ఏపీలో ప్లాస్టిక్‌ ఫ్లెక్సీలపై బ్యాన్‌ ప్రకటించిన సీఎం జగన్‌

పర్యావరణ పరిరక్షణ, ఆర్థిక పురోగతి నాణేనికి రెండువైపులని అందుకే ఏపీలో ప్లాస్టిక్‌ ఫ్లెక్సీలపై బ్యాన్ త‌ప్ప‌నిస‌ర‌ని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఉదయం విశాఖపట్నం ఏయూ కన్వెన్షన్‌ సెంటర్‌లో ‘పార్లే ఫర్‌ ది ఓషన్స్‌’ సంస్థతో ఎంఓయూ సందర్భంగా ఆయ‌న మాట్లాడారు. ప‌ర్యావ‌ర‌ణానికి మేలు చేసే నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించారు.

కోస్టల్‌ బ్యాటరీ నుంచి భీమిలి వరకూ ప్లాస్టిక్‌ వ్యర్థాలను వలంటీర్లు క్లీన్‌ చేశారు. ఇవాళ విశాఖలో ప్రపంచంలోనే అతిపెద్ద బీచ్‌ క్లీనింగ్‌ కార్యక్రమం జరిగిందని సీఎం జగన్ తెలిపారు. 76 టన్నుల మేర‌ ప్లాస్టిక్‌ను సేక‌రించారు. పార్లే సంస్థ సముద్రం నుంచి ప్లాస్టిక్‌ వ్యర్థాలను బయటకు తీస్తుంది. రీసైకిల్ చేస్తుంది. వాటితో క‌ళ్ల‌జోళ్ల‌వ‌ర‌కు పలు ఉత్పత్తులు తయారు చేస్తుంది. ఈ పార్లే ఫ్యూచర్‌ ఇనిస్టిట్యూట్‌ను ఏపీలో ఏర్పాటు చేస్తున్నారు. ప్లాస్టిక్‌ ఫ్లెక్సీల బ్యాన్‌ తొలి అడుగుగా అభివర్ణించిన సీఎం జగన్‌, 2027 కల్లా ఏపీని ప్లాస్టిక్‌ ఫ్రీ స్టేట్‌గా మారుస్తామని ప్రకటించారు.

ప్లాస్టిక్‌ నుంచి రీసైక్లింగ్‌ నుంచి తయారు చేసిన కళ్ల జోళ్లు, షూస్ ను ఆయ‌న ప‌రిశీలించారు. రీసైక్లింగ్‌ కళ్లజోడును పెట్టుకున్నారు. ప్ర‌జ‌ల‌కు చూపించారు.

ఏపీలో ప్లాస్టిక్‌ ఫ్లెక్సీలపై బ్యాన్‌ ప్రకటించిన సీఎం జగన్‌, క్లాత్ ఫ్లెక్సీలకు మాత్రమే అనుమతి ఉంటుందని తేల్చిచెప్పారు. పర్యావరణాన్ని రక్షిస్తూనే, ఆర్థిక పురోగతి సాధించడానికి ఏపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు నాలుగు వేల చెత్త సేకరణ వాహనాలను ఏర్పాటు చేశాం అని సీఎం జగన్ చెప్పారు. అనంతరం ప్లాస్టిక్ సేక‌ర‌ణ‌, రిసైక్లింగ్ పై ఎంవోయూ(Memorandum of Understanding)పై సంతకాలు జరిగాయి.

Show comments