iDreamPost
iDreamPost
సుప్రీమ్ హీరో సాయి తేజ్ తమ్ముడిగా డెబ్యూ మూవీ ఉప్పెనతోనే బిజినెస్ సర్కిల్స్ లో మంచి ఆసక్తి రేపిన వైష్ణవ్ తేజ్ అచ్చం అన్నయ్య లాగే మొదటి సినిమా లాంచ్ విషయంలో వరస మారేలా కనిపిస్తోంది. కంటెంట్ మీద గట్టి నమ్మకంతో ఉన్న ఉప్పెన నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ ఎలాగైనా సరే థియేట్రికల్ రిలీజ్ చేయాలనే సంకల్పంతో ఉన్నారు. ఆలస్యమైనా సరే ఇది పెద్ద తెరమీద చూస్తేనే ప్రేక్షకులకు న్యాయం కలుగుతుందన్నది వాళ్ళ ఫీలింగ్. దానికి తోడు గత ఏడాది టాప్ మ్యూజిక్ ఆల్బమ్స్ లో ఇదీ ఒకటిగా నిలవడం అంచనాలు పెంచేసింది. అందుకే పెట్టుబడి మీద భారాన్ని మోస్తూ మరీ వెయిట్ చేస్తున్నారు.
తాజా అప్ డేట్ ప్రకారం వైష్ణవ్ తేజ్ రెండో సినిమా ముందు విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. క్రిష్ దర్శకత్వంలో కొండపోలం నవల ఆధారంగా రూపొందిన ఈ విలేజ్ డ్రామా షూటింగ్ లాక్ డౌన్ తగ్గుతున్న టైంలోనే చాలా వేగంగా పూర్తి చేశారు. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా బాగా కో ఆపరేట్ చేసి త్వరగా పూర్తి కావడంలో సహాయా పడింది. దీన్ని ముందుగా రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన జరుగుతోందట. సోలో బ్రతుకే సో బెటరే తరహాలో సగం సీట్ల థియేటర్లలోనా లేక మంచి రేట్ వస్తే డైరెక్ట్ డిజిటల్ ఓటిటి ద్వారానా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.
గతంలో వీళ్ళ మేనమామ చిరంజీవికు కూడా కెరీర్ ప్రారంభం లో ఇలాగే జరగడం గమనార్హం. మొదటి సినిమాగా ప్రారంభమయ్యింది పునాదిరాళ్లు అయితే విడుదలయ్యింది ప్రాణం ఖరీదు. సాయి తేజ్ కూడా రేయ్ తో స్టార్ట్ చేస్తే పిల్లా నువ్వు లేని జీవితం ముందు వచ్చింది. ఇలా ఈ బ్రదర్స్ కూడా అదే అనుభవాన్ని పొందుతుండటం గమనార్హం. కానీ ఉప్పెన నిర్మాతలు మాత్రం వైష్ణవ్ డెబ్యూ మూవీ కాబట్టి భారీ బడ్జెట్ ఖర్చు పెట్టమని ఇప్పుడా క్రిష్ మూవీ ముందుగా రిలీజ్ చేస్తే ఎలా అని అడిగే ఛాన్స్ లేకపోలేదు. ఇప్పటికే తొమ్మిది నెలల నుంచి తన సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్న వైష్ణవ్ కోరిక ఏ రూపంలో తీరబోతోందో.