Idream media
Idream media
తొలి టీ20 వరల్డ్‌కప్-2007లో ఒక ఓవర్‌లో ఆరు సిక్సర్లు కొట్టిన తొలి బ్యాట్స్‌మెన్‌గా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ రికార్డు సాధించాడు. తాజాగా నాటి సంఘటన గురించి ఒక మీడియా సంస్థతో యువీ మాట్లాడుతూ ఇంగ్లాండ్ మాజీ ఆల్‌రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ కారణంగానే తాను ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు బాదినట్లు వెల్లడించాడు.
వాస్తవానికి ఆ క్షణాన నాకు ఆరు సిక్సర్లు కొట్టాలనే ఆలోచన లేదు. ఫ్లింటాఫ్ దూషణ నన్ను హిట్టింగ్‌కి పురిగొల్పింది. ఇన్నింగ్స్ 18వ ఓవర్‌లో ఫ్లింటాఫ్ బౌలింగ్‌లో రెండు బౌండరీలు కొట్టాను. అతను అసహనానికి గురై నోరుజారాడు. ఇక అతడు ఏం తిట్టాడో సరిగా గుర్తులేదు.
కానీ నేను రెండు పేలవ షాట్లు ఆడానని మాత్రం అన్నట్లు గుర్తు. దీంతో మా ఇద్దరి మధ్య గొడవ మొదలైంది.ఈ క్రమంలో నువ్వు వెలుపలికి వెళ్లగానే నీ మెడ నరుకుతా అని ఫ్లింటాఫ్ అరిచాడు. వెంటనే నేను కూడా నా చేతిలోని బ్యాట్‌ని చూడు, ఎక్కడ కొడతానో నీకు బాగా తెలుసు అని సమాధానమిచ్చాను. ఆ తర్వాత ఓవర్‌లో ప్రతి బంతినీ స్టేడియంలోకి కొట్టాలని నిర్ణయించుకొని బ్యాటింగ్ చేసానని యువరాజ్ తెలిపాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేపట్టిన భారత్ గంభీర్ (58),వీరేంద్ర సెహ్వాగ్(68) రాణించడంతో 16.4 ఓవర్‌లలో 155/4 పరుగులు చేసింది. ఈ దశలో బ్యాటింగ్‌కు దిగిన యువీ ఇన్నింగ్స్ 17వ ఓవర్ వేసిన ఫ్లింటాఫ్ బౌలింగ్‌లో వరుసగా రెండు ఫోర్లు కొట్టాడు. ఆ ఓవర్ ఆఖరి బంతికి నాన్‌స్ట్రైక్ ఎండ్‌వైపు వెళ్తున్న యువీని రెచ్చగొట్టు ఫ్లింటాఫ్ నోటి దురుసును ప్రదర్శించాడు. దీంతో ఒక్కసారిగా ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలి ఘర్షణ నెలకొంది. చివరకు మైదానంలోని ఫీల్డ్ అంపైర్ కలగజేసుకుని ఇరువురికి సర్ది చెప్పాడు.
ఫ్లింటాఫ్ రెచ్చగొట్టే మాటలతో తనకు పట్టరాని కోపం వచ్చిందని తెలిపాడు. ఈ క్రమంలోనే హిట్టింగ్‌తో ఫ్లింటాఫ్‌కు సమాధానం చెప్పాలని నిర్ణయానికి వచ్చినట్లు యువరాజ్ చెప్పాడు. తర్వాత ఓవర్ వేసిన స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో వరుసగా ఆరు బంతులను సిక్సర్లుగా బాదేశాడు. దీంతో టీ20 క్రికెట్‌లో ఒక ఓవర్‌లో ఆరు సిక్సర్లు కొట్టిన తొలి బ్యాట్స్‌మెన్‌గా యువీ చరిత్ర సృష్టించాడు.
మైదానంలో సునామీ సృష్టించిన యువీ కేవలం 16 బంతులలో 3 ఫోర్లు,7 సిక్స్‌లతో 58 పరుగులు చేశాడు. అయితే భారత ఇన్నింగ్స్ చివరలో ఒక బంతి మిగిలి ఉండగానే ఫ్లింటాఫ్ బౌలింగ్‌లోనే ఔట్ అవ్వడం గమనార్హం. ఇంగ్లాండ్‌పై18 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది.