పండితుడు. పేదరికం కారణంగా ఊరూరా తిరిగి పురాణ ప్రవచనాలు చెప్తూ పొట్టపోసుకునేవాడు. తండ్రితో కలిసి తిరుగుతూ మాధవి కూడా సంస్కృతం, పురాణాలలో మంచి పట్టు సాధించారు. ఆమెకు పదహారేళ్ళ వయసు ఉన్నప్పుడు తల్లిదండ్రులు మరణించడంతో, సోదరుడు శ్రీనివాస్ తో కలిసి సంస్కృత ప్రవచనాలు చెప్పడం మొదలుపెట్టారు.

ఆమె సంస్కృత ప్రావీణ్యం గురించి విన్న పండితులు ఆమెను కలకత్తా నగరానికి ఆహ్వానించి ఉపన్యాసం ఇప్పించారు. కలకత్తా యూనివర్సిటీ ఆమెకు పండిత, సరస్వతి అని బిరుదులు ప్రధానం చేశారు. ఆమె బిపిన్ బేహారి మేధ్వి అనే లాయరును కులాంతర వివాహం చేసుకున్నారు. రెండేళ్ళ తరువాత అతను మరణించడంతో ఆమె పూణే నగరానికి చేరుకుని అక్కడ ఆర్య మహిళా సమాజం స్థాపించి అనాధలు, వితంతువులను చేరదీసి ఆశ్రయం ఇచ్చారు. తను నమ్మిన ఆశయాల కోసం చివరి వరకూ కృషి చేసి 1922లో మరణించారు రమాబాయి మాధవి.

******
సన్నపరెడ్డి కృష్ణారెడ్డి