తమిళ రాజకీయాల్లోకి మరో సినీ దిగ్గజం ప్రవేశించబోతోంది. సూపర్‌స్టార్ రజినీకాంత్ రాజకీయ ఆరంగేట్రంపై క్లారిటీ వచ్చింది. సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న సందిగ్ధతలకు తెరదించుతూ పొలిటికల్ ఎంట్రీపై స్పష్టతనిచ్చారు రజినీకాంత్. డిసెంబర్ 31న పార్టీ గురించి ప్రకటన చేస్తానని, జనవరిలో పార్టీ ఆవిర్భావ కార్యక్రమం ఉంటుందని తేల్చారు. ఇటీవల చెన్నైలో తన అభిమానులతో చర్చించిన ఆయన పార్టీ ప్రకటన గురించి మంతనాలు జరిపారు. ప్రస్థుత పరిస్థితుల్లో పార్టీ ఏర్పాటు చేస్తే ఎంతమేరకు సత్ఫలితాలు వస్తాయనే అంశంపై చర్చించిన ఆయన చివరకు ఈ నిర్ణయానికి వచ్చారు. రజనీకాంత్ తాజా నిర్ణయంతో తమిళ రాజకీయాలు మరింత వేడెక్కనున్నాయి.
దక్షణాది రాజకీయాల్లో సినీతారల ప్రవేశం కొత్తేమీ కాదు. అన్నాదురై నుంచి రజనీకాంత్ వరకు వెండితెర కళాకారులెందరో పొలిటికల్ స్క్రీన్ మీద తమను తాము పరీక్షకు పెట్టుకున్నారు. కొందరు సూపర్ హిట్ కొడితే, కొందరు చతికిల పడ్డారు. తమిళనాట అధికారాన్ని చెలాయించిన అన్నాడీఎంకే, డీఎంకే పార్టీలు సినీతారలు స్థాపించినవే. 1949లోనే అన్నాదురై ద్రవిడ మున్నేట కళగం పార్టీని స్థాపించారు. ఆ పార్టీలో కీలక నేతలుగా ఎదిగిన కరుణానిధి, ఎంజీఆర్ లు సైతం సినీ నేపథ్యం నుంచి వచ్చినవాళ్లే. అదే పార్టీ నుంచి బయటకు వచ్చిన ఎంజీఆర్ 1972లో ఏఐడీఎంకే ను స్థాపించి 1977లో అధికారాన్ని దక్కించుకున్నారు. ఆయన మరణం తరువాత జయలలిత పార్టీ పగ్గాలను చేపట్టి పలు పర్యాయాలు ముఖ్యమంత్రి పదవిని అధిరోహించింది.
మరోనటుడు శివాజీ గణేశన్ కూడా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. తమిళగ మున్నెట్ర మున్ననై పార్టీని స్థాపించిన ఆయన ఎన్నికల్లో ఆశించిన ఫలితాలను రాబట్టుకోలేకపోయారు. కెప్టెన్ విజయకాంత్ సైతం 2005లో దేశియ ముర్పోర్కు ద్రవిడ కళగం పార్టీని స్థాపించారు. కానీ ఇప్పటి వరకూ ఆయన చెప్పుకోదగ్గ విజయాలు సాధించలేకపోయారు. తెలుగునాట ఎన్టీఆర్, చిరంజీవి, పవన్ కళ్యాణ్, విజయశాంతి లాంటి వాళ్లు సినీ గ్లామర్ ను రాజకీయాలకు అన్వయించేందుకు యత్నించారు. వీరిలో ఎన్టీఆర్ తప్ప ఎవరూ అధికారాన్ని దక్కించుకోలేక పోయారు.
ఇక యూనివర్సల్ సార్ట్ కమల్ హాసన్ సైతం రెండేళ్ల క్రితం రాజకీయ రంగప్రవేశం చేశారు. విలక్షణ నటుడిగా లక్షలాది మంది అభిమానులున్న కమల్ 2018లో పీపుల్స్ సెంటర్ ఫర్ జస్టిస్ పార్టీని ప్రారంభించారు. త్వరలో తమిళనాడులో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్న కమల్ హాసన్ క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే పనిలో పడ్డారు. సరిగ్గా ఈ సమయంలో తలైవా పార్టీ ప్రకటనతో ముందుకు రావడం చర్చనీయాంశంగా మారింది. రజనీకాంత్ పెట్టబోయే పార్టీ రాష్ట్ర రాజకీయాలను మార్చివేస్తుందా? ఆయన సొంతంగా బరిలోకి దిగుతారా? లేక ఎవరితోనైనా పొత్తుపెట్టుకుంటారా? అనే చర్చ మొదలైంది. రజనీ రాజకీయ రంగప్రవేశం తమిళనాట కీలక మార్పులకు కారణమవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు… బీజేపీకి బలాన్నిచ్చేందుకే తలైవా పొలిటికల్ ఎంట్రీ దోహదపడుతుందనే వాదనా ఉంది. మరి సూపర్ స్టార్ పొలిటికల్ ఎంట్రీ ఎలాంటి మార్పులకు దారితీస్తుందో చూడాలి.