iDreamPost
iDreamPost
ఏదైనా అనుకున్నది సాధించాలంటే అన్నింటికీ ఎదురొడ్డి నిలవాల్సిందే . ఏటికి ఎదురీత అని ఎంతోమంది అనుకున్నా, నిలబడి ముందుకు సాగితేనే అనుకున్నది సాధించగలరు. ఈ విషయం ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ సిపి వ్యవస్థాపకుడు జగన్మోహన్ రెడ్డి విషయంలో స్పష్టం అయింది. దశాబ్ద కాలం క్రితం పార్టీని స్థాపించి ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని చివరకు విజయ తీరాలకు చేరిన నాయకుడిగా జగన్ నిలబడ్డారు. చరిత్రలోనే ప్రత్యేకతను సాధించారు.
అప్పట్లో అంతా కాంగ్రెస్ హవా నడుస్తోంది. ఆ దశలో అధికారాన్ని ఢీ కొట్టాలంటే ఆషామాషీ వ్యవహారం కాదు. అందులోనూ కుటుంబ పెద్దను కోల్పోయిన తర్వాత అది అసామాన్యం. అదే సమయంలో సొంత పార్టీ ఏర్పాటు చేసుకునే సమయానికి జగన్ రాజకీయ అనుభవం కూడా అంతంత మాత్రమే అయినా జగన్ ఒంటరిగా నిలబడ్డారు. ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ రాష్ట్రంలో అనూహ్యంగా ఎదిగేందుకు కు అష్టకష్టాలు పడ్డారు. ఆఖరికి గతంలో ఏపీకి చెందిన రాజకీయ నాయకుడు అనుభవించని రీతిలో జైలు జీవితానికి సైతం సిద్ధమయ్యారు. మానసికంగా, ఆర్థికంగా ఎదురు దెబ్బలు తింటూ రాజకీయంగా నిలబడేందుకు ప్రయత్నాలు సాగించారు. నిబ్బరంగా నిలబడి నేతగా గుర్తింపు సాధించారు.
ఆరంభ కష్టాలు అధిగమించిన ఆయనకు ఆ తర్వాత కూడా విజయాలు అంత సులువుగా దక్కలేదు. ఆవిర్భావం తర్వాత తొలి సాధారణ ఎన్నికలను ఎదుర్కోవడానికి ఆయన నాయకత్వంలోని పార్టీ సర్వశక్తులూ ఒడ్డి పోరాడింది అయినా తృటిలో విజయాన్ని చేజార్చుకుని, సమస్యల సుడిగుండంలో చిక్కుకుంది. ఒక ప్రాంతీయ పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత తొలి ఎన్నికల్లో పరాజయం పాలైతే పార్టీని కాపాడుకోవడం అంత సులువు కాదు. ప్రతిపక్ష పాత్రలో కొనసాగుతూ , నాయకులు శ్రేణులను చివరిదాకా నిలబెట్టుకోవడం ఒకరకంగా సవాళ్లతో కూడిన సమరమే. పైగా జగన్ తమ లక్ష్యాల సాధనలో విపక్షంలో ఉండగా ఊపిరి సలపని ఒత్తిడిని ఎదుర్కొంటూ ముందడుగు వేశారు పాదయాత్ర లాంటి కార్యక్రమాలతో నిత్యం ప్రజల్లో ఉండే నాయకుడు అనే తనకున్న బ్రాండ్ ఇమేజ్ ను మరింత పెంచుకున్నారు. ప్రతిపక్షం నుంచి అధికార పక్షం గా మారాలని ఆయన పడిన తపనకు అలాంటి ప్రయత్నాలన్ని మార్గం సుగమం చేశాయి.
ఎనిమిదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత చివరకు అధికారం వైపు జగన్ అడుగులు పడ్డాయి. అనుకూల పరిస్థితుల సృష్టించుకోవటం నుంచి అధికారం అందిపుచ్చుకోవడం ద్వారా తాను అనుకున్నది 2019 సాధారణ ఎన్నికల్లో సాధించారు. వై ఎస్ ఆర్ సి పి పదేళ్ల ప్రస్థానంలో అడుగుపెట్టే సమయానికి అధికారపక్షం లో తల ఎత్తుకుని నిలబడేలా చేయగలిగారు. ఇది వై ఎస్ ఆర్ సి పి ఒక పార్టీగా దశాబ్ద కాలం సంబరమే కాకుండా వ్యక్తిగతంగా జగన్ జీవన సమరంలో సాధించిన సక్సెస్ కి చిహ్నంగా నిలుస్తుందని చెప్పడం నిస్సందేహం.
ఒక వ్యక్తిగా ఆయన అనుకున్నది సాధించారని, పార్టీని సమూహ శక్తిగా మార్చడంలో విజయవంతమయ్యాయని ఈనాటి పరిస్థితి చెబుతోంది. ఒక్కడిగా ప్రారంభించి.. వందలు, వేలు, లక్షల మంది అభిమానాన్ని జగన్ దక్కించుకోవడంలో అనేక అంశాలు తోడయ్యాయి. అదే సమయంలో సవాలక్ష చిక్కులు ఎదురయ్యే అవకాశం రాగానే సంబురపడి, సమస్యలు వచ్చినప్పుడు మల్లగుల్లాలు పడే మనస్తత్వంతో కాకుండా ఎలాంటి ఆటుపోట్లను ఎదుర్కోవడానికైనా ఒక సైనికుడిలా జగన్ చేసిన ప్రయత్నాల ఫలితమే ఈనాటి వైఎస్సార్సీపీ అధికార దర్పం. పాలక పక్షంలో కూడా వైఎస్సార్ సీపీకి , ఆ పార్టీ అధినేతగా జగన్ కి సవాలక్ష సమస్యలు ముందుకు వస్తూనే ఉంటాయి. అధికారం సాధించామనే ఆనందంతో సమస్యల పట్ల ఏమరపాటు ప్రదర్శిస్తే ఎవరికైనా చివరకు చిక్కులే ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది.
ఎప్పటి సమస్యను అప్పుడే పరిష్కరిస్తూ, ఏ రకమైన సమస్య కు తగ్గట్టుగా అలాంటి పరిష్కార మార్గాలను అన్వేషిస్తూ ముందుకు సాగితేనే పార్టీ అయినా.. వ్యక్తి గా అయినా అభివృద్ధి పథాన కొనసాగుతారు. ఈ సూత్రం వైఎస్ఆర్సిపి కి , జగన్ కి కూడా వర్తిస్తుంది అందుకు తగ్గ విధానాలు, వైఖరిని ప్రదర్శించాల్సి ఉంటుంది. తెలుగు ప్రజల్లో వైఎస్ఆర్ మాదిరిగా చిరస్థాయిగా నిలిచిపోవాలనే జగన్ కోరిక నెరవేరినందుకు సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఇప్పటి వరకు అధికార పార్టీ గా దక్కిన అనుకులతను సొమ్ము చేసుకోవడంలో జగన్ విజయవంతం అవుతున్నారు. కానీ కాలం ఎప్పుడూ ఒకే మాదిరిగా ఉండదు. ప్రజల్లో అభిప్రాయాలు ఎల్లవేళలా ఇదే రీతిలో ఉండవు. అందుకే అన్నింటినీ ఎదుర్కోడానికి అన్ని రకాలుగా ఢీ కొట్టడానికి ఇప్పటవరకూ మనోధైర్యంతో కనిపించిన జగన్ తన పాలనా వ్యవహారాల్లో కూడా అదే వైఖరితో సాగాల్సి ఉంది. ఇప్పటికే దక్కిన విజయాలతో సంతృప్తి పడిపోతారా లేక భవిష్యత్తులో ఆయన అనుకున్నట్టుగా ముప్పై ఏళ్ల ముఖ్యమంత్రిగా నిలబడిపోతారా అన్నది కాలమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది.
(వైస్సార్సీపీ పదవ వసంతంలో అడుగుపెట్టిన సందర్బంలో )