iDreamPost
android-app
ios-app

సొంత వారి మేలుకోసమేనా నిమ్మగడ్డ సొంత యాప్‌..?

సొంత వారి మేలుకోసమేనా నిమ్మగడ్డ సొంత యాప్‌..?

పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికలంటే.. తన సొంత వ్యవహారమనేలా తాను అనుకున్న సమయంలోనే ఎన్నికలు నిర్వహించాలని పట్టుబట్టిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌.. ఈ క్రమంలో మరో అడుగు ముందుకేశారు. పంచాయతీ ఎన్నికల పర్యవేక్షణకు సొంతంగా తయారు చేయించిన యాప్‌ ద్వారా పర్యవేక్షిస్తారట. ఏళ్లతరబడి దేశ వ్యాప్తంగా లోక్‌సభ, శాసన సభ ఎన్నికల పర్యవేక్షణకు కేంద్ర ఎన్నిక సంఘం వెబ్‌ కాస్టింగ్‌ విధానాన్ని అనుసరిస్తోంది. పోలింగ్‌ బూత్‌ బయట జరిగే అక్రమాలు, ప్రలోభాలు, ఇతర ఫిర్యాదుల కోసం రాష్ట్ర ప్రభుత్వం నిఘా అనే యాప్‌ను ప్రజలకు అందుబాటులో ఉంచింది. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలోనే జరిగిన 2019 ఎన్నికల్లో నిఘా యాప్‌ను ఉపయోగించారు.

పర్యవేక్షణలో కేంద్ర ఎన్నికల సంఘం విఫలమైనట్లేనా..?

అయితే కేంద్ర ఎన్నికల సంఘం అనుసరించే వెబ్‌ కాస్టింగ్, ఫిర్యాదుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉంచిన నిఘా యాప్‌లు నిమ్మగడ్డ రమేష్‌కుమర్‌కు పనికిరావట. వెబ్‌కాస్టింగ్‌లో క్లారిటీ సరిగా లేదని నిమ్మగడ్డ సరికొత్తగా సెలవిస్తున్నారు. అంటే ఇన్నాళ్లు వెబ్‌కాస్టింగ్‌ విధానం సరిగా లేకపోయినా.. కేంద్ర ఎన్నికల సంఘం లోక్‌సభ, శాసన సభ ఎన్నికల్లో ఈ విధానాన్ని అనుసరించిందన్నమాట. ఎన్నికల పర్యవేక్షణలో పూర్తిగా విఫలమైనట్లుగా భావించాలి. నిఘా యాప్‌ ద్వారా ఎవరైనా అక్రమాలకు పాల్పడుతుంటే.. లైవ్‌ వీడియోలు, ఫోటోలు తీసి అందులో అప్‌లోడ్‌ చేయవచ్చు. అందులో వచ్చిన ఫిర్యాదులను పరిశీలించే అధికారులు.. విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటారు. 2019 ఎన్నికల్లో ఈ యాప్‌ను అప్పటి టీడీపీ ప్రభుత్వం ప్రచారంలోకి తీసుకువచ్చింది.

అసలు ఉద్దేశం ఏమిటి..?

అయితే ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌.. ఈ రెండు విధానాలను వద్దనడం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటనే ప్రశ్నలు అందరి మొదళ్లను తొలుస్తున్నాయి. ఎప్పటి నుంచే అనుసరిస్తున్న విధానాలను కాదని.. తానే సొంతంగా యాప్‌ తెస్తున్నట్లు, దాని ద్వారా ఎన్నికలను పర్యవేక్షించబోతున్నట్లు నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ప్రకటించడం వెనుక కుట్ర దాగి ఉందనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఈ యాప్‌ ఎవరు తయారు చేశారు..? అందులోని ఫీచర్స్‌ ఏమిటి..? వచ్చే ఫిర్యాదులు ఎవరు స్వీకరిస్తారు..? ఫిర్యాదులను ఎవరు క్రోడీకరిస్తారు..? ఆ యాప్‌ ద్వారా ఎంత మంది పర్యవేక్షించవచ్చు..? అందుకు విధి విధానాలేమిటి..? నిమ్మగడ్డతోపాటు ప్రైవేటు వ్యక్తులు కూడా పర్యవేక్షిస్తారా..? ప్రజా సమాచారం బయటకు వెళ్లదని గ్యారెంటీ ఉందా..? నూతనంగా తెస్తున్న యాప్‌లో ఏదైనా సాంకేతిక సమస్య వస్తే ఎవరు పరిష్కరిస్తారు..? యాప్‌ ద్వారా వచ్చే డేటా ఎక్కడ స్టోర్‌ చేస్తారు..? గోప్యంగా ఉంచాల్సిన ఓటర్ల సమాచారం బయటకు వెళితే ఎవరు బాధ్యత వహిస్తారు..? ఇలా అనేక ప్రశ్నలు రాజకీయ పార్టీల నేతలు, ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి.

నిధులు ఎలా..?

యాప్‌ తయారీకి నిధులు అవసరం. మరి ఈ నిధులు నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ఎలా సమకూర్చుకుంటున్నారు..? ఆయన తన జేబులో నుంచి ఖర్చు చేస్తున్నారా..? లేక ఇతరులు ఏమైనా భరిస్తున్నారా..? ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఈ యాప్‌కు సంబంధించిన సమాచారం ఏదీ లేదు. రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యకలాపాలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వమే నిధులు సమకూర్చాలి. ఇటీవల జరిగిన కోర్టు వ్యవహారాలకు, తన పదవిని తిరిగి తెచ్చుకునేందుకు కోర్టుల్లో పెట్టుకున్న ఖరీదైన లాయర్లకు ఫీజులు చెల్లించాలంటూ.. రాష్ట్ర ప్రభుత్వానికి నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ లేఖ రాశారు. ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం సరిపడా నిధులు కేటాయించడం లేదంటూ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. గత పరిస్థితి ఇలా ఉంటే.. యాప్‌ రూపకల్పన కోసం నిధులను నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ఎలా సమకూర్చుకున్నారు..? అనే సందేహం సాధారణ ప్రజల్లోనూ కలుగుతోంది.

గవర్నర్‌కైనా చెప్పారా..?

రాష్ట్ర ప్రభుత్వంపై ఫిర్యాదులు చేసేందుకు, ఎన్నికల నిర్వహణపై అంశాలను, కోర్టు వ్యవహారాలను గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌ దృష్టికి తీసుకెళ్లిన నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌.. ఈ యాప్‌ విషయం కూడా తీసుకెళ్లారా..? ఎన్నికల పర్యవేక్షణకు కేంద్ర ఎన్నికల సంఘం అనుసరించే వెబ్‌కాస్టింగ్, ఫిర్యాదుల కోసం రాష్ట్ర ప్రభుత్వం వినియోగించే నిఘా యాప్‌ల బదులు తానే సొంతంగా యాప్‌ను తయారు చేయించి, వినియోగించబోతున్నట్లు గవర్నర్‌కు తెలిపారా..? ఇత్యాది ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌పైనే ఉంది.