iDreamPost
android-app
ios-app

జెడ్పి పీఠం రిజర్వేషన్లు ఖరారు

జెడ్పి పీఠం రిజర్వేషన్లు ఖరారు

రాష్ట్రంలో మండల, జిల్లాపరిషత్‌ ఎన్నికలకు సంబంధించి జిల్లాపరిషత్‌ చైర్మన్‌ పదవుల రిజర్వేషన్లను పంచాయతీ రాజ్‌ శాఖ ఖరారు చేసింది. ఈ మేరకు 13 జిల్లాల జెడ్పీ చైర్మన్‌ పదవుల రిజర్వేషన్ల వివరాలతో పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ గిరిజా శంకర్‌ గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. నాలుగు జిల్లా పరిషత్‌ (జెడ్పీ) చైర్మన్‌ పదవులు బీసీలకు, రెండు ఎస్సీలకు, ఒకటి ఎస్టీలకు రిజర్వు అయ్యాయి. మిగిలిన ఆరు జెడ్పీ చైర్మన్‌ పదవులను జనరల్‌(అన్‌రిజర్వ్‌)కు కేటాయించారు. కాగా మొత్తం 13 జిల్లా పరిషత్‌లకుగాను ఆయా కేటగిరీల వారీగా 6 మహిళలకు రిజర్వు అయ్యాయి.

73వ రాజ్యాంగ సవరణ తర్వాత 1994లో ఏపీ పంచాయతీరాజ్‌ చట్టం అమల్లోకి రాగా, అందులో పేర్కొన్న నిబంధనల మేరకు ఇప్పటి వరకు నాలుగు విడతలపాటు ‘స్థానిక’ ఎన్నికలు జరిగాయి. ఈ 4 విడతల ఎన్నికల్లోనూ నిబంధనల ప్రకారం రొటేషన్‌ పద్ధతిన జెడ్పీ చైర్మన్‌ పదవుల రిజర్వేషన్లను పంచాయతీరాజ్‌ శాఖ ఖరారు చేస్తూ వస్తోంది. అదే రొటేషన్‌ క్రమంలో ప్రస్తుతం ఐదో విడత ఎన్నికలకోసం ఆయా కేటగిరీల వారీగా రిజర్వేషన్లను ఖరారు చేశారు. ఇప్పటికే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ పదవుల రిజర్వేషన్లకు సంబంధించి జిల్లాలవారీగా ఆయా జిల్లాల కలెక్టర్లు గురువారం గెజిట్‌ నోటిఫికేషన్లు జారీ చేయడం తెలిసిందే.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 13,057 గ్రామ పంచాయతీలకు సర్పంచ్‌ పదవులతోపాటు వాటి పరిధిలో ఉండే 1,33,726 వార్డు సభ్యుల పదవుల రిజర్వేషన్లు ఖరారు చేసే ప్రక్రియను శని, ఆదివారాల్లోగా పూర్తి చేసి నోటిఫికేషన్‌ జారీ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.