Idream media
Idream media
1921లో మహాత్మాగాంధీ ఆంధ్ర రాష్ట్ర పర్యటనలో భాగంగా కాకినాడ టౌన్ హాలులో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశం గురించి తెలుసుకున్న ఒక పన్నెండు సంవత్సరాల బాలిక నిర్వాహకుల వద్దకు వచ్చి, కొందరు దేవదాసీలు, ముస్లిం మహిళలను ఉద్దేశించి పది నిమిషాల పాటు గాంధీగారు మాట్లాడేలా ఆయన్ని ఒప్పించగలరా అని అడిగింది. ఆ అమ్మాయి వయసు చూసి వాళ్ళు అంత సీరియస్ గా తీసుకోకుండా “పాపా కాంగ్రెస్ పార్టీ కోసం అయిదు వేల రూపాయలు నిధి సేకరించు మీ వారి దగ్గర నుంచి. గాంధీగారు మీకోసం పది నిముషాలు కేటాయిస్తారు” అని చెప్పి, ఆ తరువాత ఆ బాలిక తమకు కనిపించదు అని తేలిగ్గా తీసుకున్నారు.
సరిగ్గా వారం తరువాత అయిదు వేల రూపాయలు తీసుకొచ్చింది ఆ బాలిక. దీంతో నిర్వాహకులు ఖంగు తిన్నారు. గాంధీ గారు ఆ పర్యటనలో చాలా బిజీగా ఉన్నారు. ఎన్ని వేల నిధులు ఇచ్చినా ఎవరికీ సమయం కేటాయించలేని పరిస్థితి. ఆ విషయం చెప్పి పంపించాలంటే ఆ పిల్ల ససేమిరా అని మంకుపట్టు పట్టి , “ఇచ్చిన మాట మీద నిలబడండి” అని నిర్వాహకులను నిలదీసి, “లేదా గాంధీ గారిని కలిసే అవకాశం ఇవ్వండి. వారినే అభ్యర్దిస్తాను” అని కూర్చుంది. నిర్వాహకులు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉండగా విషయం గాంధీగారి చెవిలో పడింది. ఆ పిల్లని పిలిపించుకుని మాట్లాడిన మహాత్ముడు ఆ పిల్ల చదివే పాఠశాల ఆవరణలో ముప్పై నిమిషాల పాటు దేవదాసీలు, బుర్ఖాలు కప్పుకొని వచ్చిన ముస్లిం మహిళలను ఉద్దేశించి హిందీలో ఇచ్చిన ఉపన్యాసాన్ని ఆ అమ్మాయి తెలుగులోకి అనువదించింది. చాలా ఆత్మవిశ్వాసంతో ఎటువంటి తడబాటు లేకుండా చేసిన ఆ అనువాదం చూసి తన ఆంధ్ర రాష్ట్ర పర్యటన మొత్తం ఆమెనే అనువాదకురాలిగా నియమించారు మహాత్మాగాంధీ.
1923లో కాకినాడ నగరంలో భారత జాతీయ కాంగ్రెస్ మహాసభల్లో భాగంగా ఖద్దరు ప్రదర్శన ఏర్పాటు చేశారు. ప్రదర్శన హాలులోకి పోయేవారు టికెట్ కొనుగోలు చేసేలా చూసే బాధ్యత ఒక పద్నాలుగు సంవత్సరాల బాలికకి అప్పగించారు. సభలో తన ఉపన్యాసం తరువాత ఖద్దరు ప్రదర్శన చూడడానికి వెళ్లిన జవహర్ లాల్ నెహ్రూ గారిని ఆ అమ్మాయి ఆపివేసింది. “టికెట్ కొనుగోలు చేయండి సార్” అని చెప్పింది. నెహ్రూ గారి పక్కన ఉన్న వ్యక్తులు “పాపా ఈయన నెహ్రూ గారు” అని చెప్తే, “లోపలికి వెళ్ళే ప్రతి ఒక్కరూ టికెట్ కొనుగోలు చేసేలా చూడవలసిన బాధ్యత నాకు అప్పగించారు. కాబట్టి లోపలికి పోవాలంటే టికెట్ కొనాలి” అని గట్టిగా పట్టు పట్టింది ఆ అమ్మాయి. నెహ్రూ గారు ఆ బాలికని అభినందించి, టికెట్ కొనుగోలు చేసి మరీ ఖద్దరు ప్రదర్శన తిలకించారు. రెండు సంఘటనల్లో ఉన్న బాలిక ఒకరే – దుర్గాబాయి.
చిన్నతనంలోనే అలవడిన సేవాభావం
రాజమండ్రిలో ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో 1909,జులై 15న జన్మించిన దుర్గాబాయి తన చిన్నతనంలోనే తండ్రినుంచి సేవాభావం అలవాటు చేసుకుంది. అప్పట్లో కలరా, ప్లేగు లాంటి భయంకర వ్యాధుల బారిన పడి మరణించిన వారి శవాలను కుటుంబ సభ్యులే భయంతో నడివీధిలో వదిలేస్తే దుర్గాబాయి తండ్రి కొందరు స్నేహితులతో కలిసి శ్మశానానికి తరలించి దహనం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన తన ఇద్దరు పిల్లలను కూడా భాగస్వాములను చేశారు.
అప్పటి ఆచారాల ప్రకారం దుర్గాబాయికి ఎనిమిదో ఏట ఒక జమీందారు కుమారుడితో వివాహం చేశారు. అయితే వయసుకు వచ్చే వరకూ పుట్టింట్లో ఉండి, అత్తవారింటికి పోవాల్సిన సమయానికి దుర్గాబాయి ఆలోచనల్లో కూడా పరిణితి వచ్చింది. తన భర్తతో సంప్రదించి, తమ వివాహం ఎంత అసంబద్ధమో వివరించి, వివాహం రద్దు చేసుకుంది. ఈ విషయంలో ఆమెకు తండ్రి మద్దతు లభించింది.
ఇప్పుడు పూర్తి స్వేచ్ఛ లభించిన దుర్గాబాయి తన సమయాన్ని స్వాతంత్య్ర పోరాటంలో వెచ్చించింది. 1939లో గాంధీగారి ఉప్పు సత్యాగ్రహానికి మద్దతుగా సహాయ నిరాకరణ, సత్యాగ్రహ ఉద్యమాలు నిర్వహించి మూడు సంవత్సరాల జైలు శిక్ష అనుభవించింది. జైలులో ఉండగా తోటి మహిళా ఖైదీలతో గడిపిన సమయంలో వారిలో చాలామందికి తమ హక్కుల గురించి అవగాహన లేకపోవడం, ఉన్నవారికి వాటిని సాధించడానికి అవసరమైన వనరులు లేకపోవడం గమనించి, విడుదల అయ్యాక లాయరు కావాలని నిర్ణయించుకొంది దుర్గాబాయి.
స్వంతంగా హాస్టలు ఏర్పాటు
అయితే ముందుగా ఒక డిగ్రీ కావాలి కాబట్టి ఆంధ్ర యూనివర్సిటీ వారి ప్రవేశ పరీక్ష రాసి, అందులో మంచి మార్కులు తెచ్చుకుని ఇంటర్వ్యూకి వెళ్తే, యూనివర్సిటీకి అనుబంధంగా మహిళా వసతి గృహం లేని కారణంగా ప్రవేశం నిరాకరించారు యూనివర్సిటీ అధికారులు. అందుకు నిరాశ పడకుండా, ఆంధ్ర యూనివర్సిటీలో సీటు తెచ్చుకుని, హాస్టల్ లేని కారణంగా చదవలేకపోతున్న విద్యార్ధినులు ఎవరైనా ఉంటే తనను సంప్రదించాలని ఒక పత్రికా ప్రకటన ఇచ్చింది ఆమె. అలాంటి వారు పదిమంది తోడయ్యారు. తమకు అనువైన భవనం అద్దెకు తీసుకుని హాస్టల్ ఏర్పరచుకున్నారు.
ఆంధ్ర యూనివర్సిటీ నుంచి బిఏ, రాజనీతి శాస్త్రంలో ఎంఏ పూర్తి చేసి, మద్రాసు యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ పొంది, 1942 కల్లా బాగా పేరు గడించిన క్రిమినల్ లాయర్ అయ్యారు. ఈ ప్రస్థానం ఒకవైపు సాగుతూ ఉండగా 1937లో ఆంధ్ర మహిళా సభ స్ధాపించి మహిళల అభివృద్ధి కోసం కృషి చేశారు.
చట్టసభల్లో ప్రవేశం
దుర్గాబాయి కృషిని గుర్తించిన అప్పటి ప్రభుత్వం 1946లో రాజ్యాంగ రూపకల్పన కోసం నియమించిన రాజ్యాంగ పరిషత్తులో సభ్యురాలిగా స్థానం కల్పించారు. రాజ్యాంగలో మహిళలకు అనుకూలంగా అనేక అధికరణాలు ఏర్పాటు చేయడంలో ఆమె పాత్ర చాలా ఉంది. స్వాతంత్య్రం తరువాత ప్లానింగ్ కమిషన్ సభ్యురాలిగా, ఛైర్మన్ గా దేశాభివృద్ధిలో ప్రముఖ పాత్ర పోషించారు. ఒకసారి తన చైనా పర్యటనలో అక్కడ చూసిన ఫామిలీ కోర్టులను భారతదేశంలో ఏర్పాటు చేసి, మహిళలకు సత్వరన్యాయం జరిగేలా కృషి చేశారు.
రిజర్వు బ్యాంకు మొదటి భారతీయ గవర్నరుగా పనిచేసి, తనకు బాగా పరిచయం ఉన్న చింతామణి దేశ్ ముఖ్ ని 1953లో వివాహం చేసుకుని దుర్గాబాయి దేశ్ ముఖ్ అయ్యారు. రిజిస్ట్రార్ ఆఫీసులో అత్యంత నిరాడంబరంగా జరిగిన ఈ వివాహానికి సాక్షి సంతకం చేసిన ఇద్దరిలో జవహర్ లాల్ నెహ్రూ ఒకరు.
1958లో ఏర్పాటు చేసిన జాతీయ మహిళా కమిషన్ మొదటి ఛైర్ పర్సన్ గా పనిచేసి, మహిళల హక్కుల కోసం, మహిళా రిజర్వేషన్ల కోసం చాలా కృషి చేశారు. యునెస్కో లాంటి అంతర్జాతీయ సంస్థల నుంచి అవార్డులు అందుకున్న దుర్గాబాయిని 1975లో పద్మ విభూషణ్ అవార్డుతో భారత ప్రభుత్వం సత్కరించింది. చివరి వరకూ మహిళా సాధికారత కోసం, మహిళల హక్కుల కోసం పాటుపడిన దుర్గాబాయి దేశ్ ముఖ్ 1981 మే 9న మరణించారు. ఆమె లేకపోయినా ఆమె స్ధాపించిన ఆంధ్ర మహిళా సభ అనేక శాఖలుగా ఎదిగి ఈ నాటిక దక్షిణ భారత దేశం అంతటా మహిళల అభ్యున్నతి కోసం పాటు పడుతూ ఉంది.
(అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా)