Idream media
Idream media
ప్రజాసంక్షేమం, జీవనప్రమాణాల పెంపే లక్ష్యంగా పాలన కొనసాగిస్తున్న వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ సర్కార్ తాజాగా మరో సేవను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమైంది. నెలలు నిండి కాన్పు కోసం ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లేవారికి, కాన్పు తర్వాత తల్లిని, నవజాత శిశువును సురక్షితంగా మళ్లీ ఇంటికి చేర్చేందుకు 108 ‘ వైఎస్సార్ తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్’ వాహన సేవను అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 500 అధునాతన, ఎయిర్‌కండిషన్డ్ గల వాహనాలను సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఈ రోజు విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద జెండా ఊపి ప్రారంభించబోతున్నారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పుకు వచ్చేవారికి ఈ సేవలు అందనున్నాయి. నిండు గర్భిణిని, సహాయకులు ఇద్దరిని ఈ వాహనంలో ఆస్పత్రికి తీసుకువస్తారు. వైఎస్సార్ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవలు కావాల్సిన వారు 102 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేస్తే చాలు.. వాహనం ఇంటివద్దకు వస్తుంది. ఆస్పత్రిలో ఉచితంగా కాన్పు చేయడంతోపాటు తల్లి విశ్రాంతి సమయంలో వైఎస్సార్ ఆసరా పథకం కింద ఐదువేల రూపాయలు ఇవ్వనున్నారు. కాన్పు తర్వాత మళ్లీ అదే వాహనంలో తల్లిని, బిడ్డలను వారితోపాటు ఇద్దరు సహాయకులను ఇంటికి క్షేమంగా చేర్చనున్నారు. ఏడాదికి దాదాపు నాలుగు లక్షల మందికి వైఎస్సార్ తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవలు అందుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
బెంజి సర్కిల్ వేదికగా..
వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తోంది. ఈ క్రమంలోనే కోవిడ్ సమయంలో అధునాతన 108 వాహనాలను సీఎం జగన్ ప్రారంభించారు. తాజాగా వైఎస్సార్ తల్లీ బిడ్డ ఎక్స్‌ప్రెస్‌కు పచ్చజెండా ఊపబోతున్నారు. వీటికి బెంజ్ సర్కిల్ వేదిక అయింది. ఈ వాహనాలే కాదు.. మహిళల రక్షణ కోసం అందుబాటులోకి తెచ్చిన దిశ వాహనాలు, దిశ పెట్రోలింగ్ వాహనాలు, రేషన్ డోర్ డెలివరీ వాహనాలు, చెత్తసేకరణ వాహనాలను కూడా సీఎం జగన్ బెంజి సర్కిల్ నుంచే ప్రారంభించారు.