iDreamPost
iDreamPost
మాములుగా హాస్య నటులు హీరోలు కావడం చాలా చూశాం. అలనాటి రాజబాబుతో మొదలుపెట్టి ఇప్పటి సునీల్ దాకా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. అయితే ఓ కమెడియన్ దర్శకుడు కావడం మాత్రం అరుదు. ఆ ఘనత నగేష్ కు దక్కుతుంది. ఆ విశేషాలు చూద్దాం. 1977. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా అశేష పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న సత్యనారాయణకు సోలో హీరోగా ఒక్క సినిమా చేయలేదన్న అసంతృప్తి అలా మిగిలిపోయింది. సెక్రటరీ వంద రోజుల వేడుకలో నిర్మాత మూవీ మొఘల్ డాక్టర్ రామానాయుడు గారు ఏదో మాట వరసకు మంచి కథ దొరికితే ఆయన్ను పెట్టి తీసేందుకు సిద్ధమని ప్రకటించడం మీడియాలో హై లైట్ అయ్యింది.
మరోవైపు సావాసగాళ్లు షూటింగ్ జరుగుతుండగా దర్శకత్వానికి సంబంధించి నగేష్ చూపిస్తున్న ఉత్సాహం నాయుడుగారికి నచ్చింది. దీంతో ఏదైనా స్టోరీ ఉంటే చూద్దాంలెమ్మని చెప్పారు. నగేష్ నిజంగానే కథ రాసుకొచ్చి వినిపించి బాగుందనే సర్టిఫికెట్ ఇప్పించుకున్నారు. ఇంకేముంది తీయమని పోరు. ఇద్దరికి మాట ఇచ్చిన రామానాయుడు గారు ఆ కాంబోలో సినిమాను ప్రకటించేశారు. అదే మొరటోడు. జయసుధ హీరోయిన్. వార్త వినగానే అభిమానులు షాక్. ఇదేం కాంబినేషనని పెదవి విరిచారు. మోహన్ బాబు, రావు గోపాల్ రావు, ప్రభాకర్ రెడ్డి, నగేష్ గిరిజ, అల్లు రామలింగయ్య, సాక్షి రంగారావు ఇతర తారాగణంగా ఎంపికయ్యారు.
ఎంఎస్ విశ్వనాధన్ సంగీతం సమకూర్చగా మోదుకూరి జాన్సన్ మాటలు వెంకట్ ఛాయాగ్రహణం అందించారు. మాంసం దుకాణం ఉండే ఓ మొరటోడుడి అందమైన భార్య వస్తుంది. కొడుకుని చేతులో పెట్టి ఆమె కన్నుమూశాక అతను ఎంత మంచివాడో చిన్నపిల్లాడైన వారసుడు ప్రపంచానికి తెలియజెప్పడమే ఇందులో మెయిన్ పాయింట్. అయిదు లక్షల బడ్జెట్ తో రామానాయుడుగారు గట్టిగానే ఖర్చు పెట్టారు. 1977 డిసెంబర్ 15న విడుదలైన మొరటోడు దారుణంగా ఫెయిల్ అయ్యింది. కథ బాగున్నప్పటికీ మిస్ క్యాస్టింగ్, నగేష్ అనుభవలేమి ప్రేక్షకులతో ఇదేం సినిమా బాబోయ్ అనిపించాయి. ఈ డిజాస్టర్ దెబ్బకు సురేష్ సంస్థకు నష్టం తప్పలేదు
Also Read : April 96′ Dubbed Releases : విషయమున్న అనువాదాలకే బ్రహ్మరథం – Nostalgia