iDreamPost
iDreamPost
గ్రామసీమల్లో దశాబ్దాలుగా ఉన్న భూమి వివాదాల పరిష్కారమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్సార్- జగన్ శాశ్వత భూ రక్ష పథకం అమలులోకి తెచ్చింది. గ్రామాల్లో ఏళ్ల తరబడి రైతుల మధ్య పొలం గట్ల వివాదాలు కొనసాగుతుంటాయి. అవి ఎటూ తేలక ఇరువైపుల వారు తీవ్ర ఇబ్బందులు పడతారు. కొందరు కోర్టుల చుట్టూ తిరుగుతారు. ఎంతో డబ్బును ఖర్చు చేస్తారు. అయినా పరిష్కార మార్గాలు అంత త్వరగా దొరకవు. ఆ వివాదాలు పరిష్కారం అయ్యే సరికి కొందరు ప్రాణాలు కూడా కోల్పొతుంటారు. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించడం కోసమే ప్రభుత్వం ఈ కొత్త పథకాన్ని తీసుకు వచ్చింది.
సమగ్రంగా భూ సర్వే..
ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన ప్రభుత్వం సమగ్ర భూ సర్వేకు సిద్దపడింది. డ్రోన్ల సాయంతో పైలట్ ప్రాజెక్ట్ గా రాష్ట్ర వ్యాప్తంగా 51 గ్రామాల్లో ఈ సర్వేను ప్రారంభించింది. యూటీఎం కో ఆర్డినేట్స్ ద్వారా కొలతలు తీసుకుని సర్వే రాళ్లు నాటుతున్నారు. ఏ కొంచెం తేడా లేకుండా భూమి యజమానుల సమక్షంలో కొలతలు సరి చూస్తున్నారు. ఆ గ్రామాల్లో భూ యజమానులకు నోటీసులు ఇచ్చి, వారి హక్కు పత్రాల ఆధారంగా గ్రామ సర్వే బృందం చూపిస్తున్న సరిహద్దులు మార్కింగ్ చేస్తున్నారు.
భూ హక్కు పత్రాలు ఇచ్చేందుకు సన్నద్దాలు..
భూ యజమానుల అంగీకారంతో ఏ సర్వే నంబరు వారికి చెందిందో ఆదే సర్వే నంబరులో భూమి వారికి చూపుతారు. నూతన టెక్నాలజీ సాయంతో ఎటువంటి తేడాలు లేకుండా రైతులందరికి భూ హక్కు పత్రాలు అందజేయడానికి రంగం సిద్ధం అవుతోంది.
ఆస్థి సర్టిఫికెట్లు కూడా..
గ్రామ కంఠం, ఇల్లు లేదా ఖాళీ స్థలం ఉన్నవారికి ఆస్థి సర్టిఫికెట్లు ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ప్రతి సర్వే నంబరుకు జీపీఎస్ కోఆర్డినేటర్ ఉండటం వల్ల ఎవరి భూమి వారికి మాత్రమే చెందుతుంది.
Also Read : జగన్ ఏం చెప్పారో.. అదే చేస్తున్నారు..
సర్వే పై అవగాహన..
ఈ భూ సర్వేపై గ్రామాల్లోని రైతులకు, భూ యజమానులకు అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. సాంకేతికత సహాయంతో పూర్తి పారదర్శకంగా జరిగే ఈ సర్వే వల్ల ఎవరికీ ఎటువంటి నష్టం ఉండదని వారిని చైతన్య పరుస్తున్నారు.
కేబినెట్ సబ్ కమిటీ సమీక్షలు..
ఈ శాశ్వత భూ రక్ష పథకం అమలుకు ప్రభుత్వం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీని నియమించింది. మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన కృష్ణదాస్ ఇందులో సభ్యులు. ఈ సర్వేకు సంబంధించి వీరు సమీక్షలు నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు అధికారులకు సూచనలు ఇస్తారు. సర్వే ఆఫ్ ఇండియా చట్టం ప్రకారం 70 కోర్ సర్వే సబ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. పంచాయతీరాజ్, ఆర్ఓఆర్ చట్టాలకు సవరణలు చేసి ఏ ఆటంకం లేకుండా సర్వే సాగేలా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంది.
ఈ నెలలో సర్టిఫికెట్ల జారీ..
రాష్ట్ర వ్యాప్తంగా 51 పైలట్ గ్రామాల్లో సర్వే పూర్తి కావడంతో ఆయా అక్కడి రైతులకు, భూ యజమానులకు శాశ్వత భూ హక్కు పత్రాలు ఈ నెలలో అందజేయడానికి అధికార్లు ఏర్పాట్లు చేస్తున్నారు.
2023 నాటికి సర్వే పూర్తి..
రైతులు, భూ యజమానులు సర్వే సిబ్బందికి పూర్తి అవగాహనతో సహకరిస్తే 2023 సంవత్సరం నాటికి రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ఈ సర్వే పూర్తి అవుతుంది. ఇందుకు తగ్గ కార్యాచరణతో అధికార యంత్రాంగం ముందుకు సాగుతోంది. భూ వివాదాలతో ఏళ్ల తరబడి అమూల్యమైన కాలాన్ని, డబ్బును ఎవరూ వృథా చేసుకోకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం కష్ట సాధ్యమైన ఈ సర్వేకు నడుం బిగించింది. జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని ప్రభుత్వం ముందుచూపును రాష్ట్రంలోని జనం మెచ్చుకుంటున్నారు.
Also Read : ఏపీలో ఆ పధకం తెచ్చిన మార్పులు ఏమిటి..?