Idream media
Idream media
ప్రధానంగా కొవిడ్ సెకండ్ వేవ్‌ని ఎదుర్కోవడంలో ముఖ్యమంత్రి యోగి వైఫల్యం చెందారన్న అపవాదు ఉంది. దీనికి తోడు కొంత మంది ఎమ్మెల్యేలను, మంత్రులను నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శలూ ఉన్నాయి. అలాగే, బీజేపీకి సాంప్రదాయికంగా మద్దతుదారులుగా నిలుస్తూ వచ్చిన బ్రాహ్మణులు పార్టీలో ప్రాధాన్యం కోల్పోయారని ఆరోపణలు ఉన్నాయి. ఇటువంటి క్రమంలో బీజేపీ భవితవ్యానికి గీటురాయిగా వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న యూపీ ఎన్నికలు నిలవనున్నాయి.
ఇప్పటికే మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమబెంగాల్ వంటి పెద్ద రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో లేదు. వీటికి తోడుగా ఉత్తరప్రదేశ్‌లోనూ బీజేపీ అధికారం కోల్పోయినట్లయితే ఎక్కువ లోక్‌సభా స్థానాలున్న రాష్ట్రాలు ఆ పార్టీకి దూరమవుతాయి. ఇన్ని స్థానాలు తన చేతుల్లోచి చేజారితే బీజేపీకి చాలా కఠిన పరిస్థితి ఎదురవుతుంది.
ఉత్తరప్రదేశ్ లో బీజేపీ గెలిచినా గతం కంటే తక్కువ స్థానాలు వస్తే.. అది సార్వత్రిక ఎన్నికలపై ప్రభావం చూపుతుంది. ఇన్ని సమీకరణాలు, సంకేతాల నేపథ్యంలో బీజేపీ అధిష్ఠానం ఉత్తరప్రదేశ్ పై గట్టిగానే ఫోకస్ పెట్టింది. పార్టీలో మోదీ తర్వాత అంతటి వ్యక్తిగా పేరున్న యోగి సారథ్యానికి తోడుగా మరో ఐదుగురు ప్రముఖులను రంగంలోకి దించింది. వచ్చే సంవత్సరం జరిగే అయిదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలపైనా దృష్టి పెట్టిన బీజేపీ ఎన్నికల వ్యవహారాలను చూసుకునేందుకు పార్టీలో అగ్రనేతలను ఎంపిక చేసింది.
Also Read:ఉత్తరాఖండ్ గవర్నర్ రాజీనామా.. కారణం అదేనా?
వ్యవసాయ చట్టాల విషయంలో రైతులు నిరసన వ్యక్తంచేస్తున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లో అధికారాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఆ రాష్ట్ర బాధ్యతలను ఐదుగురు కేంద్ర మంత్రులు ధర్మేద్రప్రధాన్, అనురాగ్ ఠాకూర్, అర్జున్‌రామ్‌మేఘ్వాల, అన్నపూర్ణాదేవి శోభా కరంద్లాజేలకు అప్పగించింది. ఎన్నికలు పూర్తి అయ్యే వరకూ రాష్ట్రంలోని పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ పార్టీ బలోపేతానికి తగిన చర్యలు చేపట్టడమే వారి పని అని ఆదేశాలు జారీ చేసింది.
ఇప్పటి సమీకరణాలను పరిశీలిస్తే.. ఉత్తరప్రదేశ్‌లో వచ్చే సంవత్సరం జరగనున్న ఎన్నికలు చతుర్ముఖ పోరాటాన్ని తలపిస్తున్నాయి. ఇప్పటికే కుర్మీల ఆధిపత్యంలోని అప్నాదళ్, నిషాద్ పార్టీ వంటి చిన్నాచితకా పార్టీలతో అమిత్ షా భేటీ అయ్యారు. రాష్ట్రంలోని యాదవేతర బీసీలు, అత్యంత వెనుకబడిన కులాలకు సంబంధించిన ఓటర్లు బీజేపీకి చాలా ముఖ్యంగా మారారు. ఇకపోతే మాయావతి ఒంటరిగానే పోటీ చేయవచ్చు. అన్ని లెక్కలు తేలాక బీజేపీ అధికారంలోకి రావడానికి అవసరమైన మ్యాజిక్ సంఖ్య తగ్గినపక్షంలో ఆమె బీజేపీకే మద్దతు చేయవచ్చు.
Also Read:భూముల అమ్మకంలో భారీ కుంభకోణం?.. కేసీఆర్ పై సీబీఐకి ఫిర్యాదు..!
మరోవైప సమాజ్‌వాదీ పార్టీ, ఆర్‌ఎల్‌డీ ఇప్పటికే పొత్తుపట్ల అవగాహనకు వచ్చేశాయి. పశ్చిమ ఉత్తరప్రదేశ్ రైతులు ప్రత్యేకించి జాట్ రైతులు కిసాన్ ఆందోళనకు మద్దతు పలికిన ఆర్‌ఎల్‌డీ కొత్త చీఫ్ జయంత్ చౌదరికి మద్దతివ్వాలని చూస్తున్నారు.
ఇక అఖిలేశ్ యాదవ్ విషయానికి వస్తే 2017లో లాగా కాంగ్రెస్‌తో మళ్లీ పొత్తు పెట్టుకునేందుకు సిద్ధంగా లేనట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. తనకు ఎవరు ఎన్ని సీట్లు ఇవ్వగలరు అని వెతుకులాడుకునే స్థితిలో పడింది. ఒక్కమాటలో చెప్పాలంటే ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితంపై రాజకీయ పక్షాల భవితవ్యం ఆధారపడి ఉంది.
ఇటువంటి పరిస్థితుల్లో యోగికి మద్దతుగా దిగిన ఆ ఐదుగురి మంత్రుల వ్యూహాలు పార్టీకి ఎటువంటి గెలుపును అందిస్తాయో చూడాలి. వ్యవసాయ చట్టాలు బీజేపీ గెలుపునకు స్పీడు బ్రేకర్లుగా మారే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. ఎన్నికల లోపు దీనిపై కేంద్ర ప్రభుత్వం ఏదో ఒక ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని కూడా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఏం జరగబోతుందో చూడాలి.
Also Read:ఫోర్డ్ కార్ల తయారీకి గుడ్ బై, భారత్ లో ఉత్పత్తి నిలిపివేతపై నిర్ణయం