iDreamPost
android-app
ios-app

అదంత వీజీ కాదు వీర్రాజు గారూ!!

అదంత వీజీ కాదు వీర్రాజు గారూ!!

దుబ్బాకలో గెలిచినట్లు ఆంధ్రాలో కుదరదు

నిన్నటి దుబ్బాక విజయం బిజెపి నేతల్లో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు.. కాదు కాదు..పదింతలు చేసింది. దీంతో ఉత్సాహం ఉరకలేస్తుండగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నాలుగు మాటలు మాట్లాడారు.. కాదు కాదు.. నాలుగైదు ఎక్కువ మాటలు మాట్లాడారు. దుబ్బాక స్పూర్తితో ఆంధ్రాలో విజయకేతనం ఎగురవేస్తారట. ఇంకా దానికి సంపిల్ గా త్వరలో జరగనున్న తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో తమ సత్తా చాటుతారట. తిరుపతి ఎంపీ దుర్గాప్రసాద్ ఇటీవల కన్నుమూయడంతో అక్కడ త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. కాబట్టి అక్కడ పోటీ చేసి విజయం సాధించి మెల్లగా రాష్ట్రంలో అధికారాన్ని దక్కించుకుంటాం అన్నది ఆయన ఉద్దేశం.

ఆశ .ఆశయం.. కోరిక ఇవన్నీ ఏ స్థాయిలో అయినా ఉండొచ్చు తప్పులేదు. పైగా పెద్దపెద్ద కలలు కనండి అని అబ్దుల్ కలాం ఎలాగూ చెప్పనే చెప్పారు కాబట్టి రాష్ట్ర బీజేపీ కూడా ఆస్థాయిలో డ్రీమ్స్ వేసుకోవచ్చు కానీ అది సాధ్యమేనా… కుదిరేపనేనా ?? వాస్తవానికి ఏపీలో బిజెపికి దాదాపు ఒకశాతం కన్నా తక్కువ ఓటు బ్యాంకుంది. సాక్షాత్తు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ సైతం మొన్నటి సాధారణ ఎన్నికల్లో ఉనికిని చాటుకోలేక చతికీలపడ్డారు. 175 అసెంబ్లీ సీట్లకుగాని గట్టిగా వెతికితే మహా అయితే వంద స్థానాలకు మించి బిజెపికి అభ్యర్థులే దొరకని స్థితి. ఇంకా చాలాచోట్ల జిల్లా మండల కమిటీలే పూర్తిగా ఏర్పడలేదు. గ్రామాలు,చిన్న పట్టణాల్లో బిజెపికి ఉనికి కూడా లేదు. అసలు స్థానిక ఎన్నికలు గాని జరిగితే ఎన్ని గ్రామ పంచాయతీలు, ఎన్ని మండల పరిషత్తుల్లో బీజేపీ గెలుస్తుందో చెప్పలేరు. కానీ ఏకాఎకిన ఎంపీ గా గెలుస్తాం.. త్వరలో రాష్ట్రంలో అధికారాన్ని చేపడతాం అని వీర్రాజు చెబుతున్న మాటలు వింటుంటే ఉట్టికేగలేనమ్మ స్వర్గానికి స్వర్గానికి ఏగినట్లుందని విమర్శలు వస్తున్నాయి.

దుబ్బాకలో బిజెపి గెలుపు వెనుక పలు స్థానిక అంశాలతోబాటు అక్కడి రాజకీయ పరిస్థితులు ప్రభావం చేశాయి. కానీ అన్నిచోట్లా అలాగే అవుద్దని ఊహించుకోవడం అత్యాశే అవుద్దీ.. ముందు పార్టీని కింది స్థాయి నుంచి బలోపేతం చేసాక అప్పుడు ఎన్నికలు, గెలుపు గురించి ఆలోచిద్దాం వీర్రాజు గారూ.. !!