iDreamPost
android-app
ios-app

ఖాదీ సంగతి సరే.. ఉక్కు ఊపిరి తీసేస్తున్నారే!

  • Published Aug 07, 2021 | 11:32 AM Updated Updated Aug 07, 2021 | 11:32 AM
ఖాదీ సంగతి సరే.. ఉక్కు ఊపిరి తీసేస్తున్నారే!

ఆమె కేంద్ర ఆర్థిక శాఖను పర్యవేక్షిస్తున్న మహిళామణి. దానికంటే ముందు ఆమె తెలుగింటి కోడలు. తమిళనాడుకు చెందిన నిర్మలా సీతారామన్ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ప్రాంతానికి చెందిన పరకాల ప్రభాకర్ ను వివాహం చేసుకోవడం ద్వారా ఆంధ్రప్రదేశ్ కోడలు అయ్యారు. అనంతరం రాజకీయ పరమపద సోపానంలో ఒక్కో మెట్టు ఎక్కి కేంద్ర మంత్రి అయ్యారు. ఆ సందర్బంగా రాష్ట్ర ప్రజలు ఎంతో ఆనందించారు. గర్వంగా ఫీలయ్యారు. అయితే ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. కీలకమైన ఆర్థిక శాఖ పగ్గాలు చేపట్టిన ఆమె ప్రభుత్వ పాలసీ పేరుతో తన అత్తింటి రాష్ట్రంలోని ఓ మహా పరిశ్రమ ఊపిరి తీసే పనికి పూనుకున్నారు. తెలుగువారి మనోభావాలతో పెనవేసుకున్న విశాఖ ఉక్కును తన చేతుల మీదుగానే తెగనమ్మడానికి సిద్ధం అయ్యారు. చకచకా సన్నాహాలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, నాయకులు, ప్రజలు, కార్మికులు వద్దని ఎంత మొత్తుకుంటున్నా పెడచెవిన పెడుతున్నారు. చివరికి విశాఖ వచ్చిన ఆమెను కార్మిక ప్రతినిధులు కలిసేందుకైనా అవకాశం ఇవ్వకుండా పోలీసు బలగాలను అడ్డుపెట్టుకున్నారు.

ఉక్కు ఊసెత్తని నిర్మలమ్మ

జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు శ్రీకాకుళం జిల్లా పొందురుకు నిర్మలా సీతారామన్ వెళ్లారు. విమానంలో విశాఖ విమానాశ్రయంలో దిగిన ఆమె అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పొందూరుకు వెళ్లారు. అయితే ఆందోళనపథంలో ఉన్న విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి ప్రతినిధులతో సహా ఎవరితోనూ కలిసేందుకు కేంద్రమంత్రి అవకాశం ఇవ్వలేదు. పైగా ముందు జాగ్రత్తగా కార్మిక నేతలందిరినీ గృహ నిర్బంధంలో పెట్టారు. విమానాశ్రయంలో కేంద్ర బలగాలను పూర్తిగా మోహరించారు. విశాఖ నుంచి పొందూరు వరకు దారి పొడవునా భారీ భద్రత ఏర్పాటు చేశారు. పొందురులో జరిగిన చేనేత దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్థిక మంత్రి విశిష్టమైన పొందూరు ఖాదీకి ప్రాణం పోస్తామని హామీ ఇచ్చారు. కానీ విశాఖను అట్టుడికిస్తున్న స్టీల్ ప్లాంట్ అంశాన్ని ఆమె మాట మాత్రంగానైనా ప్రస్తావించలేదు. విశాఖలో ఎవరినీ కలుసుకోని, ఏమీ మాట్లాడని ఆమె.. పొందూరులోనూ ఉక్కు విషయం ప్రస్తావించలేదు. ఒకవైపు వేలాది కుటుంబాలకు జీవనాధారం కల్పిస్తున్న ఉక్కు ఫ్యాక్టరీ ఊపిరి తీస్తూ.. మరోవైపు ఖాదీకి ప్రాణం పోస్తామని చెప్పడం విడ్డురంగా ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

లాభాల్లోకి వచ్చినా అమ్మేస్తారట

నవరత్న పరిశ్రమల్లో ఒకటిగా పేరొందిన విశాఖ ఉక్కులో తన వాటాలను పూర్తిగా అమ్మేయడం ద్వారా ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేయాలని జనవరి 27న కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని పెట్టుబడుల ఉప సంహరణ ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ నిర్ణయించింది. అప్పటి నుంచి విశాఖ ప్రజలు, కార్మిక సంఘాలు, వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని అడ్డుకునేందుకు అందుబాటులో ఉన్న అన్ని మార్గాల్లో ప్రయత్నిస్తున్నాయి. ఐటీవల ఢిల్లీ వెళ్లి రెండు రోజులు ఆందోళనలు కూడా చేశారు. ఆర్థిక మాంత్రి నిర్మలా సీతారామన్ ను కూడా కలిశారు. అయినా కేంద్రం కనికరించడం లేదు. రాష్ట్ర ప్రజల మనోభావాలతో ఆడుకుంటోంది. తెలుగుంటి కోడలిగా నిర్మల అయినా తెలుగు ప్రజల మనోభావాలను అర్థం చేసుకుని సానిభూతితో పరిశీలిస్తారనుకుంటే.. విశాఖ వచ్చినా కూడా కనీసం కలిసేందుకు అవకాశం ఇవ్వకుండా కార్మిక ప్రతినిధులను నిర్బంధాలకు గురిచేయడం దారుణమని ఉద్యమకారులు విమర్శిస్తున్నారు. గుజరాత్ లో రూ.18 వేల కోట్ల నష్టాల్లో కూరుకుపోయిన గుజరాత్ ఆయిల్ కంపెనీని ఓఎంజీసీలో విలీనం చేసి కాపాడిన కేంద్రం.. మళ్లీ లాభాల్లోకి వచ్చిన విశాఖ ఉక్కును మాత్రం అమ్మకానికి పెట్టడాన్ని నిరసిస్తూ కార్మికులు దిష్టిబొమ్మను దహనం చేశారు.