Idream media
Idream media
శాసన సభ్యుల కోటాలో ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ఆరు స్థానాలకు జరగబోతున్న ఎన్నికలు సరికొత్త చర్చలకు, సమీకరణాలకు తెరలేపాయి. ఖాళీ అయిన ఆరు స్థానాల్లో మూడు తెలుగుదేశం పార్టీవి కాగా, మరో మూడు అధికార వైసీపీవి. అయితే ప్రస్తుతం శాసన సభలో వైసీపీకి ఉన్న బలం నేపథ్యంలో ఆరు స్థానాలు కూడా వైసీపీనే గెలుచుకోవడం లాంఛనమే. ఈ నేపథ్యంలో గురువారం ఎమ్మెల్సీ అభ్యర్థులను వైసీపీ ప్రకటించింది. మహ్మద్ ఇక్బాల్, సి.రామచంద్రయ్య, కరిమున్నీసా, దువ్వాడ శ్రీనివాస్, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, చల్లా భగీరథరెడ్డిలు పెద్దల సభలో అడుగుపెట్టబోతున్నారు. మార్చి 15వ తేదీన జరిగే ఎన్నికల్లో వీరి విజయం నల్లేరుపై నడకే. అదే నెల 29వ తేదీన వారు శాసన మండలిలో సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఉపాధాయ కోటాలోనూ రెండు స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా.. అధికార పార్టీ వాటికి దూరంగా ఉంటోంది.
మేలో మరో మూడు ఖాళీలు..
ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు ముగియగానే.. మరో మూడు నెలల్లో మళ్లీ పెద్దల సభకు ఎన్నికలు జరగబోతున్నాయి. శాసన సభ్యుల కోటాలో మూడు స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. టీడీపీకి చెందిన ఎంఏ షరీఫ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, వైసీపీకి చెందిన దేవసాని చిన్న గోవింద రెడ్డిల పదవీ కాలం ఈ ఏడాది మే 24వ తేదీన ముగియబోతోంది. ఈ మూడు స్థానాలూ అధికారపార్టీ ఖాతాలో చేరుతాయి.
జూన్‌లో 11 స్థానాలు ఖాళీ..
ఈ ఏడాది జూన్ 18వ తేదీన స్థానిక సంస్థల కోటాలో మరో 11 స్థానాలు ఖాళీ అవబోతున్నాయి. వీటిలో ఇప్పటికే మూడు ఖాళీగా ఉండగా. ఏడుగురు టీడీపీ సభ్యులు, ఒక వైసీపీ సభ్యుడి పదవీ కాలం ముగుస్తుంది. టీడీపీకి చెందిన ద్వారపూడి జగదీశ్వరరావు, గాలి సరస్వతి, రెడ్డి సుబ్రమణ్యం, బుద్దా వెంకన్న, వైవీ బాబూ రాజేంద్రప్రసాద్, పప్పాల చలపతిరావు, బి.నాగజగదీశ్వరరావులు, వైసీపీకి చెందిన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. వీటికి జూన్ 18వ తేదీ లోపు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీనే మెజార్టీ స్థానాలు గెలుచుకోబోతున్న తరుణంలో ఈ 11 ఎమ్మెల్సీ స్థానాలు ఆ పార్టీ గెలుచుకోవడం సులభతరమవుతుంది.
గవర్నర్ కోటాలో నాలుగు..
గవర్నర్ కోటాలో 8 స్థానాలు ఉండగా.. నాలుగు స్థానాలు ఈ ఏడాది జూన్ 18వ తేదీన ఖాళీ కాబోతున్నాయి. ఇటీవల వైసీపీలో చేరిన పమిడి సమంతకమణి, టీడీపీకి చెందిన గౌనివాని శ్రీనివాసులు, బీద రవిచంద్ర, టీడీ జనార్థన్‌లు పదవీ విమరణ చేయబోతున్నారు. ఈ నాలుగు స్థానాలలో ముఖ్యమంత్రి సిఫార్సు మేరకు కొత్త వారిని గవర్నర్ నామినేట్ చేయడం లాంఛనమే.
ఆశానువాహులందరికీ పదవులు..
ఎన్నికలకు ముందు, తర్వాత సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పలువురుకు ఎమ్మెల్సీ పదవులు ఇస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికలకు ముందు ఉన్న పరిణామాల్లో పోటీ చేసే స్థానాలను వదులుకున్న నేతలకు, బలమైన నేతలకు సీఎం వైఎస్ జగన్ ఈ హామీని ఇచ్చారు. ఈ లిస్ట్‌లో అనేక మంది ఉన్నారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన మర్రి రాజశేఖర్‌కు ఈ సారి పదవి ఖాయంగా దక్కుతుంది. ఎన్నికల్లో చిలకలూరిపేట సీటను విడదల రజనీకి కేటాయించిన సమయంలో సీఎం వైఎస్ జగన్ మర్రి రాజశేఖర్‌ను ఎమ్మెల్సీని చేసి, మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. జూన్ నాటికి వైసీపీ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు దాటుతుంది. ఆ తర్వాత ఐదు నెలలకు మంత్రివర్గంలో 20 మందిని తప్పించి, వారి స్థానంలో కొత్తవారికి అవకాశం కల్పించనున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసే సమయంలోనే ఈ విషయం సీఎం జగన్ స్పష్టంగా చెప్పారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ అయిన ఐదు నెలలకు మర్రి రాజశేఖర్‌కు మంత్రి పదవి కూడా దక్కవచ్చు.
ఇక నెల్లూరు జిల్లాలకు చెందిన వైశ్య నేత ద్వారకానాథ్, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మోషేన్ రాజులు కూడా ఆశానువాహుల జాబితాలో ఉన్నారు. వీరితోపాటు గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారిలో పలువురు ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తున్నారు. రాజమహేంద్రవరం రూరల్ నుంచి రెండు సార్లు పోటీ చేసిన ఆకుల వీర్రాజు స్థానంలో చందన నాగేశ్వర్‌ను కో ఆర్డినేటర్‌గా నియమించారు. ఈ పరిణామంతో ఆకుల వీర్రాజు ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తున్నారు.
శాసన మండలిపై ఆధిపత్యం..
ప్రస్తుతం జరుగుతున్న ఆరు స్థానాలను వైసీపీనే గెలుచుకుంటుంది. మార్చిలో శాసన సభ్యుల కోటాలో జరగబోయే మూడు స్థానాలను, జూన్‌లో స్థానిక సంస్థల కోటాలో జరగబోయే 11 స్థానాలను అధికార వైసీపీనే గెలుచ్చుకోవడం ఖాయం. ఇక జూన్‌లోనే గవర్నర్ కోటాలో ఖాళీ కాబోతున్నా నాలుగు స్థానాలను వైసీపీ అభ్యర్థులే భర్తీ చేస్తారు. జూన్ తర్వాత శాసన మండలిలో వైసీపీదే అధిపత్యం అవుతుంది. జూన్ తర్వాత 58 స్థానాలు గల పెద్దల సభలో బలాబలాలు చూస్తే.. వైసీపీ 34, టీడీపీ 14, పీడీఎఫ్ 5, బీజేపీ 2, స్వతంత్రులు 3 చొప్పున ప్రాతినిథ్యం వహిస్తారు. ఈ దఫా తర్వాత మళ్లీ శాసన మండలికి 2023 మార్చిలో ఎన్నికలు జరుగుతాయి. ఈ దశలో నారా లోకేష్ పదవీ కాలం ముగుస్తుంది.
Read Also : విష్ణువర్థన్‌రెడ్డి దాడి మీద ఫిర్యాదు చేసేది విజయవాడలోనా?