iDreamPost
iDreamPost
ఇటీవల నేపాల్ పర్యటనకు వెళ్లిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అక్కడ ఓ క్లబ్‌లో నైట్ పార్టీకి వెళ్లి ఎంజాయ్ చేసినట్టు వీడియోలు లీక్ అయ్యాయి. దీంతో ఈ వీడియోలు సంచలనంగా మారాయి. రాహుల్ నైట్ క్లబ్ పార్టీకి వెళ్లిన అంశంపై బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. కాంగ్రెస్ తరపున ప్రధాని అభ్యర్థి అని చెప్పుకొనే రాహుల్ ఇలా నైట్‌క్లబ్‌ల్లో తిరగడమేంటి అంటూ బీజీపీ మాటలతో దాడి చేస్తుంటే వ్యక్తిగత పర్యటనలపై విమర్శలు ఏంటని కాంగ్రెస్ సమాధానమిస్తుంది. దీంతో గత రెండు రోజులుగా దేశ రాజకీయాల్లో రాహుల్ గాంధీ హాట్ టాపిక్ గా మారారు.
రాహుల్ గాంధీ తన నేపాలీ స్నేహితురాలు సుమ్నిమా ఉదాస్ వివాహానికి హాజరయేందుకు వెళ్లినట్టు అక్కడ మీడియా తెలిపింది. ఈ వివాహానికి గాను రాహుల్ తన వ్యక్తిగత పర్యటన కింద ఐదు రోజులు నేపాల్ కి వెళ్లారు. దీంతో ఎవరు ఈ సుమ్నిమా ఉదాస్ అని అంతా ఆరా తీస్తున్నారు. సుమ్నిమా ఉదాస్ ఓ పాత్రికేయురాలు. అమెరికాకు చెందిన ప్రముఖ మీడియా సంస్థ CNN ఇంటర్నేషనల్‌కు ఢిల్లీ ప్రతినిధిగా ఆమె పనిచేశారు. 2001 నుంచి 2017వరకు ఈమె CNN లో పని చేసింది. ఆ సమయంలో దేశంలోని కీలక రాజకీయ పరిణామాలతో పాటు ఆర్థిక, సామాజిక, పర్యావరణ తదితర రంగాలపై అనేక కథనాలు ఇచ్చారు. దీంట్లో భాగంగానే రాహుల్ తో పరిచయం ఏర్పడింది.
2017లో CNNని వీడిన తర్వాత ఆమె 2018 నుంచి లుంబినీ మ్యూజియం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా, ఫౌండర్‌గా కొనసాగుతున్నారు. లింగ సంబంధిత సమస్యలపై కథనాలు రాసినందుకు గాను 2014 మార్చిలో జరిగిన మహిళా సాధికారత (WE) జర్నలిజం అవార్డ్స్‌లో భాగంగా సుమ్నిమాకు ‘జర్నలిస్ట్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు లభించింది. అలాగే, భారతదేశంలోని గ్రామాల్లో బానిసత్వం గురించి రిపోర్టింగ్ చేసినందుకు 2012లో ప్రతిష్ఠాత్మక సినీ గోల్డెన్ ఈగల్ అవార్డుని కూడా ఉదాస్ గెలుచుకుంది.
అంతే కాక సుమ్నిమా ఉదాస్ తండ్రి భీమ్ ఉదాస్ దౌత్య అధికారిగా పనిచేశారు. మయన్మార్‌లో నేపాల్ రాయబారిగా సేవలందించారు. భారతదేశంతోనూ మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ రకంగా కూడా రాహుల్ కి పరిచయం ఉంది. ఈ పరిచయంతోనే తమ కుమార్తె పెళ్లికి రాహుల్ గాంధీని ఆహ్వానించినట్టు సుమ్నిమా తండ్రి భీమ్ ఉదాస్ వెల్లడించారు. సుమ్నిమా వివాహం కోసమే రాహుల్ అక్కడికి వెళ్లినట్టు, పెళ్ళికి ముందు ఇచ్చిన పార్టీలో పాల్గొన్నట్టు తెలుస్తుంది. మరి దీనిపై రాహుల్ తిరిగొచ్చాక బీజేపీ సంధించిన ప్రశ్నలకి ఎలాంటి సమాధానమిస్తాడో చూడాలి.