iDreamPost
iDreamPost
భారతీయ భాషల్లో లెక్కలేనన్ని డబుల్ ఫోటో సినిమాలు వచ్చాయి కానీ వాటిలో ఎక్కువ ప్రభావితం చేసింది, ట్రెండ్ సెట్టర్ గా మారినవి మాత్రం మన దక్షిణాదిలోనే ఉన్నాయి. అందులో ఒకటి కళ్యాణరాముడు. 1979 సంవత్సరం. రచయిత కం నిర్మాత పంజు అరుణాచలం దగ్గర ఓ కథ ఉంది. కవలలైన అన్నదమ్ముల్లో ఒకరు ఆస్తి కోసం జరిగిన హత్య వల్ల చనిపోతే అతను ఆత్మ రూపంలో సోదరుడి శరీరంలోకి వచ్చి ప్రతీకారం తీర్చుకోవడమనే పాయింట్ చుట్టూ ఇది తిరుగుతుంది. అరుణాచలంతో పాటు భీమ్ సింగ్, ఎస్పి ముత్తురామన్ లాంటి దిగ్గజాల వద్ద పని చేసిన అనుభవం ఉన్న జిఎన్ రంగరాజన్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ దీనికి శ్రీకారం చుట్టారు.
కళ్యాణం(కమల్ హాసన్)కోట్ల ఆస్తి ఉన్నా అమాయకుడు. దీన్ని ఆసరాగా చేసుకుని బంధువులు రాబందుల్లా చేరి డబ్బును స్వాహా చేస్తుంటారు. ఓ సందర్భం చూసి ఇతన్ని చంపేసి అంతా తమ హస్తగతమైపోయిందని సంబరపడతారు. ఆత్మగా మారిన కళ్యాణం జరిగిన నిజం తెలుసుకుని మదరాసులో తన కవల సోదరుడు రాముడు(కమల్ హాసన్)దగ్గరకు వెళ్లి జరిగినదంతా చెబుతాడు. ఇద్దరూ కలిసి తమ ఎస్టేట్ కు వస్తారు. రాముడుని చూసిన షాక్ తిన్న విలన్ బ్యాచ్ ని కళ్యాణం ఓ ఆట ఆడుకుంటాడు. వాళ్ళ కుట్రలను అడ్డుకుని తన సోదరుడికి పట్టం కట్టేలా చేసి స్వర్గానికి వెళ్ళిపోతూ సెలవు తీసుకుంటాడు. ఇదీ కళ్యాణ రాముడులో కథ.
శ్రీదేవి హీరోయిన్ గా రామస్వామి, సుందరరాజన్, శ్రీనివాసన్, రాఘవన్, మనోరమా తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ఇళయరాజా మంచి ట్యూన్లు ఇచ్చారు. ముఖ్యంగా నీకే మనసు ఇచ్చా పాట అప్పట్లో మారుమ్రోగిపోయింది. తమిళంలో కళ్యాణరామన్ 1979 జులై 6న విడుదలై సంచలన విజయం నమోదు చేసుకుంది. మొదటిసారి దూరదర్శన్ లో టెలికాస్ట్ చేయాలని నిర్ణయించినప్పుడు విద్యార్థులు తమ పరీక్షల టైంలో వేయొద్దని ఉత్తరాలు రాయడం, వాళ్ళ కోరికను మన్నించి తర్వాత ప్రసారం చేయడం సంచలనం. తెలుగు డబ్బింగ్ వెర్షన్ 1980 ఫిబ్రవరి 2న రిలీజయ్యింది. అదే రోజు వచ్చిన శంకరాభరణం ప్రభంజనం తట్టుకుని సక్సెస్ అందుకుంది
Also Read : Nee Sneham : మర్చిపోలేని ఉదయ్ కిరణ్ ఆణిముత్యం – Nostalgia