iDreamPost
android-app
ios-app

Gouramma Nee Mogudu Evaramma : క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి హీరోయిన్ గా సినిమా

  • Published Mar 19, 2022 | 8:30 PM Updated Updated Aug 18, 2023 | 6:09 PM
Gouramma Nee Mogudu Evaramma : క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి హీరోయిన్ గా సినిమా

1993. భాగ్యరాజ్ మంచి పీక్స్ చూస్తున్న సమయం. ఆర్టిస్టుగా కథకుడిగా దర్శకుడిగా మూడు పడవల ప్రయాణాన్ని సమర్ధవంతంగా నడిపిస్తున్నారు. తెలుగులోనూ నేను మీవాడినే, పోలీస్ బావా లాంటి డబ్బింగ్ చిత్రాలతో మార్కెట్ ఏర్పడింది. ఫ్యామిలీ ఆడియన్స్ కలిసి చూసే విధంగా ఆయన సినిమాలు ఉంటాయన్న అభిప్రాయం ప్రేక్షకుల్లో బలంగా ఉండేది. అప్పుడు తమిళంలో తీసిందే వీట్ల విశేషంగ. తనే హీరోగా ప్రగతి అనే టీవీ ఆర్టిస్టుని హీరోయిన్ గా పరిచయం చేస్తూ షూటింగ్ మొదలుపెట్టారు. ఈ ప్రగతి అంటే ఎవరో కాదు ప్రస్తుతం టాలీవుడ్ లో తల్లి వదిన అక్క చెల్లి లాంటి ఎన్నో పాత్రలు చేసి క్యారెక్టర్ ఆర్టిస్టుగా పేరు తెచ్చుకున్న ఆవిడే.

ఇళయరాజా సంగీతం అందించగా మోహన్ ఛాయాగ్రహణం సమకూర్చారు. గోపాలం(భాగ్యరాజ్) జీవితంలోకి గతం మర్చిపోయిన గౌరీ(ప్రగతి) వస్తుంది. విధిలేని పరిస్థితుల్లో డాక్టర్ బ్రతిమాలడంతో ఆమెను తన భార్యగా నమ్మించి ఇంట్లోకి రానిస్తాడు. అప్పటికే అమ్మ లేని తన బిడ్డకు ఆమెనే తల్లిగా నమ్మిస్తాడు. ముందు అర్థం కాకపోయినా గౌరీ దానికి ఒప్పుకుంటుంది. క్రమంగా అంతా అలవాటు పడుతున్న క్రమంలో గౌరీ గతానికి సంబంధించిన ఒక ముఖ్యమైన వ్యక్తి వస్తాడు. దీంతో ఆవిడ పేరు గౌరీ కాదు గంగ అని తెలుస్తుంది. అనూహ్య పరిణామాల తర్వాత అప్పటికే గోపాల్ అతని బిడ్డతో బంధం ఏర్పరుచుకున్న గౌరీ అక్కడే ఉండిపోతుంది.

మంచి సెంటిమెంట్ రంగరించిన ఈ చిత్రం తమిళంలో 1994 జనవరిలో విడుదలయ్యింది. భారీ అంచనాలతో రిలీజై భాగ్య రాజ్ బెస్ట్ వర్క్స్ లో ఒకటిగా మెప్పు పొందలేకపోయింది. అయినా కూడా ఫ్యామిలీ ఆడియన్స్ అండతో యావరేజ్ కు ఓ మెట్టు పైనే నిలిచింది. దీన్ని తెలుగులో గౌరమ్మ నీ మొగుడెవరమ్మా పేరుతో డబ్బింగ్ చేసి అదే సంవత్సరం నవంబర్ 18న రిలీజ్ చేశారు. అదే రోజు ఘరానా మరిది, అయ్యప్ప కరుణ, వయ్యారి భామలు అనే మరో మూడు అనువాదాలు వచ్చాయి కానీ గౌరమ్మనే బెటర్ అనిపించుకుంది. దీన్ని హిందీలో మిస్టర్ బేచారాగా భాగ్యరాజే రీమేక్ చేశారు. అనిల్ కపూర్ హీరో కాగా నాగార్జున ప్రత్యేక పాత్ర పోషించారు

Also Read : Moratodu : నాయుడుగారికి లక్షల నష్టం తెచ్చిన మాట – Nostalgia