Idream media
Idream media
తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ పరుగులు పెడుతోంది. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆ ఊపు ప్రదర్శించేందుకు పార్టీ రాష్ట్ర నాయకత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అందుకు ప్రస్తుత బలం సరిపోదని భావిస్తోంది. ఇందుకోసం ఇతర పార్టీలలోని బలమైన నాయకుల కోసం వేట ప్రారంభించింది. సోము వీర్రాజు అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే ఆయన ఆ దిశగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల అనంతరం బీజేపీకి పెరుగుతున్న ప్రాబల్యంతో తన ప్రయత్నాలు ఆయన ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సోము జిల్లాల వారీగా సమీక్షలు జరుపుతున్నారు. ఇతర పార్టీలలోని అసంతృప్త నేతలు ఎవరెవరున్నారనేది తెలుసుకుంటున్నారు. దీనిలో భాగంగా ముందుగా రాయలసీమపై దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. ఇందుకు కారణం త్వరలో తిరుపతి పార్లమెంట్ కు ఉప ఎన్నిక ఉండడమే.
అక్కడ దుబ్బాక.. ఇక్కడ తిరుపతి…
తిరుపతి ఉప ఎన్నికను రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి నాందిగా చేసుకోవాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. తెలంగాణలో జరిగిన దుబ్బాక ఉప ఎన్నికలో గెలుపు అనంతరం ఆ రాష్ట్రంలో బీజేపీకి ఊపొచ్చింది. అదే ఊపుతో జీహెచ్ఎంసీలో పాగా వేసేందుకు జాతీయ నాయకత్వం నుంచి రాష్ట్ర నాయకత్వం వరకూ పాగా వేసి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇదే ఫార్ములా ఏపీలో కూడా అనుసరించాలని బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రాభవం చాటుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. అయితే ప్రస్తుతం ఏపీలో వైసీపీకి ఆదరణ అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలతో ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. ప్రభుత్వ వ్యతిరేక పెద్దగా కనిపించడం లేదు. దీంతో ప్రస్తుతానికి ఫోకస్ ప్రతిపక్షపార్టీపై పెట్టింది. ఆ పార్టీ నేతలను తమ వైపు తిప్పుకుంటోంది. ఒక్కో జిల్లాలో బలోపేతం అయ్యేందుకు అడుగులు వేస్తోంది.
ఒకప్పుడు తెలుగుదేశానికి కంచుకోటగా ఉన్న అనంతపురం జిల్లాలో బీజేపీ ఒక్కో అడుగు ముందుకు వేస్తోంది. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణను ఇప్పటికే పార్టీలోకి చేర్చుకుంది. అలాగే కదిరికి చెందిన టీడీపీ నాయకుడు దేవానంద్ కూడా బీజేపీలో చేరారు. దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఆ వర్గాలను ఆకర్షించేందుకు ఇది దోహదపడుతుందని బీజేపీ భావిస్తోంది. దీంతో పాటు రాష్ట్రనాయకత్వంలో కూడా ఈ జిల్లాకు ప్రాధాన్యమిచ్చింది. జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాల పరిధిలో 8 మందికి చోటు కల్పించింది. దీంతో పాటు సంస్థాగతంగా మరింత బలోపేతం అయ్యేందుకు రాష్ట్ర, జిల్లా నాయకులు కృషి చేస్తున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఇప్పటికే రెండు సార్లు జిల్లాలో పర్యటించారు. హిందూపురం పార్లమెంట్ పరిధిలోని నేతల మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించేందుకు వారితో మాట్లాడారు. నేతలను, కార్యకర్తలను ఒకతాటిపైకి తేవడంలో సఫలమైనట్లు తెలుస్తోంది. ఇలా ఒక్కో జిల్లాపైనా దృష్టి పెడుతున్న సోము తన ప్రయత్నాల్లో ఎంత వరకూ విజయం సాధిస్తారో వేచి చూడాలి.