Idream media
Idream media
వైఎస్సార్ తెలంగాణ పార్టీ (వైఎస్సార్‌టీపీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పేరుతో తలపెట్టిన పాదయాత్ర నేడు బుధవారం ప్రారంభం కాబోతోంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి షర్మిల పాదయాత్ర ప్రారంభించబోతున్నారు. తెలంగాణలో పార్టీని ఏర్పాటు చేసిన షర్మిల.. తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సంక్షేమ పాలన తేవడమే లక్ష్యమని ప్రకటించారు. ఈ నేపథ్యంలో.. తెలంగాణ ప్రజల కష్టాలు, బాధలు తెలుసుకునేందుకు పాదయాత్ర చేస్తున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర పేరునే (ప్రజా ప్రస్థానం) షర్మిల తన పాదయాత్రకు పెట్టుకున్నారు.
చెవెళ్ల నుంచి ఈ రోజు ఉదయం 11 గంటలకు పాదయాత్ర ప్రారంభం కాబోతోంది. 400 రోజుల పాటు పాదయాత్ర కొనసాగనుంది. తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ, 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. షర్మిల పాదయాత్ర 14 లోక్‌సభ, 90 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 4 వేల కిలోమీటర్ల మేర సాగబోతోంది. ప్రతి రోజు ఉదయం 8:30 గంటలకు ప్రారంభమయ్యే మధ్యాహ్నం 12:30 గంటల వరకు సాగుతుంది. విరామ సమయంలో స్థానికులతో ‘మాట – ముచ్చట’ పేరిట షర్మిల ఆత్మీయ సమావేశం నిర్వహిస్తారు. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యే పాదయాత్ర సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగుతుంది.
పాదయాత్రలో భాగంగా ప్రతి మంగళవారం షర్మిల ఎక్కడ ఉంటే.. అక్కడ శిబిరాన్ని ఏర్పాటు చేసి నిరుద్యోగ దీక్ష చేస్తారు. షర్మిల పాదయాత్ర చేయడం ఇది రెండోసారి. ఏపీలో వైసీపీ ఆవిర్భావం తర్వాత.. మరో ప్రజా ప్రస్థానం పేరిట ఆమె పాదయాత్ర చేశారు.
Also Read : Punjab Amarinder -అమరీందర్ కొత్త పార్టీ.. బీజేపీతో కలిసి పోటీ