iDreamPost
android-app
ios-app

కొత్తవే మునుగుతున్నాయి.. లోపమెక్కడ..?

  • Published Oct 20, 2020 | 2:32 AM Updated Updated Oct 20, 2020 | 2:32 AM
కొత్తవే మునుగుతున్నాయి.. లోపమెక్కడ..?

కురుస్తున్న వర్షాన్ని చూస్తున్న పెద్దవాళ్ళు ఇంతకంటే పెద్దవానలే పడేవిరా.. అనడం అక్కడక్కడ వింటున్నాం. ఇప్పుడంటే సెంటీమీటర్లు, మిల్లీ మీటర్లుతో కొలుస్తున్నారు. వాళ్ళదృష్టిలో పెద్దవానలు అంటే రోజులు, నెలల తరబడి ముసురు పట్టి ఉండేదనే అర్ధం. దీపావళి ముందు రోజుల్లో వారం, పది, పదిహేను రోజుల పాటు ప్రతి రోజూ వర్షం పడుతూనే ఉండేదని అప్పటి విషయాలను వారిని కదిలిస్తే చెబుతుంటారు. అయితే ఆ కాలంలో కాలనీలకు కాలనీలు, ఊళ్ళకు ఊళ్ళు మునిగిపోయేవి కాదా? అన్న సందేహం రాకమానదు. వరదొస్తేనే, చెరువు గట్లు/కట్టలు తెగిపోతే తప్ప వర్షానికి మునిగిపోవడం అనేది ఉండేది కాదురా అంటూ వారు గుర్తుకు తెచ్చుకుంటుంటారు కూడా.

మరి ఇదేంటి ఇప్పుడు ఊళ్ళకు ఊళ్ళు, కాలనీలకు కాలనీలే ఎందుకు మునిగిపోతున్నాయన్న సందేహం మనకు రాకమానదు. అవును నిజమే పాత కాలంలో ఇప్పుడు మునిగిపోతున్నంత దారుణంగా ఎప్పుడూ గృహ సముదాయాలు ఉన్న చోట్ల మునిగిపోయేవి కాదు. కొంచెం వయస్సులో పెద్దవాళ్ళెవర్ని అడిగినా ఇదే విషయం చెబుతారు. మరిప్పుడెందుకు మునిగిపోతున్నాయీ.. అంటే మన ఇంజనీరింగ్‌ నైపుణ్యాన్ని శంకించాల్సి వస్తుందని పలువురు బలంగా అభిప్రాయపడుతున్నారు. సదరు లే ఔట్‌లు డిజైన్‌ చేసిన ఇంజనీర్లు కేవలం తమ ప్లాట్లు అమ్ముకోవడానికి ఆకర్షణలు ఏర్పాటు చేసారు తప్పితే, ముప్పు వస్తే ఎలా తప్పుతుందన్నదానిపై దృష్టిపెట్టలేదన్న భావన వ్యక్తమవుతోంది.

గతంలో పోలిస్తే జనసాంద్రత విపరీతంగా పెరిగింది. వీరందరికీ కావాల్సిన నివాస ప్రాంతాలు ఏర్పాటవుతూ వచ్చాయి. అయితే ఇలా ఏర్పాటయ్యే నివాస ప్రాంతాల భౌతిక స్థితి పట్ల కనీస జాగ్రత్తలు కూడా తీసుకోకపోవడం వల్లే ఇప్పుడు ఎదుర్కొంటున్న ముంపు అన్నది నిర్వివాదాంశంగా చెప్పొచ్చు. పాతకాలంలో ఎంతో ముందుచూపుతో ఇళ్ళు నిర్మించుకునేవారు. ఇప్పుడు కొత్తగా పుట్టబడుతున్న కాలనీల్లో హండ్రడ్‌పర్సంట్‌ వాస్తు పేరిట గిమ్మిక్కులు చేయడం తప్పితే భారీగా వర్షాలొస్తే మునుగుతుందా? లేదా? అన్నది మాత్రం చెప్పడం లేదు. హైదరాబాద్‌ మహానగరంలో దాదాపు ఆరు కోట్ల రూపాయలకుపైగా విలువచేసే విల్లాలు కూడా మొదటి అంతస్తు వరకు మునిగిపోయాయంటే, వాటికి డిజైన్‌ చేసిన ఇంజనీరింగ్‌ ప్రముఖుల్ని తప్పకుండా సత్కరించాల్సిందే.

విచ్చలవిడిగా వేస్తున్న లే ఔట్లలో కనీస భద్రతా ప్రమాణాలు పాటించడం లేదన్నది కూడా ఇటీవల కురిసిన వర్షాలు బట్టబయలు చేసేసాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల్లో పాత పట్టణాలు నీట మునిగిపోకుండా ఉండడమే ఇందుకు నిదర్శనం. అక్కడ కూడా భారీ వర్షాలు కురిసినప్పటికీ ఒకటి రెండు గంటల్లోనే నీరు మొత్తం బైటకు వెళ్ళిపోయింది. సదరు నివాస గృహాలు ఏర్పాటయినప్పుడు అక్కడ నిర్మించబడ్డ మురుగుకాల్వలు ఇందుకు దోహదపడ్డాయి.

దాదాపుగా కొత్తగా పుట్టుకువచ్చిన కాలనీలే మునిగిపోయాయి. అంటే దానర్ధం ప్రకృతికి పూర్తి విరుద్ధంగానే ఇవి నిర్మించారని చెప్పాల్సిందే. నీటి వాలుల్లోనూ, నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లోనూ ఇటువంటి కొత్త కాలనీలు పుట్టుకు వచ్చాయని పలువురు వివరిస్తున్నారు. దాని ప్రభావంతోనే కొత్త కాలనీలు మునిగిపోవడంతో పాటు, వాటికి ఎగువన ఉన్న ప్రాంతాల్లోని ముంపునీరు కూడా ముందుకు కదలకుండా అడ్డుపడుతున్నాయని చెబుతున్నారు. ఎగువ నుంచి వచ్చే మురుగునీటిని అడ్డుకోవడం, తమ దగ్గర్నుంచి నీరు బైటకు వెళ్ళే మార్గాల్లేకపోవడంతో రోజుల తరబడి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోందని వివరిస్తున్నారు. తరచి చూస్తే ఇదే నిజమన్నది అర్ధమవుతోంది. హైదరాబాదులాంటి మహానగరంలో సైతం అప్పుడెప్పుడో మోక్షగుండం విశ్వేశ్వర్య టైంలో నిర్మించిన డ్రైనేజీలు పక్కాగా పనిచేస్తున్నాయని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా నిర్మించిన డ్రైనేజీలు విఫలమయ్యాయని కూడా చెబుతున్నారు.

రోడ్ల వెడల్పులు, పబ్లిక్‌ ప్లేస్‌లు, డ్రైన్లు, వీధి లైట్లు వంటి హంగులు తమతమ లేఔట్‌కు ఉన్నాయని ఇప్పటి వరకు చెప్పుకోవడం చూస్తుంటాం. ఇకపై లేఔట్‌ మునిగిపోదు అని కూడా అదనంగా చేరిస్తే తప్ప భవిష్యత్తులో వినియోగదారుల నమ్మకాని పొందడం కష్టమైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే లే ఔట్‌లలో స్థలాలు కొనుగోలుదారుల అవగాహనపైనే ఇది ఆధారపడి ఉంటుంది. లేకపోతే ఎప్పటి మాదిరిగానే ఆ అప్రూవల్‌ ఉంది, ఈ ఫెసిలిటీ ఉంటుంది అంటూ మాయమాటలు చెప్పి వారి వ్యాపారాన్ని యధావిధిగానే కొనసాగించుకునే అకాశం ఉంటుంది. అక్కడ ఇళ్లు కట్టుకున్న వారికి ఎప్పటికైనా ముంపు ప్రమాదం పొంచే ఉంటుంది.