Idream media
Idream media
ప్రపంచమంతా కరోనా సెకండ్ వేవ్ ప్రకంపనలకు ఒణుకుతోంది. తగ్గుతూ వస్తున్న కరోనా మహమ్మారి ఉధృతి క్రమంగా పెరుగుతూ వస్తోంది. శీతాకాలం కావడంతో విజృంభిస్తోంది. కరోనా సృష్టించిన విపత్తు ఎంత నష్టం చూకూర్చిందో ప్రజలంతా అనుభవించారు. ప్రభుత్వాలు సైతం గడగడలాడాయి. సెకండ్ వేవ్ తో ఆ పరిస్థితి రాకుండా ఉండేందుకు ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. నిపుణులు సైతం అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. ఇన్ని హెచ్చరికలు ఉన్నా ఏపీ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాత్రం స్థానిక ఎన్నికల నిర్వహణలో వెనక్కి తగ్గక పోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుత పరిస్థితిలో ఎన్నికల విధుల్లో పాల్గొనాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేసి వారి ఆరోగ్యాన్ని పణంగా పెట్టలేమని ఇప్పటికే సీఎస్ తేల్చిచెప్పినా.. నిమ్మగడ్డ మరోసారి లేఖ రాశారు. ఫిబ్రవరిలో ఎన్నికల నిర్వహణ తప్పదన్నట్లుగా అందులో పేర్కొన్నారు. కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది పార్లమెంట్ శీతాకాల సమావేశాలను రద్దుచేయాలని నిర్ణయిస్తూ కేంద్రం ప్రకటన జారీ చేసింది. ఇప్పుడైనా పరిస్థితిని గుర్తించండంటూ నిమ్మగడ్డకు పలువురు సూచిస్తున్నారు.
కేసుల నమోదు నేపథ్యంలో…
గతంలో పార్లమెంటు సమావేశాల సందర్భంగా కరోనా ప్రకంపనలు రేపిన నేపథ్యంతోపాటు, దేశంలో ఇంకా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న ఆందోళనల మధ్య పార్లమెంట్ శీతాకాల సమావేశాలను రద్దుచేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకు అన్ని పార్టీలు అంగీకరించినట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. రైతుల ఆందోళన, కోవిడ్-19 వ్యాక్సిన్ తయారీతో సహా పలు అంశాలపై చర్చించడానికి శీతాకాల సమావేశాలను ఏర్పాటు చేయాలని పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ చీఫ్ రంజన్ గతంలో స్పీకర్ ఓం బిర్లాను కోరారు. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్యలపై చర్చించేందుకు శీతాకాల సెషన్‌ను అన్ని కోవిడ్-19 ప్రోటోకాల్‌తో ఏర్పాటు చేయాలని బిర్లాకు రాసిన లేఖలో ఆయన కోరారు. సాధారణంగా నవంబర్ నెలాఖరున లేదా డిసెంబర్ మొదటి వారంలో శీతాకాల సమావేశాలు ప్రారంభమవుతాయి. అలాగే బడ్జెట్ సెషన్ జనవరి చివరి వారంలోనూ ఉంటుంది. ఫిబ్రవరి 1న కేంద్రం ఆర్థిక బడ్జెట్‌ను ప్రవేశపెడుతుంది.19 మంది లోక్‌సభ ఎంపీలు, ఎనిమిది మంది రాజ్యసభ ఎంపీలు కరోనా బారిన పడటంతో సెప్టెంబరులో వర్షాకాల సమావేశాలను కుదించిన సంగతి తెలిసిందే. పరిస్థితులను బట్టి సమావేశాల నిర్వహణపై కేంద్రం నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
న్యూ ఇయర వేడుకలు రద్దు..
కరోనా సెకండ్ వేవ్ సృష్టించే విపత్తులపై కేంద్ర వైద్య నిపుణుల సూచన మేరకు కొత్త సంవత్సర వేడుకలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజల ఆరోగ్య భద్రత దృష్ట్యా రాష్ట్రంలో డిసెంబర్ 31, జనవరి ఒకటిన వేడుకలను రద్దు చేసినట్లు తెలిసింది. అంతేకాకుండా విచ్చలవిడి జన సంచారం తగ్గించేందుకు ఆ రెండు రోజుల్లో కర్ఫ్యూ విధించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. దీంతో పాటు ఈ నెల 26 నుంచి జనవరి 1 వరకూ కొన్ని నిషేధాజ్ఞలు అమలులో ఉండనున్నాయి. వైన్ దుకాణాలు, బార్ల సమయాన్ని కుదించనున్నారు. ఈ క్రమంలో విద్యా సంస్థలకు కూడా కొన్ని సూచనలను ప్రభుత్వం చేస్తోంది. కరోనా మ హమ్మారి పొంచి ఉన్న దృష్ట్యా కొన్ని నిబంధనలు తప్పవనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
ఎన్నికలు నిర్వహించలేమన్న ప్రభుత్వం.. కారణం ఇదే..
అదే విధంగా పంచాయతీ ఎన్నికలపై న్యాయస్థానంలో వాదనలు కొనసాగుతున్నాయి. పంచాయతీ ఎన్నికలను ఇప్పట్లో నిర్వహించలేమని ప్రభుత్వం కోర్టుకు విన్నవించినట్లు తెలిసింది. జనవరి, ఫిబ్రవరి నెలల్లో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియపై కేంద్రం ప్రభుత్వం గైడ్ లైన్స్ ఇచ్చిందని, దీని కోసం పోలీసులు, అన్ని శాఖల సిబ్బందిని వినియోగించాల్సి ఉంటుందని పేర్కొంది. అందుకే ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించలేమని చెప్పినట్లు తెలిసింది. ప్రజారోగ్యం దృష్ట్యా వాక్సినేషన్ ప్రక్రియ తప్పదని, దానికి ప్రాధాన్యం ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం పేర్కొంది. దీనిపై తదుపరి విచారణ జరగాల్సి ఉంది.