Krishna Kowshik
Krishna Kowshik
మానసిక, శారీరక ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, జీవన శైలిలో మార్పులు వెరసి.. మనిషిని బలహీన పరుస్తున్నాయి. దీంతో చిన్న వయస్సులోనే అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. చిన్న పని చేసినా అలసిపోవడం, అతిగా ఆలోచించడం కారణంగా బీపీ వచ్చి కళ్లు తిరిగి పడిపోవడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. అంతే కాకుండా ఇటీవల కాలంలో చిన్న వయస్సులోనే గుండె పోటుతో మరణిస్తున్న వారి సంఖ్య నానాటికి పెరిగిపోయింది. పరుగుల పందానికి వెళ్లి ఓ సచివాలయ ఉద్యోగి మృత్యువాత పడిన ఘటన మర్చిపోక ముందే మొన్నటికి మొన్న డ్యాన్స్ చేస్తూ ఓ యువకుడు కుప్పకూలిన పోయి మరణించిన సంగతి విదితమే.
తాజాగా రాజస్తాన్ లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఇద్దరు యువకులు గుండెపోటుకు గురికాగా, ఒకరు చనిపోగా.. మరొకరిని పోలీసులు.. సీపీఆర్ చేసి బతికించారు. ఈ ఘటన బరాన్ జిల్లాలో చోటుచేసుకుంది. ఏకాదశి సందర్భంగా కొందరు యువకులు కర్రలతో స్టంట్ చేశారు. ఈ సమయంలో ఒక యువకుడు కార్డియాక్ అరెస్టుతో చనిపోగా, మరో యువకుడు కూడా గుండెపోటుతో కుప్పకూలాడు. అక్కడే ఉన్న పోలీస్ అధికారి రాజేంద్ర కుమార్ మీనా .. అతడికి సీపీఆర్ చేశారు. 5 నిమిషాల పాటు గుండెపై ప్రెస్ చేస్తూ యువకుడి ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించారు. ఎట్టకేలకు అతడు బతికి బయటపడ్డాడు. వెంటనే అతడ్ని ఆసుపత్రికి తరలించారు.