iDreamPost
android-app
ios-app

వైఎస్సార్‌ ఆర్‌బీకే వేదికగా సీఎం జగన్‌ మరో సరికొత్త ఆలోచన

వైఎస్సార్‌ ఆర్‌బీకే వేదికగా సీఎం జగన్‌ మరో సరికొత్త ఆలోచన

గ్రామీణ ప్రగతిపైనే దేశ ప్రగతి ఆధారపడి ఉంటుంది. 1991లో వచ్చిన ఆర్థిక సంస్కరణ తర్వాత (ఎల్‌పీజీ– లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్‌) గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైంది. చేతి వృత్తులు ధ్వంసం అయ్యాయి. మల్టినేషన్‌ కంపెనీలు(ఎంఎన్‌సీ), బడా కార్పొరేట్‌ ఫెస్టిసైడ్స్, సీడ్స్‌ కంపెనీల వల్ల వ్యవసాయ రంగంలో స్వయం సంవృద్ధి క్షీణించింది. ప్రైవేటు కంపెనీల రాక. సిండికేట్‌తో సహకార పాడి పరిశ్రమ కుదేలైంది. ప్రైవేటు కంపెనీలు పాలకు ఇచ్చిందే ధర. ప్రస్తుతం ఇలాంటి పరిస్థితిలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పూర్వస్థితికి తీసుకొచ్చేందుకు వైసీపీ సర్కార్‌ శాశ్వత ప్రాతిపదికన విప్లవాత్మక సంస్కరణలు చేపడుతోంది.

గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అనే బండికి వ్యవసాయం, పాడి.. జోడు చక్రాలు కాగా.. ఆ బండికి ఇంజన్‌లా వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలు పని చేస్తున్నాయి. గత నెల ఒకటో తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 13 వేల గ్రామ సచివాలయాల వద్ద ప్రారంభించిన వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాల ద్వారా వ్యవసాయానికి అవసరమైన విత్తనాల నుంచి ఎరువులు.. పంట బీమా, మద్ధతు ధర వరకూ అక్కడ నుంచే అన్నదాతలకు జగన్‌ సర్కార్‌ అందిస్తోంది. త్వరలో బ్యాంకుల ద్వారా పంట రుణాలు కూడా వైఎస్సార్‌ ఆర్‌బీకేల నుంచి మంజూరు చేయించాలని నిర్ణయించింది.

వైఎస్సార్‌ ఆర్‌బీకేల ద్వారా వ్యవసాయానికి అవసరమైన అన్ని చర్యలు చేపట్టిన సీఎం జగన్‌.. తాజాగా పాడి పరిశ్రమపై దృష్టి పెట్టారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని సహకార సంఘాలను బలోపేతం చేస్తామని, సహకారడైరీలకు పాలు పోసే రైతులకు ప్రోత్సాహకాలు అందిస్తామని ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో సీఎం జగన్‌ హామీ ఇచ్చారు. లీటర్‌కు నాలుగు రూపాయల చొప్పన రైతులకు ప్రొత్సాహకం అందిస్తామని ప్రకటించారు. ఈ మేరకు సహకార డైరీలను బలోపేతం చేసేందుకు అమూల్‌ సంస్థతో నిన్న సోమవారం ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ సమయంలో సీఎం జగన్‌ కీలక ప్రకటన చేశారు.

త్వరలోనే వైఎస్సార్‌ ఆర్‌బీకేల ద్వారా పాల సేకరణ కూడా ప్రారంభిస్తామని సీఎం జగన్‌ చెప్పారు. అంటే.. ప్రభుత్వమే పాలను నేరుగా రైతుల నుంచి సేకరించి వారికి అండగా ఉండనుంది. సరైన వెన్న శాతం, తూకం, అందుకు తగ్గ ధర.. ఆర్‌బీకేల ద్వారా రైతులకు అందనుంది. అంతేకాకుండా పశువులకు అవసరమైన దాణా, గడ్డి విత్తనాలు, ఉచిత పశువైద్యం అదించేందుకు ఆర్‌బీకేలలోనే వెటర్నరీ అసిస్టెంట్‌ అందుబాటులో ఉండనున్నారు. మరో రెండేళ్లలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా మారిపోయి.. గ్రామీణ ప్రజలు ఆర్థికంగా పరిపుష్టి అయ్యే అవకాశాలు జగన్‌ సర్కార్‌ తీసుకుంటున్న చర్యల ద్వారా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇందుకు వైఎస్సార్‌ ఆర్‌బీకేలు వేదికలుగా నిలవబోతున్నాయి.

Read Also : జగన్‌ దూకుడు: మరో పథకం అమలుకు ముహూర్తం ఖరారు