Idream media
Idream media
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు పోటీ అనివార్యం కావడంతో ఇరు పక్షాలు తమ అభ్యర్థులు గెలిపించుకోవడానికి తటస్థ పార్టీల మద్ధతును కూడగడుతున్నాయి. ఎన్డీఏ తరఫున రెండోసారి డిప్యూటీ చైర్మన్ పదవి కోసం జేడీయూ పార్టీకి చెందిన హరివంశ్ సింగ్ పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ సహా 12 ప్రతిపక్ష పార్టీలు తమ ఉమ్మడి అభ్యర్థిగా ఆర్జేడీ పార్టీకి చెందిన మనోజ్ ఝాను బరిలోకి దింపాయి. రాజ్యసభలో ఏ వర్గానికి సంపూర్ణ మెజారిటీ లేకపోవడంతో ఎన్నికల రసవత్తరంగా మారింది.
రాజ్యసభ ఎన్నికల్లో తమ మద్ధతుపై తటస్థ పార్టీలు ఒక్కొక్కటిగా ప్రకటన చేస్తున్నాయి. ఎన్డీఏ అభ్యర్థికి తాము మద్దతు ఇస్తున్నట్లు రాజ్యసభలో ఆరుగురు సభ్యులున్న వైసీపీ ప్రకటించింది. వైసీపీ మాదిరిగానే మరో తటస్థ పార్టీ అయిన నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బీజేడీ కూడా హరివంశ్ సింగ్‌కు మద్దతు ప్రకటించింది.
శనివారం జేడీయూ అధినేత, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్.. తమ పార్టీ నేత అయిన హరివంశ్ సింగ్‌కు మద్ధతు కూడగట్టేందుకు వైసీపీ, బీజేడీ అధినేతలు వైఎస్ జగన్, నవీన్ పట్నాయక్‌లకు ఫోన్ చేశారు. బిహార్ సీఎం వినతిపై ఏపీ సీఎం వైఎస్ జగన్, ఒరిసా సీఎం నవీన్ పట్నాయక్‌లు సానుకూలంగా స్పందించారు.