iDreamPost
iDreamPost
మనకు సంబంధం లేని ఒక తమిళ సినిమా గురించి ప్రత్యేకంగా ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందనే సందేహం మీకు రావొచ్చు. కానీ కారణం ఉంది. గత ఏడాది చివర్లో రిలీజై విమర్శకుల ప్రశంసలతో పాటు థియేట్రికల్ గానూ మంచి విజయం సాధించిన ఈ మూవీ మీద అక్కడ పెద్ద చర్చే జరిగింది. ముఖ్యంగా పోలీస్ వ్యవస్థలో చీకటి కోణాన్ని విసరణై తర్వాత ఇందులోనే ఆ స్థాయిలో ఆవిష్కరించారు. సముతిరఖని టైటిల్ రోల్ పోషించిన ఈ థీమ్ మూవీ ఇటీవలే ఆహా తమిళ్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు డబ్బింగ్ , రీమేక్ కు సంబంధించిన లీకులేవీ రాలేదు కానీ అసలు సినిమాలో ఏముందో ఎలా ఉందో రిపోర్ట్ లో చూద్దాం
తంగరాజ్(సముతిరఖని)పోలీస్ స్టేషన్ లో రైటర్. చాలా నిజాయితీగా ఉంటాడు. చదువు కోసం పల్లెటూరి నుంచి వచ్చి పిహెచ్డి చేస్తున్న ఓ యువకుడిని పోలీసులు అపహరించి లాడ్జ్ లో ఉంచుతారు. అనుకోకుండా అది తంగరాజ్ ద్వారానే మీడియాకు తెలిసి రచ్చ అవుతుంది. దీంతో ఆ కుర్రాడి మీద అక్రమ ఆయుధాల దొంగ కేసు బనాయించి నక్సలైట్ గా ముద్రవేసి రిమాండ్ కు తీసుకెళ్తారు. అతన్ని బయటికి తీసుకొచ్చే బాధ్యతలు తీసుకున్న తంగరాజ్ తన ఉద్యోగాన్ని పణంగా పెట్టి కాపాడతాడు. కానీ ఫలితం దక్కదు. తనే ఆ అబ్బాయిని చంపే పరిస్థితి వస్తుంది. రైటర్ నుంచి షూటర్ గా ఎందుకు మారాల్సి వచ్చిందనేది తెరమీద చూడాలి
దర్శకుడు ఫ్రాంక్లిన్ జాకోబ్ కు ఇది మొదటి సినిమానే అయినప్పటికీ అద్భుత నైపుణ్యం చూపించాడు. ఇంటర్వెల్ దాకా నెమ్మదిగా సాగినా ఆ తర్వాత మాత్రం కథాకథనాలతో కట్టిపడేస్తాడు. అధికారం అండతో డిప్యూటీ కమీషనర్ స్థాయి వ్యక్తి ఎంత అరాచకం చేయగలడో, దాని ద్వారా ఎందరు అమాయకులు బలవుతారో చూపించిన తీరు బాగుంది. క్లైమాక్స్ ని డిజైన్ చేసిన తీరు చాలా బాగా పేలింది. గోవింద్ వసంత్ సంగీతం బాగా కుదిరింది. ఓ ఇరవై నిముషాలు కుదించి ఉంటే బాగుండేది. రైటర్ నిజాయితీతో కూడిన ప్రయత్నం. ఇది మన ఆడియన్స్ టేస్ట్ కి సూట్ అవ్వదు కానీ తెలుగులో రీమేక్ చేయడం కన్నా అనువాద రూపంలో ఇస్తేనే బెటర్.
Also Read : Malli Modalaindi : మళ్ళీ మొదలైంది రిపోర్ట్