iDreamPost
android-app
ios-app

ధైర్యం , పోరాడే నైజం , ఓర్పు , శ్రమతత్వాల ప్రతిరూపమే వైఎస్సార్సీపీ ఆవిర్భావం …

ధైర్యం , పోరాడే నైజం , ఓర్పు , శ్రమతత్వాల ప్రతిరూపమే వైఎస్సార్సీపీ ఆవిర్భావం …

కొండని ధిక్కరించి నిలవడానికి ధైర్యం కావాలి ..

అవును , వైసీపీ ఆవిర్భావానికి పూర్వం నాడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ అధినాయకత్వం ఎవరూ ఎదురు నిలవటానికి ధైర్యం చేయలేని బలమైన స్థితిలో ఉంది . ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి 43 మంది ఎంపీలను అందించి ఆ స్థితికి ఒక పునాదిగా నిలిచిన వైఎస్సార్ అకాల మరణం తర్వాత ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా రాష్ట్ర పాలన మరొకరికి అప్పజెప్పిన నాటి కాంగ్రెస్ నాయకత్వం జగన్ రాజకీయ , వ్యక్తిగత జీవన గమనాన్ని తను నిర్దేశించే ప్రయత్నం చేసింది.

దివంగత ముఖ్యమంత్రి ,తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణ వార్త తట్టుకోలేక అశువులు బాసిన అభిమానుల ఇంటికెళ్లి పలకరించటానికి జగన్ సంకల్పించిన ఓదార్పు యాత్రకు మోకాలడ్డే ప్రయత్నం చేసింది సోనియా గాంధీ .
ఓదార్పు యాత్ర వద్దని ఆదేశించటంతో పాటు ఓదార్పు యాత్ర బదులు అందర్నీ ఒకచోటకి పిలిచి పరామర్శించమని ఆదేశించే ప్రయత్నం చేశారు .

ధిక్కారానికి ఆరోజే పునాది పడింది . పార్టీ అధిష్టానం మాటని పక్కనబెట్టి ఒక్కొక్కర్నీ పరామర్శిస్తూ ఓదార్పు యాత్రకు శ్రీకారం చుట్టారు జగన్ . అడుగడుగునా చికాకు పరిచే ప్రయత్నం చేసిన కాంగ్రెస్ అధిష్టానం తాను చెప్పినట్లు వినకపోతే , తాము చెప్పినట్లు నడుచుకోకపోతే ఇక్కట్ల పాలు చేస్తామని పలు సందేశాలు పంపటంతో విసిగిన జగన్ నాడు ప్రపంచంలో శక్తివంతమైన మహిళల్లో ఒకరుగా కీర్తించబడుతున్న సోనియాగాంధీ పెత్తనాన్ని పూచీకపుల్లగా ధిక్కరించి పాదయాత్రలోనే కాంగ్రెస్ ని వదిలి కొత్త పార్టీ పెడుతున్నట్టు ప్రకటించారు .

నిర్ణయాన్ని సాధించటానికి పోరాడే తత్వముండాలి .

ఈ నిర్ణయంతో యావత్భారత దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది అని చెప్పొచ్చు . పలు రాష్ట్రాల నాయకులు జగన్ ధైర్యాన్ని , ముక్కుసూటితనాన్ని మెచ్చుకోగా , కొందరు మాత్రం సోనియాగాంధీ శక్తి ముందు నిలవలేడని,
తన నిర్ణయాన్ని కొనసాగించలేడని పెదవి విరిచారు . వాళ్ళ అపనమ్మకాన్ని పటాపంచలు చేస్తూ 2011 మార్చి 12 వ తారీఖున తన తండ్రి వైఎస్సార్ సంక్షేమ బాటే ఎజండాగా , తన రూపే జెండాగా వైఎస్సార్సీపీ పేరుతో పార్టీ ప్రకటించి ప్రజలతో మమేకమై నాయకుడిగా ఎదిగాడు . ఈ పరిణామాన్ని ఆపటానికి నాడు ఏ పార్టీని నిలబెట్టటానికి తన తండ్రి జీవితాంతం కృషి చేసాడో అదే పార్టీ నేతలు ఉద్దేశ్యపూర్వకంగా తప్పుడు కేసులు పెట్టి తమ అధికారాన్ని ఉపయోగించి జైలు పాలు చేసినా 16 నెలల పాటు జైలు వారి అక్రమాలకు ఎదురొడ్డి పోరాడాడు కానీ వెనకడుగు వేయలేదు .

పోరాటాన్ని గెలుపుగా మలచడానికి ఓర్పు , నిలుపుకోవడానికి చాకచక్యం కావాలి .

ఇన్ని సంక్లిష్టతల మధ్య వచ్చిన 2014 ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డిదే విజయం అని అన్ని వర్గాలు ఊహించాయి . దురదృష్టవశాత్తు పలు సమీకరణాల మధ్య కొద్ది శాతం ఓట్ల తేడాతో ఓడిపోయినా నిరాశ చెందకుండా ఓర్పుగా వ్యవహరించడంతో పాటు అధికారంలోకి వచ్చిన టీడీపీ పాలనలోని వైఫల్యాలను ప్రశ్నించడంతో పాటు , టీడీపీ మేనిఫెస్టోలోని హామీల్ని అమలు చేయని మోసాన్ని అడుగడుగునా ఎండగడుతూ వచ్చిన వైనం తనని జనానికి మరింత దగ్గర చేసింది . ఈ క్రమంలో ఎన్నికలకు ఏడాదిన్నర ముందు పాదయాత్ర పేరిట రాష్ట్రం మొత్తం తిరిగి ప్రజల అంతరంగం , వారి అవసరాలు , ఆకాంక్షలు పసిగట్టి మేనిఫెస్టో రూపొందించుకొన్న చాకచక్యం తనని తిరుగులేని అధిక్యంతో అధికారం వైపు నడిపింది .

పాదయాత్ర నుండి అధికార పీఠం వైపు నడిచినా జగన్ పోరాట పంథా కొనసాగుతూనే ఉందని చెప్పొచ్చు . విపక్షాల నుండి అనుక్షణం అసత్య ఆరోపణలు , పలు మార్గాల్లో సంక్షేమ పాలనని అడ్డుకునే ప్రయత్నాలు , కరోనా వంటి ప్రకృతి వైపరీత్యాల రీత్యా మీద పడ్డ ఆర్ధిక కష్టాలు లాంటి పలు సమస్యలను ఎదుర్కొంటూ కూడా ఎంతో చాకచక్యంగా వ్యవహరిస్తూ ఇచ్చిన మాట తప్పకుండా మేనిఫెస్టోలోని ప్రతి అంశాన్ని నెరవేర్చే ప్రయత్నం చేస్తూ పాలన కొనసాగిస్తున్న జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్సీపీ పార్టీ పన్నెండో ఆవిర్భావ దినోత్సవం నేడు .