iDreamPost
android-app
ios-app

Happy Birthday Ram Charan : మెగా పవర్ స్టార్ కెరీర్ గ్రాఫ్

  • Published Mar 27, 2022 | 5:00 PM Updated Updated Mar 27, 2022 | 5:00 PM
Happy Birthday Ram Charan : మెగా పవర్ స్టార్ కెరీర్ గ్రాఫ్

2007. మెగాస్టార్ గా టాలీవుడ్ నెంబర్ వన్ సింహాసనం మీద దశాబ్దాల తరబడి కూర్చున్న చిరంజీవి వారసుడు రామ్ చరణ్ తేజ్ తెరంగేట్రం జరిగిన సంవత్సరం. పూరి జగన్నాధ్ దర్శకుడిగా వైజయంతి మూవీస్ బ్యానర్ మీద నిర్మించిన ‘చిరుత’ అభిమానులకు విపరీతంగా నచ్చేసింది. సామాన్య ప్రేక్షకులు ఓకే అన్నారు కానీ గొప్పగా మెచ్చుకోలేదు. రెండేళ్ల గ్యాప్ తో ఒళ్ళు హూనం చేసుకుని రాజమౌళితో చేసిన ‘మగధీర’ 2009 మొత్తం ఊపేసింది. పాత రికార్డులు బద్దలు కొడుతూ చరణ్ స్టామినాని ప్రపంచానికి చాటింది. ఈ ఆనందం పచ్చగా ఉన్న టైంలోనే 2010లో చేసిన ‘ఆరెంజ్’ ఊహించని రీతిలో డిజాస్టర్ అయ్యి కొత్త పాఠం నేర్పించింది.

తన నుంచి ఫ్యాన్స్ ఏం కోరుకుంటున్నారో అర్థమయ్యింది. దాని ఫలితమే 2011 ‘రచ్చ’. కథ రొటీన్ గా ఉన్నా తమకు కావాల్సినవి ఉండటంతో జనం కలెక్షన్లు ఇచ్చారు. బొమ్మ సూపర్ హిట్. ఆ వెంటనే వివి వినాయక్ తమ మార్కు మాస్ స్టైల్ లో తీసిన ‘నాయక్’ (2013) కూడా రచ్చ బాటనే ఫాలో అయ్యింది. నిర్మాతకు లాభాలొచ్చాయి. అదే ఏడాది అమితాబ్ బచ్చన్ కల్ట్ క్లాసిక్ ‘జంజీర్’ని అదే టైటిల్ తో హిందీలో రీమేక్ చేయడం చరణ్ కు శాపమయ్యింది. మాములు ఫ్లాప్ కాదది. బాలీవుడ్ మీడియా దుమ్మెత్తి పోసింది. తెలుగులో ‘తుపాన్’ పేరుతో సమాంతరంగా తీసిన వెర్షన్ కూడా దానికే మాత్రం తీసిపోని రీతిలో దెబ్బ తింది.

‘ఎవడు'(2014) కమర్షియల్ సక్సెస్ తిరిగి ట్రాక్ లోకి తీసుకొచ్చింది. ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరవుదామని చేసిన ‘గోవిందుడు అందరివాడేలే'(2014)టార్గెట్ ఆడియన్స్ కి సైతం నచ్చలేదు. ‘బ్రూస్ లీ'(2015)మరో ఖరీదైన పాఠం. ‘ధృవ'(2016)తో మళ్ళీ పర్ఫెక్ట్ కంబ్యాక్. ఖాకీ డ్రెస్సులో చరణ్ అదరగొట్టాడు. ఇక ‘రంగస్థలం'(2018) తనలో పరిపూర్ణ నటుడిని బయట పెట్టిన ఇండస్ట్రీ హిట్. ‘వినయ విధేయ రామ'(2019)మాస్ కోసం అతి చేయొద్దని నేర్పించిన పాఠం. కట్ చేస్తే 2022లో ‘ఆర్ఆర్ఆర్’లో రామరాజుగా రామ్ చరణ్ విశ్వరూపం తను ప్యాన్ ఇండియా స్టార్ కావడానికి సరిపడా మెటీరియల్ అనే భరోసా ఇచ్చింది. అభిమానులు అందుకే ప్రేమగా బాస్ ని మించిపోయావంటూ చరణ్ ని మెచ్చుకుంటూ ఉంటారు. అవును వారసుడిగా బాధ్యతను సంపూర్ణంగా నెరవేరిస్తే అంతేగా

Also Read : Seetamaalakshmi : కలర్ సినిమాల ప్రభంజనంలో బ్లాక్ అండ్ వైట్ సంచలనం – Nostalgia