iDreamPost
android-app
ios-app

ఇప్పట్లో నిర్భయ దోషులకు ఉరి శిక్ష అమలవుతుందా?

ఇప్పట్లో నిర్భయ దోషులకు ఉరి శిక్ష అమలవుతుందా?

నిర్భయ నిందితుల ఉరి శిక్ష అమలు ఈ నెల 22 న జరిగే అవకాశం లేదని ఢిల్లీ ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఇప్పటికే డైలీ సీరియల్ తరహాలో అనేక మలుపులు
తిరుగుతున్న నిర్భయ నిందితుల ఉరి శిక్ష అమలులో జాప్యం జరుగుతూ వస్తుంది.

నిందితులు చట్టాల్లోని లొసుగులను ఉపయోగించుకుని ఉరిశిక్షను వాయిదా పడేలా చేస్తున్నారని న్యాయ నిపుణులు అంటున్నారు. తాజాగా నిర్భయ దోషి ముఖేష్ సింగ్ పెట్టుకున్న రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్ నేడు రాష్ట్రపతి వద్దకు చేరుకుంది. ఈ పిటిషన్ ను తిరస్కరించాలని ఢిల్లీ హోంశాఖ రాష్ట్రపతిని కోరింది. దీనిపై రాష్ట్రపతి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

ఒకవేళ రాష్ట్రపతి ముఖేష్ సింగ్ పిటిషన్ ను తిరస్కరించినా, ముందే నిర్ణయించినట్లుగా ఈ నెల 22 న ఉరి శిక్ష అమలుచేయడం మాత్రం సాధ్యం కాదు. దానికి కారణం ఎవరైనా రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టుకుంటే ఆ పిటిషన్ ను రాష్ట్రపతి తిరస్కరించినా, మరో 14 రోజుల వరకు ఉరి శిక్షను అమలు చేయకూడదని నిబంధనల్లో ఉంది. కాబట్టి ఈ నెల 22న ఉరిశిక్ష అమలు చేయలేమని ఢిల్లీ ప్రభుత్వం తేల్చిచెప్పింది.

ఒకవేళ 14 రోజుల గడువు ముగిసిన తర్వాత కూడా ఉరిశిక్ష అమలు చేయడం సాధ్యం కాకపోవచ్చు. కారణం నిర్భయ దోషులు తెలివిగా ఉరిశిక్ష అమలు జాప్యం అయ్యేలా పిటిషన్లు వేస్తుండటంతో ఇప్పట్లో ఉరి శిక్ష అమయ్యేలా లేదు. మరో ఇద్దరు నిందితులు క్యూరేటివ్ పిటిషన్లు వేసుకునే వెసులుబాటు ఉండటంతో నిర్భయ దోషుల ఉరి శిక్ష అమలు ప్రస్తుతానికి సందేహంగానే ఉంది. ఒకవేళ మిగిలిన ఇద్దరు దోషులు కూడా క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేస్తే దాన్ని విచారించి ఆ పిటిషన్లను సుప్రీం కోర్ట్ తిరస్కరించిన తర్వాత మాత్రమే ఉరి శిక్ష అమలు కావచ్చన్నది న్యాయ నిపుణుల మాట.

మన దేశ చట్టాల్లో ఉన్న లొసుగుల వల్లనే నేరస్తులు ధైర్యంగా నేరాలు చేస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. ఏదేమైనా ప్రస్తుతానికి మాత్రం నిర్భయ దోషులకు ఉరి శిక్ష అమలయ్యే అవకాశం మాత్రం లేదు.