Krishna Kowshik
Krishna Kowshik
వచ్చే ఏడాది లోక్ సభ ఎన్నికలు జరుగుతుండగా.. కేంద్రంలోని బీజెపీ సర్కార్ వివిధ రాష్ట్రాల్లోని పార్టీ అధ్యక్షులను జులైలో మార్చింది. ఈ జాబితాలో రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు కర్ణాటక, గుజరాత్, పంజాబ్, ఒడిశా, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లోని పార్టీ చీఫ్‌లను మార్చారు బీజెపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. ఏపీకి దివంగత నటుడు, మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ తనయ పురందేశ్వరి, తెలంగాణకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని నియమించారు. అయితే తెలంగాణలో అధికార పక్షం బీఆర్ఎస్, మరో ప్రతిపక్షం కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా కిషన్ రెడ్డి వాగ్బాణాలు సంధిస్తున్నారు. కానీ ఏపీలో మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. పురందేశ్వరి బీజెపీ అధిష్టానానికి బేఖాతరు చేస్తూ సొంత నిర్ణయాలు చేస్తున్నారన్నదీ రాజకీయ నేతల విశ్లేషణ.
పురందేశ్వరి.. బీజెపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి పార్టీ కోసం కన్నా, టీడీపీకి అనుకూలంగా మాట్లాడుతున్నారు. ఇది బీజెపీ శ్రేణులకు మింగుడు పడని అంశంగా మారింది. ఇదే సమయంలో స్కిల్ డెవలప్ మెంట్ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టు కావడం ఆమెలోని అసలు కోణం బయటకు వచ్చింది. తనువు ఒక చోట.. మనస్సు మరో చోట అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. బంధు ప్రీతితో అధిష్టానాన్ని సంప్రదించకుండానే.. ఆయన అరెస్టు అక్రమమంటూ పేర్కొన్నారు. దీంతో ఆమెపై అగ్ర శ్రేణీ నాయకులు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో టీడీపీ రాష్ట్ర బంద్‌కు పిలువడంతో.. ఎవ్వరినీ సంప్రదించకుండా మద్దతు తెలపడంతో..ఆమె బావమరిది పార్టీకి పనిచేస్తున్నారని బీజెపీ శ్రేణులు కూడా గుసగుసలాడుకున్నాయి.
పురందేశ్వరి పక్షపాత వైఖరి, నియంతృత్వ ధోరణిపై ఫిర్యాదులు అందడంతో అధిష్టానం కూడా ఆమెకు వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో టీడీపీకి మద్దతు ఇస్తున్నామన్న మాట అవాస్తవమని పురందేశ్వరి చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ చర్య తర్వాత బీజేపీ నేతలు ఆమెతో అంటిముట్టనట్లు వ్యవహరిస్తున్నారని వినికిడి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేయాలని ఆమెను పురమాయిస్తే.. టీడీపీ భజన చేయడం ఏ మాత్రం ఆ పార్టీ శ్రేణులు భరించలేకపోతున్నారు. రాష్ట్రంలోని సీనియర్ నేతలు కూడా ఆమెకు దూరంగా జరుగుతున్నారు. కేవలం టీడీపీ ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారన్న ఆరోపణలను ఎదుర్కొంటున్నారు పురందేశ్వరి.
ఇటీవల ఇదే ఉద్దేశంతో ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, ఇతర వైసీపీ నేతలు వ్యాఖ్యలు చేస్తే.. ఏ ఒక్క బీజేపీ నేత నోరు మెదపకపోవడం పలు అనుమానాలకు తావునిస్తోంది. అలాగే పార్టీ చేస్తున్న కార్యక్రమాలకు సీనియర్ నేతలు కూడా ఆమెకు సహకరించకపోవడంతో అధిష్టానం ముందు ఘోల్లుమన్నారని తెలుస్తోంది. వచ్చే ఏడాది ఏపీలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేసే దిశగా ఎదురు చూస్తున్న అధిష్టానానికి.. పురందేశ్వరి చర్యలు కాస్త కంట్లో నలుసులా తయారయ్యాయి. రాష్ట్ర అధ్యక్షురాలిగా ఆమె పూర్తిగా విఫలమయ్యారని ఇటు రాష్ట్ర నేతలు కూడా ఢిల్లీ పెద్దలకు విన్నవించడంతో పురందేశ్వరిని మార్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.