iDreamPost
iDreamPost
వార్ వన్‌సైడ్ అయ్యింది. ఫ్యాన్ జోరుకు ఎదురేలేకుండాపోయింది. వైఎస్సార్‌సీపీపై ఓటర్లు కురిపించిన ఓట్ల వర్షం ఉప్పెనగా మారి ఉత్తరాంధ్రలో టీడీపీని ఊడ్చిపారేసింది. ఇంతకాలం టీడీపీ కంచుకోటలుగా పేరున్న పట్టణాలన్నీ మూకుమ్మడిగా ఆ పార్టీని తిరస్కరించి వైఎస్సార్‌సీపీకి పట్టం కట్టారు. ఇటీవలి పంచాయతీ ఎన్నికలు.. రెండేళ్ళ క్రితంనాటి సార్వత్రిక ఎన్నికలను మించి ఆదరించారు. అధికార పార్టీ ప్రభంజనంలో గ్రేటర్ విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు ప్రతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలు సైతం దాసోహమన్నాయి.
రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చన్నాయుడు సొంత జిల్లా శ్రీకాకుళంలో ఎన్నికలు జరిగిన మూడు మున్సిపాలిటీల్లోనూ టీడీపీకి ఘోర పరాభవం ఎదురైంది. ఇక విశాఖ నగర పరిధిలో గత ఎన్నికల్లో టీడీపీని గెలిపించిన నాలుగు నియోజకవర్గాలు ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకే జై కొట్టాయి. ఆదివారం ఉదయం మొదలైన ఎన్నికల కౌంటింగ్ లో తొలి నుంచీ ఆ పార్టీ జోరు కనబర్చింది. ఒక్క నర్సీపట్నంలో తప్ప టీడీపీ ఎక్కడా పోటీ ఇవ్వలేకపోయింది.
ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లోని అన్ని పట్టణాలు, నగర పంచాయతీ వైస్సార్సీపీ గెలుచుకుంది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల పరిధిలో గ్రేటర్ విశాఖ కార్పొరేషన్తో పాటు విజయనగరం , శ్రీకాకుళం కార్పొరేషన్లు ఉండగా కోర్ట్ కేసు కారణంగా శ్రీకాకుళం లో ఎన్నికలు నిర్వహించలేదు. 8 మున్సిపాలిటీలు, రెండు నగర పంచాయతీలకుగాను శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో ఎన్నిక జరగలేదు. ఎన్నికలు జరిగిన ఏడు మున్సిపాలిటీలు, రెండు నగర పంచాయతీలను కైవసం చేసుకున్న వైఎస్సార్‌సీపీ.. గ్రేటర్ విశాఖ, విజయనగరం కార్పొరేషన్లలో అధికార పీఠాలు చేజిక్కించుకునేందుకు అవసరమైన సీట్లు ఇప్పటికే సాధించి.. మరింత ఆధిక్యత దిశగా దూసుకుపోతోంది.
Also Read : విజయవాడ, గుంటూరు కార్పోరేషన్ల తీర్పు సారాంశం అదేనా
గ్రేటర్ విశాఖలో దూకుడు
అత్యంత ప్రతిష్టాత్మకమైన గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ లో తొలిసారి జెండా పాతే దిశగా వైఎస్సార్‌సీపీ దూసుకుపోతోంది. జీవీఎంసీలో మొత్తం 98 డివిజన్లకు గాను.. మేయర్ పీఠం దక్కించుకునేందుకు అవసరమైన మెజారటీ సీట్లను ఇప్పటికే తన ఖాతాలో వేసుకుంది. తన విజయాన్ని ఖాయం చేసుకుంది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం ఆ పార్టీ 58 డివిజన్లలో జయకేతనం ఎగురవేసింది. మరో పది డివిజన్లలో ఆధిక్యతలో ఉంది. ఈ నగరంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న టీడీపీ 29 డివిజన్లకే పరిమితమైంది. బీజేపీ-జనసేన కూటమి మూడు చోట్ల, సీపీఎం 2 చోట్ల ఆధిక్యంలోఉన్నారు. ఉదయం జరిగిన
పోస్టల్ బ్యాలట్ల లెక్కింపులోనూ వైఎస్సార్‌సీపీ ఆధిక్యత సాధించింది.
విశాఖ జిల్లాలో..
జిల్లాలోని యాలమంచిలి మున్సిపాలిటీని వైస్సార్సీపీ తన ఖాతాలో వేసుకుంది. ఇక్కడ మొత్తం 25 వార్డులు ఉన్నాయి. ఏకగ్రీవమైన 3 వార్డులతో కలుపుకొని వైస్సార్సీపీ 23 వార్డులను చేజిక్కించుకుంది. మరో వార్డును ఆ పార్టీ రెబల్ కైవసం చేసుకోగా.. టీడీపీ రెండు వార్డులకు పరిమితమైంది. నర్సీపట్నంలో మాత్రం టీడీపీ గట్టి పోటీ ఇచ్చినా గెలుపు ముంగిట చతికిలపడింది. మొత్తం 28 వార్డుల్లో.. వైఎస్సార్‌సీపీ 14, ఆ పార్టీ రెబల్ అభ్యర్థి ఒకటి చేజిక్కించుకోగా టీడీపీ 12 చోట్ల, ఇండిపెండెంట్ అభ్యర్థి ఒకచోట విజయం సాధించారు.
Also Read : సత్తా చాటిన అన్నా రాంబాబు.. పత్తాలేని జనసేన
శ్రీకాకుళంలో స్వీప్
శ్రీకాకుళం జిల్లాలో ఎన్నికలు జరిగిన రెండు మున్సిపాలిటీలు, ఒక నగర పంచాయతీల్లో వైస్సార్సీపీ పాగా వేసింది. పాలకొండ నగర పంచాయతీలో 20 వార్డులు ఉండగా.. ఏకగ్రీవం చేసుకున్న రెండు వార్డులతో కలుపుకొని మొత్తం 17 చోట్ల అధికార పా
ర్టీ విజయం సాధించింది. టీడీపీకి మూడు వార్డులు దక్కాయి.
ఇచ్చాపురంలో 23 వార్డులకు గాను 15 వార్డుల్లో వైస్సార్సీపీ, 6 చోట్ల టీడీపీ విజయం సాధించాయి. రెండు వార్డుల్లో స్వతంత్రులు గెలిచారు.
పలాస-కాశీబుగ్గలో 31 వార్డులకు 2 అధికార పార్టీకి ఏకగ్రీవమయ్యాయి. వీటితో కలుపుకొని 23 వార్డుల్లో గెలవడం ద్వారా ఆ పార్టీ మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. టీడీపీ ఎనిమిది వార్డలు దక్కించుకుంది.
విజయనగరంలో విజయ బావుటా
విజయనగరం జిల్లాలో ని విజయనగరం నగర పాలక సంస్థలో ఆధిక్యంలో ఉన్న వైస్సార్సీపీ సాలూరు, నెల్లిమర్లలను తన ఖాతాలో వేసుకుంది. సాలూరులో 29 వార్డులకు గాను..అధికార పార్టీ 20 చోట్ల గెలిచింది. టీడీపీ 5 చోట్ల గెలవగా, స్వతంత్రులు 4 వార్డులను చేజిక్కించుకున్నారు. నెల్లిమర్ల నగర పంచాయతీలో 20 వార్డులకు గాను వైస్సార్సీపీ ఖాతాలో 11 వార్డులు చేరాయి. టీడీపీ 7, స్వతంత్రులు 2 చోట్ల విజయం సాధించారు. పార్వతీపురంలో 30 వార్డులు ఉండగా.. ఏకగ్రీవం చేసుకున్న 6 వార్డులతో కలిపి 22 వార్డుల్లో వైస్సార్సీపీ విజయం సాధించింది. టీడీపీ 5, స్వతంత్రులు 2 వార్డులు దక్కించుకున్నారు.
బొబ్బిలి కోటలో వైఎస్సార్‌సీపీ పాగా వేసింది. మొత్తం 31 వార్డులకు గాను.. 19 వార్డుల్లో విజయం సాధించింది. టీడీపీ 11 చోట్ల విజయం సాధించడం ద్వారా తన ఉనికిని చాటుకోగలిగింది. స్వతంత్ర అభ్యర్థి ఒక వార్డులో విజయం సాధించారు.
Also Read : సీమ సింహాలు! జోరుగా..
విజయనగరం కా ర్పొరేషన్ లో 50 వార్డులకు గాను ఇప్పటికే మెజారిటీకి అవసరమైన డివిజన్లను వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. 26 డివిజన్లలో ఆ పార్టీ విజయకేతనం ఎగురవేసింది. టీడీపీ ఒక్కచోటే గెలిచింది. ఇక్కడ కౌంటింగ్ ఇంకా కొనసాగుతోంది.