Idream media
Idream media
తిరుపతి లోక్ సభ ఉప పోరు ఫలితం రేపు తేలనుంది. వాస్తవానికి ఇక్కడ ఎవరు గెలిచినా, ఓడినా పాలనలో పెద్దగా మార్పులు ఉండవు. ప్రభుత్వం పడిపోదు. కొత్త ప్రభుత్వం ఏర్పడదు. కానీ. అన్ని పార్టీలూ చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ప్రచారం చేపట్టాయి. అధికార పార్టీ సంగతి ఎలాగున్న విపక్షాలకు ప్రధానంగా టీడీపీకి ఇది జీవన్మరణ సమస్యగా మారింది. వరుస ఓటములతో పార్టీలోని కేడర్ అంతా పక్క చూపులు చూస్తున్న తరుణంలో ఈ ఉప ఎన్నికలో వచ్చే ఓట్లపైనే టీడీపీ పరిస్థితి తేలనుంది. అందుకే ఎన్నిక మొదలైన నాటి నుంచి పోలింగ్ ముగిసి ఫలితాలు వెల్లడి వరకు కూడా ఆ ఎన్నికలపై రాజకీయాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒకవేళ ఇక్కడ ఘోరంగా ఓట్లు వస్తే పరువు దక్కించుకోవడం ఎలా అనే కాన్సెఫ్ట్ ను పోలింగ్ జరిగిన నాటి నుంచే రూపొందించి అమలు చేస్తోంది టీడీపీ. దొంగ ఓట్లు, రీ పోలింగ్ అంటూ రకరకాల వాదనలను తెరపైకి తెచ్చింది.
ఇదిలా ఉండగా, తిరుపతి లోక్‌సభ నియోజకవర్గానికి ఈ నెల 17న నిర్వహించిన ఉప ఎన్నికను రద్దుచేసి రీ పోలింగ్ నిర్వహించాలని కోరుతూ తెలుగుదేశం అభ్యర్థి పనబాక లక్ష్మి తో పాటు బీజేపీ అభ్యర్థి రత్నప్రభ కూడా వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. ఈ వ్యాజ్యాలకు విచారణ అర్హత లేదని పేర్కొంది. ఎన్నికల ప్రక్రియలో న్యాయస్థానాల జోక్యంపై అధికరణ 329 కింద నిషేధం ఉందని తెలిపింది. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని పిటిషనర్లు భావిస్తే అందుకు వారు చట్ట ప్రకారం ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించుకోవచ్చని పేర్కొనడంతో ఆ ఆశ కూడా విపక్షాలు కోల్పోయాయి. ఇక రేపు వెల్లడి కాబోయే ఫలితాల టెన్షన్ అందరి కంటే తెలుగుదేశానికే ఎక్కువ ఉంటుందనడంలో సందేహం లేదు. చంద్రబాబు తిరుపతి ఎన్నికల కోసం బాగా కష్టపడ్డారు. ఒక వ్యూహం ప్రకారం దూసుకుపోయారు. పార్టీని మొత్తం తిరుపతికి షిఫ్ట్ చేశారు. తాను సైతం రాత్రీ పగలు తేడా లేకుండా తిరుపతిని చుట్టేశారు. చంద్రబాబు ఈ వయసులో పడిన కష్టానికి, ఆడిన నాటకాలకు ఏ మాత్రం ఆశించిన ఫలితం రాకపోతే అది పార్టీలో తీవ్ర దుమారానికి దారి తీయొచ్చు.
తిరుపతిలో గెలుపు ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదని అది చంద్రబాబుకు కూడా తెలుసు. కానీ, గతంలో సాధించిన ఓట్ల కంటే కనీసం లక్ష ఓట్లు అయినా ఎక్కువ తెచ్చుకోవాలని బరిలోకి దిగిన మొదటి నుంచీ తీవ్ర ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. గత ఎన్నికల్లో టీడీపీకి అయిదు లక్షల ఓట్లు వచ్చాయి. ఇపుడు అందులో కనీసం ఓ లక్ష అయినా పెంచుకోవాలని తెగ రాజకీయాలు చేశారు. కానీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వైసీపీకి గెలుపుతో పాటు మెజారిటీ కూడా గతంలో కంటే ఎక్కువగా వస్తుందనే తెలుపుతున్నాయి. ఈ లెక్కన టీడీపీకి గతంలో వచ్చిన ఓట్లు కష్టమే నన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
చంద్రబాబు అనుకుంటున్నట్లుగా తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ మెజారిటీ బాగా తగ్గితే మాత్రం అది టీడీపీ నైతిక విజయమే అవుతుంది. చంద్రబాబు గట్టిగా ఊపిరి పీల్చుకోవడమే కాదు, మళ్ళీ గాలి పోయిన సైకిల్ కి పంక్చర్ వేసి మరీ పరుగులు పెట్టించే ప్రయత్నం చేస్తారు. కానీ, ఫలితాలకు ముందే ఎగ్జిట్ పోల్స్ ఆ గాలిని తీసేశాయి. ముందే ఇల్లు చక్కబెట్టుకుందామనే ఉద్దేశంతో పార్టీ ముఖ్యులతో చంద్రబాబు టచ్ లోనే ఉంటున్నట్లు తెలుస్తోంది. ఒక వేళ తిరుపతిలో ఘోరమైన ఫలితాలు వచ్చినా పార్టీని బలోపేతానికి మరింత కష్టపడదామని చెబుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తంమ్మీద తెలుగుదేశం బహుశా ఓ ఉప ఎన్నిక ఫలితం కోసం ఇంతలా టెన్షన్ పడాల్సి రావడం ఇదే తొలిసారి కావొచ్చు
Also Read : విచారణ అంటే భయం? చేసిన తప్పులు చూపించేది ఎలా చంద్రబాబు?