iDreamPost
android-app
ios-app

KCR Jagan Modi Oil prices -ఇటు జగన్- అటు కేసీఆర్ ఒకే రోజు కేంద్రం మీద ఆగ్రహం వెనుక కారణాలేంటి?

  • Published Nov 08, 2021 | 2:33 AM Updated Updated Mar 11, 2022 | 10:36 PM
KCR Jagan Modi Oil prices -ఇటు జగన్- అటు కేసీఆర్ ఒకే రోజు కేంద్రం మీద ఆగ్రహం  వెనుక కారణాలేంటి?

ఉదయం పెట్రోల్ ధరలపై జగన్ జనం ముందుకొచ్చారు. కేంద్రం అన్యాయం చేస్తున్న తీరుని అందరికీ చాటిచెప్పారు. గడిచిన కొంతకాలంగా భారీగా పెరిగిన ధరల్లో పన్నుల వాటాని రాష్ట్రాలకు ఇవ్వకుండా చేస్తున్న అన్యాయాన్ని ఎండగట్టారు. అదే సమయంలో ఏపీలో బీజేపీ నేతలు రోడ్డెక్కి ధర్నాలు చేయడం ఏమిటని నిలదీశారు. ఆపార్టీ వైఖరిని తప్పుబట్టారు. సాయంత్రానికి కేసీఆర్ మీడియా ముందుకొచ్చారు. నేరుగా మోదీకి వ్యతిరేకంగా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ వచ్చి పొగబెడతానంటూ మాట్లాడారు. రైతు చట్టాల నుంచి అనేక అంశాల్లో కేంద్రం తీరుని దుయ్యబట్టారు. ధాన్యం కొనుగోళ్లలో దగా చేస్తోందంటూ మాట్లాడారు.

ఒకేరోజు ఇద్దరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్రం వైఖరి పట్ల ఈ తీరున స్పందించడం ఆసక్తిగా మారింది. రాజకీయంగా కొత్త చర్చకు తెరలేపుతోంది.

హుజూరాబాద్ ఎన్నికల్లో బీజేపీ చేతిలో కేసీఆర్ ఖంగుతిన్నారు. వాస్తవానికి అది ఈటెల వర్సెస్ కేసీఆర్ పోరుగానే చాలామంది భావించారు. అదే సమయంలో బద్వేలులో బీజేపీని జగన్ మట్టికరిపించారు. డిపాజిట్ కూడా దక్కకుండా చేశారు. బంపర్ మెజార్టీతో విజయం సాధించారు. ఇరు రాష్ట్రాల్లో ఇలా భిన్నమైన ఫలితాలు వచ్చినప్పటికీ రాజకీయంగా ఇరువురి వైఖరి కీలకంగా భావించవచ్చు. తెలంగాణాలో బీజేపీ బలోపేతం అవుతుందనే సంకేతాలున్నాయి. ఏపీలో ఇప్పుడిప్పుడే కోలుకునే అవకాశాలు కానరావడం లేదు. ఈ పరిస్థితుల్లో మోదీ విధానాల మీద మండిపడిన తీరు మాత్రం అందరినీ ఆలోచింపజేస్తోంది.

కొంతకాలంగా అటు టీఆర్ఎస్, ఇటు వైఎస్సార్సీపీ కూడా బీజేపీతో సఖ్యతగా మెలుగుతున్నాయి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి అనేక విధాలుగా సహకరిస్తున్నారనే అభిప్రాయం ఉంది. ఇరు రాష్ట్రాల ప్రయోజనాల రీత్యా కేంద్రంతో సఖ్యంగా మెలుగుతున్నట్టు స్పష్టమవుతోంది. అదే సమయంలో అనేక అంశాలలో విబేధిస్తున్న వైనం కూడా ఉంది. ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన పోలవరం నిధుల కోసం ముఖ్యమంత్రి మంత్రాంగం నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాటం వరకూ ఆయా విషయాలను బట్టి వైఖరి తీసుకుంటున్నారు. బీసీ జనగణన నుంచి సీఏఏ వరకూ పలు అంశాలపై జగన్ కేంద్రం వైఖరితో విబేధించారు. కేసీఆర్ కూడా దాదాపుగా అదే పంథాతో సాగుతున్నారు. అంశాల వారీగా విబేధిస్తూ వ్యవహారం నడుపుతున్నారు.

దేశవ్యాప్తంగా మోదీ వ్యతిరేక కూటమి ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఇటీవల ఉప ఎన్నికల ఫలితాల తర్వాత అవి మరింత ఊపందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీకి ఉప ఎన్నికల్లో చేదు ఫలితాలు వచ్చాయి. ఆపార్టీ జాతీయ అధ్యక్షుడు సొంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ లో మండి లోక్ సభ స్థానం కూడా చేజార్చుకుంది. ఈ సీటుని రెండున్నరేళ్ల క్రితం 4లక్షల మెజార్టీతో బీజేపీ గెలుచుకోవడం విశేషం. ఇలాంటి ఓటముల తర్వాత ఇప్పుడు బీజేపీ దృష్టి ఐదు రాష్ట్రాల ఎన్నికల మీద ఉంది. యూపీలో బీజేపీని నిలువరించాలనే గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో ఏపీ, తెలంగాణా ముఖ్యమంత్రులు స్వరం పెంచడం చర్చనీయాంశం అవుతోంది. బీజేపీకి వ్యతిరేకంగా వివిధ పార్టీలతో కలిసి సాగుతారా లేక బీజేపీ దూకుడుని ఎండగట్టే వైఖరిలో భాగమా అన్నది తేలాల్సి ఉంది. కానీ ప్రస్తుతానికి ఇరువురు సీఎంలు మోదీ పట్ల దూకుడుగా స్పందించం రాజకీయ మలుపులకు దోహదపడవచ్చని చెప్పవచ్చు.