iDreamPost
iDreamPost
విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం వారం రోజుల్లోగా అఖిల పక్షం ఏర్పాటు చేయకుంటే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పిన జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పదిరోజులు దాటినా స్పందించడం లేదేమిటని జనం ఎదురుచూస్తున్నారు. అక్టోబర్ 31న విశాఖ స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ వద్ద జరిగిన సభలో ఆయన ఆవేశంగా చేసిన ప్రసంగాన్ని గుర్తు చేస్తుకుంటున్నారు. ఉక్కు ఫ్యాక్టరీ చరిత్ర, రాష్ట్రవ్యాప్తంగా అప్పట్లో 32 మంది బలిదానం చేయడం, కార్మికుల కష్టం, వారు చేసిన త్యాగాల గొప్పతనం గురించి ఆరోజు పవన్ మాట్లాడారు. స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకోవాలంటే అఖిలపక్షం ఏర్పాటు చేయాలన్నారు. ఇందుకు ప్రభుత్వానికి వారం గడువు ఇస్తున్నామని పేర్కొన్నారు. ఎంపీలు మౌనంగా ఉంటే ఏం లాభం. స్టీల్ ప్లాంట్ కోసం పోరాడుతామని వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రకటించాలి అని పవన్‌కల్యాణ్ డిమాండ్ చేశారు. ఎప్పడూ మాదిరిగానే వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపైన, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిపైన సందర్భ శుద్ధిలేని విమర్శలు కూడా చేశారు.
ప్రభుత్వ వైఖరి విస్పష్టం..
పవన్ సభ ముగిసిన తర్వాత స్పందించిన మంత్రులు, వైఎస్సార్ సీపీ నాయకులు ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణపై ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేశారు. తాము ఇప్పటికే ఉద్యమానికి సంఘీభావం తెలిపామని, అసెంబ్లీలో తీర్మానం కూడా చేశామని చెప్పారు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి లేఖ కూడా రాశారని చెప్పారు. వైఎస్సార్ సీపీ ఎంపీలు ఈ విషయంపై పార్లమెంట్‌లో ప్రస్తావించిన అంశాన్ని కూడా గుర్తుచేశారు. అయినా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఈ అంశంపై పవన్‌కల్యాణ్ తమ ప్రభుత్వానికి డెడ్‌లైన్లు విధించటమేమిటని ప్రశ్నించారు. ఆయనకు చేతనైతే కేంద్రాన్ని ప్రశ్నించాలని కూడా సూచించారు. ఈ అంశంపై అఖిలపక్షం ఏర్పాటు చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
Also Read : Liquor, Petrol – మద్యం, పెట్రోలు… రెండూ ఒకటేనా సోము…?
గడువు ముగిసింది కదా.. ఏం చేస్తారు?
పవన్ కల్యాణ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన గడువు ఈ నెల 7వ తేదీతో ముగిసినా ఈ విషయంపై ఆయన ఇంకా ఏ ప్రకటనా చేయలేదు. స్టీల్‌ప్లాంట్ పరిరక్షణకు పోరాడుతున్న కార్మికులను కలసి ఉద్యమ కార్యాచరణకు చర్చలు జరిపిన దాఖలాలు కూడా లేవు. ఆరోజు సభలో మాట్లాడుతూ 48 గంటల్లోనే అఖిలపక్షం ఏర్పాటు చేయాలని ముందుగా డిమాండ్ చేసిన పవన్, వేదికపై ఉన్నవారి సూచన మేరకు దాన్ని వారం రోజులుగా సరిచేసి ప్రకటించారు. ప్రభుత్వానికి డెడ్‌లైన్ విధించడానికి ఆరోజు అంతగా ఆత్రుత చూపిన వపన్ గడువు దాటినా ఎందుకు స్పందిండం లేదనే ప్రశ్న సాధారణంగా రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా స్టీల్‌ప్లాంట్ కార్మికులకు కలుగుతోంది. సీపీఐ నేత రామకృష్ణ ఈ విషయమై పవన్‌కు కొన్ని సూచనలు కూడా చేశారు. గతంలో తాను ప్రత్యేక హోదా కోసం పోరాడినప్పుడు తనను జనం ఒంటరిని చేశారని పవన్ భావించడం సరికాదని చెప్పారు. పవన్ స్వయంగా అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళితే బావుంటుందని కూడా సూచించారు. ఆ సూచనను పవన్ పరిగణనలోకి తీసుకుంటారేమో చూడాలి.
అసలు పవన్ కేంద్రాన్ని ప్రశ్నిస్తారా?
ఇప్పటి వరకు ఈ విషయంపై కేంద్రంలో ఉన్న తన మిత్ర పక్ష బీజేపీ ప్రభుత్వాన్ని పవన్ ప్రశ్నించలేదు. పైగా వెనకేసుకొస్తున్నారు. అసలు పెట్టుబడుల ఉపసంహరణ అనేది 1992లో కాంగ్రెస్ హయాంలోనే ప్రారంభమైందని, ఈ పాపం ఇప్పటి కేంద్ర ప్రభుత్వానిది కాదని మూలాలు గతంలోనే ఉన్నాయని పరోక్షంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన సమర్థించారు. ప్రైవేటీకరణ విషయంలో ఎంతసేపూ కేంద్రానిదే తప్పనడం భావ్యం కాదని చెప్పారు. కేంద్రాన్ని అడిగేముందు రాష్ట్ర ప్రభుత్వాన్ని బాధ్యులు చేయాలని ప్రజలకు, స్టీల్‌ప్లాంట్ కార్మికులకు ఆయన సూచించారు కూడా. ఈ ధోరణిని బట్టే ఆయన కేంద్రాన్ని కనీసం ప్రశ్నిస్తారా? అన్న సందేహం కలుగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా అఖిలపక్షం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వీరిద్దరి భావజాలం ఒకేలా ఉంది కనుక ఉద్యమ కార్యాచరణ దిశగా కలసి అడుగులు వేస్తారా? అన్నది చూడాల్సి ఉంది. లేక మిత్రపక్షాన్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని ఎప్పటి లాగే రాష్ట్ర ప్రభుత్వంపై, ముఖ్యమంత్రిపై విమర్శలు చేసి ఊరుకుంటారా? ప్రత్యేక హోదా కోసం పోరాడినప్పుడు రాష్ట్ర ప్రజలు తనను ఒంటరిని చేశారని, అందుకని మీరు ముందు నిలబడి పోరాడితే నేను వెనుక ఉంటానని ఆరోజు సభలో ప్రకటించారు కనుక వెనుకే ఉండిపోతారా? ప్రశ్నించడానికే పుట్టిన పార్టీ ఈ ప్రశ్నలకు త్వరగా జవాబు ఇస్తుందని జనం ఎదురుచూస్తున్నారు.
Also Read : Tdp,Nara Lokesh – చినబాబూ.. ఎందుకయ్యా? ఈ రాజకీయం.. తమ్ముళ్లే ఫీలవుతుంటే?