Idream media
Idream media
బెల్లం ఉన్న చోటే ఈగలుంటాయంటారు. అధికారం ఉన్నప్పుడే అందరూ చుట్టూ చేరతారు. అధికారంలో ఉన్నప్పుడు కీర్తించిన వారు.. ఆ అధికారం పోయిన తర్వాత కన్నెత్తి కూడా చూడరంటారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తూర్పుగోదావరి పర్యటనను చూస్తే ఇవి అక్షరసత్యాలని తెలుస్తోంది.
తూర్పుగోదావరి జిల్లాలోని పోలవరం ముంపు మండలాల పర్యటనకు నారా లోకేష్ హైదరాబాద్ నుంచి వెళ్లారు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా మీదుగా ఆయన విలీన మండలాలను చేరుకున్నారు. మార్గమధ్యలో ఖమ్మం జిల్లా టీడీపీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికాయి. అయితే తూర్పుగోదావరి జిల్లా నేతల స్పందన చూసిన లోకేష్‌కు దిమ్మతిరిగింది. పెద్దాపురం ఎమ్మెలే నిమ్మకాయల చినరాజప్ప, కాకినాడ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ తప్పా.. జిల్లా నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఎవరూ లోకేష్ పర్యటనకు రాలేదు. కనీసం మర్యాదపూర్వకంగానూ కనిపించలేదు. విజయవాడ నుంచి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వచ్చినా.. స్థానిక జిల్లా నేతలు రాకపోవడంపై టీడీపీలో చర్చకు దారితీస్తోంది.
టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న లోకేష్ ఎక్కడ అడుగు పెడితే.. అక్కడకు ఆయా జిల్లాల నేతలు క్యూకట్టేవారు. చినబాబు పర్యటనలో సందడి చేసేవారు. యువరాజు వస్తున్నారని ఫ్లెక్సీలు, ఘన స్వాగతాలు పలికేవారు. భారీ బైక్ ర్యాలీలు చేసేవారు. పత్రికల్లో ప్రకటనలు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చినబాబును చూపు పడినా చాలు అనేలా వ్యవహరించేవారు. ఎప్పుడైతే అధికారం పోయిందో.. చినబాబు కాస్త లోకేష్ అయ్యారు. భారీ స్వాగత ఏర్పాట్లు సంగతి అటుంచితే.. మర్యాదపూర్వకంగా కూడా కనిపిద్దామనే ఆలోచన కూడా తమ్ముళ్లు చేయడం లేదు. ఇది లోకేష్‌కు ఏ మాత్రం మింగుడు పడని విషయమే.
గత సాధారణ ఎన్నికల తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ పరిస్థితి దారుణంగా తయారైంది. పెద్దాపురం, మండపేట, రాజమహేంద్రవరం సిటీ, రూరల్‌లో టీడీపీ గెలిచింది. పెద్దాపురం, రాజమహేంద్రవరం సిటీలలోనే ఆ పార్టీ ఉనికి కనిపిస్తోంది. తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అలగడంతో రాజమహేంద్రవరం రూరల్‌లో, తోట త్రిమూర్తులు దూకుడుతో మండపేటలో వేగుళ్ల జోగేశ్వరరావులు సైలెట్ అయ్యారు. మిగతా నియోజకవర్గాల్లో ఒకరిద్దరు మినహా.. మిగతా నేతలు పార్టీ ఆదేశించిన కార్యక్రమాలు చేసి చేతులు దులుపుకుంటున్నారు. స్థానికంగా చురుకుగాలేని నేతలు.. లోకేష్ పర్యటనలో అసలు కనిపించకపోవడంపై జిల్లా శ్రేణులు లైట్ తీసుకుంటున్నాయి. లోకేష్ కూడా లైట్ తీసుకోవడం మినహా మరేమీ చేయలేని పరిస్థితి.
Also Read : జ్యోతుల నెహ్రూకు అనారోగ్యం.. జగ్గంపేటలో సమీకరణాలు మారబోతున్నాయా..?