iDreamPost
android-app
ios-app

రేపే మహిళల టీ20 ప్రపంచకప్‌ సెమీస్‌ పోరు –

  • Published Mar 04, 2020 | 4:14 PM Updated Updated Mar 04, 2020 | 4:14 PM
రేపే మహిళల టీ20 ప్రపంచకప్‌ సెమీస్‌ పోరు –

ఆస్ట్రేలియాలో జ‌రుగుతున్న మ‌హిళా టీ20 ప్ర‌పంచ‌క‌ప్ తుది దశకు చేరుకుంది. నిన్నటితో లీగ్ ద‌శ ముగియ‌డంతో సెమీస్ బెర్త్‌లు ఖ‌రార‌య్యాయి.భార‌త్,ఆస్ట్రేలియా,ద‌క్షిణాఫ్రికాతో పాటు ఇంగ్లాండ్ నాకౌట్ పోరుకు సిద్ధమవుతున్నాయి. రేపు సిడ్నీ మైదానంలో మహిళల టీ20 ప్రపంచకప్‌ రెండూ సెమీస్ మ్యాచ్‌లు ఒకదాని తర్వాత ఒకటి జరగనున్నాయి.నాలుగు వ‌రుస విజ‌యాల‌తో అంద‌రికంటే ముందుగా సెమీస్‌లో భారత్ అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. గ్రూప్‌-బిలో సౌతాఫ్రికా అగ్ర‌స్థానం ద‌క్కించుకోగా ఇంగ్లాడ్ రెండో స్థానానికి ప‌రిమిత‌మైంది. రేపు జరిగే తొలి సెమీఫైనల్‌లో గ్రూప్‌-ఏలో అగ్రస్థానంలో ఉన్న భారత్‌, మాజీ చాంపియ‌న్ ఇంగ్లాండ్‌తో తలపడనుండగా,రెండో సెమీస్‌లో దక్షిణాఫ్రికాతో ఆతిథ్య ఆస్ట్రేలియా ఆడనుంది.

2018 ప్ర‌పంచ‌క‌ప్ సెమీస్‌లో భార‌త్‌ను ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించి ఇంగ్లాండ్ ఫైన‌ల్‌కు దూసుకెళ్లింది.గురువారం జరిగే తొలి సెమీస్‌లో భారత్ విజయం సాధించి రెండేళ్ల కింద‌ట త‌మ‌ను సెమీస్‌లోనే ఓడించిన ఇంగ్లీష్ టీమ్‌పై ప్ర‌తీకారం తీర్చుకోవాల‌ని టీమిండియా భావిస్తోంది. సెమీస్‌ గెలుపుతో తొలిసారి ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌ ఫైన‌ల్‌కు భారత్ చేరుకోవాల‌ని హర్మన్‌ప్రీత్‌ సేన భావిస్తుంది.

రికార్డుల పరంగా భారత మహిళలపై బ్రిటిష్ ఉమెన్స్ దే పైచేయి

2018 టీ20 ప్రపంచకప్‌ సెమీస్‌లో ఇంగ్లండ్ జట్టు భారత్‌ను ఓడించింది.దీనితో పాటు 2017 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లోనూ ఇంగ్లండ్ చేతిలో భారత్‌కు పరాభవం తప్పలేదు.మరోవైపు ఇరు జట్లు 19 టీ20 మ్యాచ్‌లలో తలపడగా భారత జట్టు కేవలం 4 మ్యాచ్‌లలో గెలిచి మిగతా 15 మ్యాచ్‌లలో ఓటమి పాలైంది. చివరిసారిగా గతేడాది మార్చిలో ఇంగ్లాండ్‌ భారత్‌లోని గువాహటిలో పర్యటించి హర్మన్‌ సేనను 0-3తో వైట్‌వాష్‌ చేసింది. టీ20 ప్రపంచకప్‌ ముందు జరిగిన ముక్కోణపు సిరీస్‌లో 2 మ్యాచ్‌లలో భారత్,ఇంగ్లాండ్ తలపడగా చెరొక విజయం దక్కింది.

గత టీ20 రికార్డులు కూడా ఇంగ్లాండ్ వైపు మెగ్గు చూపడంతో భారత అభిమానులను ఆందోళన పరుస్తుంది.అయితే గతంతో పోలిస్తే భారత మహిళా జట్టు భిన్నంగా కనిపిస్తోంది.బ్యాటింగ్ విభాగంలో షెఫాలీ, జెమీమాలతో పాటు బౌలింగ్ విభాగంలో స్పిన్నర్ పూనమ్‌ యాదవ్‌ (9),పేసర్ శిఖ పాండే (7),ఆల్‌రౌండర్‌ దీప్తిశర్మ లాంటి మ్యాచ్‌ విన్నర్లు మహిళా జట్టులో ఉన్నారు.

ఓపెనర్‌ షెఫాలీ వర్మ దూకుడుగా శుభారంభాలు అందిస్తుండగా మిడిల్ ఆర్డర్ లో జెమీమా రోడ్రిగ్స్‌ బాధ్యతాయుతంగా ఆడుతూ వికెట్ల పతనాన్ని అడ్డుకుంటుంది.ఆల్‌రౌండర్‌ దీప్తిశర్మ బంతితో రాణిస్తూ లోయర్ ఆర్డర్ లో జట్టుకు ఉపయుక్తమైన పరుగులు సాధిస్తుంది.కానీ సీనియర్లు స్మృతి మంధాన, సారథి హర్మన్‌ప్రీత్‌,వేద కృష్ణమూర్తి మాత్రం స్థాయికి తగ్గట్టు రాణించలేదు.ప్రపంచకప్ నాకౌట్ దశలో వీరు కూడా జోరందుకుంటే భారత మహిళా జట్టు తొలిసారి ప్రపంచ కప్ ఫైనల్ బరిలో నిలుస్తుంది.

తొలి సెమీస్‌: భారత్‌ vs ఇంగ్లాండ్‌ (గురువారం ఉదయం 9.30 నుంచి)
రెండో సెమీస్‌: ఆస్ట్రేలియా vs దక్షిణాఫ్రికా (గురువారం మధ్యాహ్నం 1.30 నుంచి)