iDreamPost
android-app
ios-app

ఉన్నది ఉన్నట్లు.. జగన్ చేయలేదు కనికట్టు

ఉన్నది ఉన్నట్లు.. జగన్ చేయలేదు కనికట్టు

విపత్తు సమయంలో ప్రజలను మభ్య పెట్టడం వల్ల వచ్చే లాభం కన్నా నష్టమే ఎక్కువ. అందులోనూ ఆరోగ్య విపత్తు సంభవించినప్పుడు నిజానిజాలు కచ్చితంగా ప్రజలకు తెలియాలి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇదే సూత్రాన్ని నమ్మారు. కేంద్ర ప్రభుత్వం హడావుడిగా అప్పటికప్పుడు 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి మే నెల ఒకటో తేదీ నుంచి వ్యాక్సినేషన్ ఇస్తున్నట్లు ప్రకటించి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించిన, క్షేత్రస్థాయి పరిస్థితులను, ప్రస్తుతం కోవిడ్ టీకాలు అందుబాటులో ఉన్న వైనాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్పడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పునుకున్నారు. కేంద్రం ప్రకటించినట్లు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ మే ఒకటో తేదీ నుంచి ఈ వ్యాక్సిన్ ఇవ్వడం సాధ్యం కాదు అని, వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్ధ్యాలను లెక్కలతో సహా చెబుతూ వాస్తవ పరిస్థితిని ప్రజల ముందు ఉంచేందుకు సీఎం కంకణబద్ధులయ్యారు.

ముఖ్యమంత్రి వైయస్ జగన్ మొదటి నుంచి చెబుతున్నట్లు కోవిడ్‌తో కలసి జీవించాలన్న వాస్తవంలోకి అందరూ రావాలి. కళ్లెదుటే కనిపిస్తున్న కఠోర సత్యాలు మనకు అదే చెబుతున్నాయి. దేశంలో ప్రస్తుతం కోవిడ్‌ వ్యాక్సిన్ల ఉత్పత్తి సామర్థ్యం నెలకు 7 కోట్లు కాగా అందులో కోటి వ్యాక్సిన్లు కోవాక్సిన్‌. మిగిలినవి కోవిషీల్డ్‌ ఉన్నాయి. దేశంలో 45 ఏళ్లకు పైబడినవారు దాదాపు 26 కోట్ల మంది ఉన్నారు. వారికి నాలుగు వారాల వ్యవధిలో రెండో రెండో డోస్‌ ఇవ్వాలి. ఆ మేరకు మొత్తం 52 కోట్ల వ్యాక్సిన్లు కావాలి. తొలి డోస్‌ ఇప్పటివరకు కేవలం 12 కోట్ల మందికి మాత్రమే ఇచ్చారు. 2.60 కోట్ల మందికి రెండో డోస్‌ వేశారు. మొత్తం కలిపి చూసినా ఇప్పటివరకు వేసిన కోవిడ్‌ వ్యాక్సిన్‌ డోస్‌లు దాదాపు 15 కోట్లు మాత్రమే. అంటే 45 ఏళ్ళు పైబడిన వారికి ఇంకా 37.40 కోట్ల వ్యాక్సిన్‌ డోస్‌లు కావాలి.

స్వదేశీ టీకా ఉత్పత్తి సంస్థ భారత్‌ బయోటెక్‌ ప్రస్తుతం నెలకు కోటి వ్యాక్సిన్లు తయారు చేస్తుండగా, సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ 6 కోట్ల వ్యాక్సిన్లను తయారు చేస్తోంది. వీటితోపాటు రెడ్డీ ల్యాబ్స్‌ మే నెలలో 3 కోట్ల స్పుత్నిక్‌–వి వ్యాక్సిన్లను దిగుమతి చేసుకునే అవకాశం ఉంది. దాన్ని స్థానికంగా తయారు చేయటానికి ఇతర కంపెనీలతో చర్చలు కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ కొలిక్కి వచ్చి ఇక్కడ ఉత్పత్తి ప్రారంభం కావాలంటే కనీసం 3 నెలలైనా పడుతుంది. ఇతర సంస్థల ఉత్పత్తులు రావడానికి మరిన్ని నెలల సమయం పడుతుంది.

Also Read : హెల్త్ ఎమర్జెన్సీలో కార్పొరేటు ఆస్పత్రులను అదుపు చేయలేరా..?

ఇక కోవిషీల్డ్, కోవాక్సిన్‌ ఉత్పత్తి పెరిగితే అన్నీ కలిపి ఆగస్టు నాటికి దేశంలో నెలకు 20 కోట్ల వ్యాక్సిన్లు అందుబాటులోకి రావచ్చు. ఈ లెక్కన 37.40 కోట్ల వ్యాక్సిన్‌ డిమాండ్‌ ఆగస్టు లేదా సెప్టెంబరు నాటికి కానీ పూర్తి కాదు. ఇది అసలైన వాస్తవం. కేంద్రం చెబుతున్నట్లు మే ఒకటో తేదీ నుంచి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ వేయాలంటే ఇప్పుడున్న టీకా ఉత్పత్తి సామర్థ్యం ఏమాత్రం సరిపోదు. టీకాలు తయారీ ఏ లేనప్పుడు దానిని ప్రజలకు అందిస్తామని కల్లబొల్లి మాటలు చెప్పడం ఈ సమయంలో సహేతుకం కాదు. అందుకే ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి బాధ్యతగా ఉన్నది ఉన్నట్లు వాస్తవ పరిస్థితిని వివరించే ప్రయత్నం చేశారు.

18 – 45 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు దేశంలో 60 కోట్ల మంది ఉన్నారు. ఆ మేరకు వారికి 120 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోస్‌లు కావాలి. 45 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సినేషన్‌ పూర్తయ్యాక 18 – 45 వయసు వారికి సెప్టెంబరు నుంచి టీకాలు ఇచ్చే అవకాశం ఉంది. ఆ మేరకు వారికి వ్యాక్సినేషన్‌ పూర్తి కావడానికి మరో ఆరు నెలలు పడుతుంది. అంటే వచ్చే ఏడాది జనవరి– ఫిబ్రవరి నాటికి అందరికీ వ్యాక్సినేషన్‌ చేయగలుగుతాం. కాబట్టి దాదాపు వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు ఇదే పరిస్థితి ఉంటుంది. అప్పటి వరకు మనం జాగ్రత్తగా ఉండాలి. అందుకే పరిసరాలతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత విషయంలోను చాలా జాగ్రత్తగా ఉండాలి. మాస్కులు, భౌతికదూరం వంటివి తప్పనిసరి అని సాధారణ ప్రజానీకం అర్థం చేసుకోవాలి. అంతేతప్ప వాస్తవానికి విరుద్ధంగా ఏవేవో వార్తలు తెలుసుకొని, రాష్ట్ర ప్రభుత్వం మీద నిందలు వేయడం సరికాదు. ఉన్న పరిస్థితిని ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం, ఇప్పటికిప్పుడు 18 ఏళ్లు నిండిన వారందరికీ వ్యాక్సిన్లు వేయడం సాధ్యం కాదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన ఈ విషయాన్ని సహేతుకంగా అర్థం చేసుకోవడానికి, కరోనా జాగ్రత్తలు పాటించ డానికి అందరూ సంసిద్ధులు కావాల్సిన అవసరం ఉంది.

ఇది సీఎం జగన్ మాట

‘‘దేశంలో 45 ఏళ్లు దాటిన వారికే ఇంకా వ్యాక్సినేషన్‌ పూర్తికాలేదు. ఇపుడు ఉత్పత్తవుతున్న టీకాల సంఖ్యను బట్టి చూస్తే మరో నాలుగు నెలలు పట్టొచ్చు. సెప్టెంబర్‌ నాటికి వ్యాక్సిన్ల ఉత్పత్తి పెరిగి నెలకు 20 కోట్లకు చేరుకుంటుంది. 18 – 45 ఏళ్ల వయసున్న 60 కోట్ల మందికి 120 కోట్ల డోసులు వేయాలంటే కనీసం ఆరు నెలలు పడుతుంది. ఈ లెక్కన ఫిబ్రవరి వరకు టీకాల కార్యక్రమం కొనసాగే అవకాశముంది. వ్యాక్సినేషన్‌ పూర్తయ్యే వరకు కోవిడ్‌ కేసులు కూడా వెలుగులోకి వస్తూనే ఉంటాయి. కాబట్టి ఫిబ్రవరి వరకు పరిస్థితి ఇలాగే ఉంటుందనే విషయాన్ని గుర్తించి మనం వాస్తవంలోకి రావాలి. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ కరోనా నుంచి కాపాడుకుంటూ ముందుకెళ్లాలి. వైరస్‌ నుంచి రక్షించుకుంటూ మనుగడ సాగించాలి. మాస్కులు ధరించడం, శానిటైజేషన్, భౌతిక దూరాన్ని పాటించటం తప్పనిసరి. వ్యాక్సినేషన్‌ వేగం పెరిగే కొద్దీ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుంది. టీకాల ప్రక్రియ పూర్తయితేనే ఈ ముప్పు నుంచి పూర్తిగా బయటపడతాం’’ అని సీఎం జగన్ ఉన్నది ఉన్నట్లు చెప్పారు. ఇక జాగ్రత్తగా ఉండడం మన చేతుల్లోనే ఉంది.

Also Read : కోవాగ్జిన్‌ ధర కూడా తగ్గింది.. ఎంతో తెలుసా..?