iDreamPost
android-app
ios-app

బండి సంజయ్ పాదయాత్ర..  బీజేపీని అధికారంలోకి తెస్తుందా?

  • Published Aug 29, 2021 | 12:39 AM Updated Updated Aug 29, 2021 | 12:39 AM
బండి సంజయ్ పాదయాత్ర..  బీజేపీని అధికారంలోకి తెస్తుందా?

వాయిదాల మీద వాయిదాల తర్వాత మొత్తానికి బండి సంజయ్ పాదయాత్ర మొదలైంది. బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నుంచి తన ప్రజా సంగ్రామ యాత్రను సంజయ్ ప్రారంభించారు. నాలుగు విడతలుగా సాగనున్న ఈ పాదయాత్రను పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బీజేపీకి అంతగా పట్టులేని పాతబస్తీ నుంచి ప్రారంభించిన ఈ యాత్రతో అటు మజ్లిస్ కు, ఇటు టీఆర్ఎస్ కు ఒకేసారి హెచ్చరికలు పంపినట్లు అయింది. దక్షిణాదిలో కర్నాటక తర్వాత తెలంగాణలో బీజేపీ పాగా వేస్తుందా? బండి సంజయ్ పాదయాత్ర బీజేపీని అధికారం వైపు నడిపిస్తుందా?

రథ యాత్ర నుంచి సంగ్రామ యాత్ర దాకా..

ఏబీవీపీలో, ఆర్ఎస్ఎస్ లో, తర్వాత బీజేపీలో క్రియాశీల కార్యకర్తగా, లీడర్ గా పని చేశారు బండి సంజయ్. 1996లో బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ రథయాత్ర చేపట్టినప్పుడు.. రథయాత్ర వాహన శ్రేణికి కరీంనగర్ లో ఇన్‌చార్జిగా పని చేశారు. అప్పుడు పెద్దాయన వెంట సాగిన సంజయ్.. ఇప్పుడు తెలంగాణలో పాదయాత్ర చేస్తున్నారు. మూడేళ్ల కిందటి దాకా తెలంగాణ రాజకీయాల్లో పెద్దగా పరిచయం లేని సంజయ్.. ఇప్పుడు రాష్ట్ర బీజేపీకి ప్రాణవాయువు అయ్యారు. బీజేపీ అసాధారణ రీతిలో పుంజుకోవడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అధ్యక్షుడు అయ్యాక.. పార్టీ గ్రాఫ్ అమాంతం పెరిగింది. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలే ఇందుకు ఉదాహరణలు. జీహెచ్ఎంసీలో టీఆర్ఎస్ కు దీటుగా సీట్లు గెలుచుకున్నారు. ‘ప్రధాన ప్రతిపక్ష’ హోదాను కాంగ్రెస్ నుంచి లాగేసుకున్నారు. పీసీసీ చీఫ్ గా రేవంత్ రాకతో.. బీజేపీ కాస్త వెనుకడినట్లు కనిపించినా.. మజ్లిస్ ఇలాకాలోని చార్మినార్ దగ్గర చేసిన బల ప్రదర్శన కాషాయ పార్టీ బలాన్ని చెప్పకనే చెప్పింది.

ఎన్నడూ లేనంత బలంగా..

కర్నాటక మినహా మిగతా దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ ప్రభావం అంతంత మాత్రమే. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయి కాదు కదా.. కనీసం ప్రభుత్వాలను నిర్ణయించే కింగ్ మేకర్ స్థాయికి కూడా ఎదగలేదు. పార్టీ ప్రభావం అంతంతమాత్రమే. బీజేపీ ఆవిర్భావం తర్వాత 1983 ఎన్నికల్లో ఏపీలో ఎన్నికల బరిలో నిలిచింది. అటు బీజేపీకి, ఇటు టీడీపీ ఇదే తొలి ఎన్నిక. 289 సీట్లలో పోటీ చేసిన టీడీపీ.. 201 సీట్లలో గెలిచింది. 81 చోట్ల పోటీ చేసిన బీజేపీ.. 3 చోట్ల గెలిచింది. ఆంధ్రప్రాంతంలో వెంకయ్య నాయుడు, తెలంగాణ ప్రాంతంలో మలక్ పేట్ నుంచి ఇంద్రసేనారెడ్డి, శాంపేట్ నుంచి చందుపట్ల జంగారెడ్డి గెలిచారు. తర్వాత పోటీ చేసిన అన్ని ఎన్నికల్లో ఏపీలో ఒక్కసారి మాత్రమే 10కిపైగా సీట్లు సాధించింది. అది కూడా టీడీపీతో పొత్తుపెట్టుకున్నప్పుడు మాత్రమే ఎక్కువ సీట్లు వచ్చాయి. 2014లో జరిగిన ఎన్నికల్లో తెలంగాణలో 5 స్థానాల్లో గెలిచింది. 2018 ఎన్నికల్లో కేవలం ఒకే ఒక్క స్థానానికి పరమితమైంది. దీంతో పార్టీ పని అయిపోయిందని అంతా భావించారు. కానీ లోక్ సభ ఎన్నికల్లో మాత్రం నాలుగు సీట్లు గెలిచి ఔరా అనిపించింది. తర్వాత రాష్ట్ర పార్టీ బాధ్యతలు బండి సంజయ్ స్వీకరించడంతో బాగా స్వింగ్ అయింది. గతంలో ఎన్నడూ లేనంత బలంగా ఇప్పుడు బీజేపీ కనిపిస్తోంది. దూకుడైన నాయకత్వం వల్ల ప్రజల్లో పార్టీపై ఆదరణ పెరిగిన మాట మాత్రం నిజం.

నడక.. అధికారానికి దారి చూపుతుందా?

తెలుగు రాష్ట్రాల్లో పాదయాత్రకు పెద్ద చరిత్రే ఉంది. పాదయాత్రకు బ్రాండ్ అంబాసిడర్ లాంటి వారు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి. ఎన్నికల్లో తనే గెలుస్తానని భావించి, ముందస్తు ఎన్నికలకు వెళ్లిన చంద్రబాబు నాయుడును ఓడించింది, కాంగ్రెస్ ను గెలిపించింది పెద్దాయన పాదయాత్రే. తర్వాత తండ్రి బాటలో నడిచిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా వందలాది కిలోమీటర్లు నడిచి ప్రజల బాధలను తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి అయ్యారు. జగన్ కన్నా ముందు చంద్రబాబు కూడా పాదయాత్ర చేశారు.

ఇక తెలంగాణ ఏర్పడ్డాక జరుగుతున్న రెండో పాదయాత్ర ఇది. రాష్ట్రం ఏర్పాటైన రెండేళ్ల తర్వాత సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మహాజన పాదయాత్ర చేపట్టారు. కానీ ఆ విషయం చాలా మందికి గుర్తు కూడా లేదు. ఈటల పాదయాత్ర తన హుజూరాబాబాద్ నియోజకవర్గం వరకే పరమితం. ఇప్పుడు బండి సంజయ్ చేపడుతున్న పాదయాత్రపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ప్రజలతో మమేకమవుతూ, వారి సమస్యలను తెలుసుకుంటూ.. ‘మీకు నేనున్నా.. నా పార్టీ ఉంది’ అని ఆయన భరోసా ఇస్తూ పోవాల్సింది ఉంది. ఎంత సేపు మతం, మోడీ గురించే కాకుండా.. అభివృద్ధి గురించి కూడా మాట్లాడితే బాగుంటుంది. తామొస్తే ఏం చేస్తామో చెప్పాల్సి ఉంది. కేసీఆర్ తిట్టడానికో, జైలుకు పంపిస్తాం.. అధికారం గుంజుకుంటాం అని చెప్పడానికో యాత్ర చేస్తే వచ్చే ఉపయోగం ఏమీ ఉండదు. ఎందుకంటే ప్రతిపక్షాల ఎత్తులకు దీటుగా.. కేసీఆర్ కొత్త కొత్త పథకాలతో ఢీకొడుతున్నారు. కేసీఆర్ ను ఎదుర్కోవాలంటే ఈ దూకుడు సరిపోదు.. అధికారాన్ని సాధించాలంటే ఈ జోష్ సరిపోదు.. ఈ నేపథ్యంలో జనం నుంచి ఎంత ఎక్కువ ఆదరణ దక్కితే.. అంత ఎక్కువ అవకాశాలు బీజేపీకి ఉంటాయి. నడక ఇప్పుడే మొదలైంది కదా… చూద్దాం.. ప్రగతి భవన్ దాకా చేరుతుందో లేదో!!

Also Read : త‌గ్గేదేలే : తెలంగాణ‌లో పొలిటిక‌ల్ మంట‌లు