iDreamPost
android-app
ios-app

రెండు దశాబ్దాల చిలిపి ‘అల్లరి’

  • Published May 10, 2022 | 7:35 PM Updated Updated Aug 02, 2022 | 11:56 AM
రెండు దశాబ్దాల చిలిపి ‘అల్లరి’

సినిమా టైటిలే ఇంటి పేరుగా మారిపోవడం అరుదు. మహర్షి రాఘవ, సిరివెన్నెల సీతారామశాస్త్రి, కళ్ళు చిదంబరం లాంటి వాళ్లకు ఆయా చిత్రాలు తెచ్చిన పేరు ప్రఖ్యాతులు ఎన్నో. రాజేంద్ర ప్రసాద్, నరేష్ ల తర్వాత కామెడీ హీరోల్లో తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ తెచ్చుకున్న నరేష్ పరిచయమైన అల్లరి ఇవాళ్టితో 20వ ఏట అడుగుపెట్టింది. ఆ విశేషాలు చూద్దాం. 2002. నటుడు చలపతిరావు అబ్బాయి రవిబాబు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నప్పటికీ అతని టార్గెట్ డైరెక్షన్ చేయడం మీదే ఉండేది. దానికి అనుగుణంగానే కథలు సిద్ధం చేసుకుని ప్రయత్నాలు చేసేవాడు. రెగ్యులర్ ఫార్ములాకు భిన్నంగా ఏదైనా కొత్త ట్రెండ్ తీసుకురావాలనేది తన ఆలోచన.

అందులో ఒక సబ్జెక్టునే అల్లరిగా సురేష్ బాబుకి వినిపించారు రవిబాబు. సురేష్ సంస్థ అప్పుడు భారీ సినిమాలతో బిజీగా ఉంది. స్టోరీ నచ్చింది కానీ దాన్ని తమ బ్యానర్ లో తీయలేని పరిస్థితి. అలా అని వదులుకోలేరు. సపోర్ట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఫ్లైయింగ్ ఫ్రాగ్స్ పేరుతో రవిబాబుతో కలిసి ఓ చిన్ని సంస్థ పెట్టేశారు. హీరోగా ముందు ఎవరెవర్నో అనుకున్నారు. లుక్ టెస్టులు కూడా అయ్యాయి. కానీ ఎవరూ నచ్చలేదు. సరిగ్గా అదే సమయంలో ఈవివి సత్యనారాయణ గారి ప్రొడక్షన్ వ్యవహారాలు చూస్తున్న నరేష్ రవిబాబు కంట్లో పడ్డాడు. నటనలో శిక్షణ పొంది మంచి ఆఫర్ల కోసం అతనూ ఎదురు చూస్తున్నాడని తెలిసి తండ్రి కొడుకులను కలిశాడు.

మొత్తం విన్నాక ఈవివి గారన్న మాట. సినిమా అంతా కొత్తవాళ్లే ఉన్నారు, హీరో కూడా డెబ్యూ అయితే మార్కెట్ పరంగా ఇబ్బందవుతుందేమోనని సంశయించారు. కానీ రవిబాబు కాన్ఫిడెన్స్ చూసి అంత అనుభవమున్న ఈవివి కూడా నో అనలేకపోయారు. అలా అల్లరికి శ్రీకారం చుట్టేశారు. శ్వేతా అగర్వాల్ మెయిన్ హీరోయిన్ గా ఎంపికయ్యింది. చలపతిరావు, భరణి లాంటి ఒకరిద్దరు తప్ప అన్నీ కొత్త మొహాలే. 2002 మే 10న ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజైన అల్లరి యూత్ కి పిచ్చగా నచ్చేసింది. పాల్ జె సంగీతం చాలా ఫ్రెష్ గా అనిపించింది. సింపుల్ జోకులతో ఎలాంటి హడావిడి సౌండ్ లేకుండా ఇంత నీట్ గా తీయొచ్చా అని పెద్దలు సైతం ఆశ్చర్యపోయారు. కట్ చేస్తే నరేష్ కు అల్లరి ఇంటిపేరుగా మారేంత గొప్ప విజయాన్ని పేరుని సంపాదించి పెట్టింది.