iDreamPost
android-app
ios-app

CM Yogi -Taliban : తాలిబన్ బూచితో యోగి భయపెడుతున్నారా?

  • Published Nov 01, 2021 | 11:22 AM Updated Updated Nov 01, 2021 | 11:22 AM
CM Yogi -Taliban : తాలిబన్ బూచితో యోగి భయపెడుతున్నారా?

తాలిబన్లు భారత్ వైపు రావడానికి ప్రయత్నిస్తే వారిపై వైమానిక దాడులు జరిపిస్తాం..
టాలిబన్లను సమర్థించేవారు.. భారత వ్యతిరేకుల కిందే లెక్క..

రెండు నెలలుగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి అదిత్యనాథ్ తరచూ చేస్తున్న ఇటువంటి ప్రకటనలు అనేక అనుమానాలు, ఆలోచనలు రేకెత్తిస్తున్నాయి. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న నేత అంతర్జాతీయ అంశాల గురించి పదే పదే మాట్లాడటమే విస్మయం కలిగిస్తోంది. తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ ను ఆక్రమించి అక్కడి పాలకులుగా మారారు. దానివల్ల దేశ సరిహద్దుల భద్రత, అంతర్గత భద్రత, అంతర్జాతీయంగా తలెత్తే పరిణామాలు తదితర అంశాలను పరిశీలించి స్పందించడానికి, తగిన చర్యలు తీసుకోవడానికి భారత ప్రభుత్వం ఉంది. దాని పరిధిలోని విదేశీ వ్యవహారాలు, రక్షణ, హోమ్ శాఖలు తాలిబన్ సమస్య మొదలైనప్పటి నుంచి దానిపైనే దృష్టి సారించాయి.

కానీ వాటితో ఏమాత్రం సంబంధం లేని యూపీ సీఎం యోగి అదిత్యనాథ్ అదే పనిగా తాలిబన్ సమస్యను ప్రస్తావిస్తున్నారు. భారతదేశంలోకి చొరబడతామని తాలిబన్లు ఎక్కడా ప్రకటించలేదు.. అటువంటి ప్రయత్నాలు కూడా అటువైపు నుంచి ఇప్పటివరకైతే లేవు. అయినా సీఎం యోగి టాలిబన్లను హెచ్చరిస్తున్నారు. భారత్ వైపు వస్తే వాయుసేన ద్వారా దాడులు చేయడానికి సిద్ధంగా ఉన్నామంటున్నారు. పనిలో పనిగా దేశంలో కొందరు తాలిబన్లను ప్రశంసిస్తున్నారని.. అలాంటి వారంతా భారత వ్యతిరేకులేనని అంటున్నారు. తాలిబన్ అంశంపై ఆయన ఎందుకు అంత అతిగా స్పందిస్తున్నారు. ఆఫ్ఘనిస్థాన్ తో ఉత్తరప్రదేశ్ కు సరిహద్దు కూడా లేదు ప్రజలు భయపడకుండా వారికి ధైర్యం చెబుతున్నారని అనుకోవడానికి. ఆఫ్ఘన్తో సరిహద్దులున్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా అంతగా స్పందించడం లేదు. ఇవన్నీ తరచి చూస్తే మళ్లీ జాతీయత, జాతీయ భద్రత అంశాలను తెరపైకి తెచ్చి రాజకీయ ప్రయోజనం పొందాలన్న బీజేపీ తాపత్రయం కనిపిస్తోంది.

Also Read : Amaravati Movement – అమరావతి ఉద్యమం ఎందుకు విఫలమైంది..?

ఎన్నికల ముంగిట బీజేపీకి ఇవి అలవాటే..

హిందూత్వకు బ్రాండ్ అంబాసిడరుగా చెప్పుకునే బీజేపీ మొదటి నుంచీ మతవాదం, జాతీయవాదంతోనే రాజకీయాలు నెరపుతోంది. ఎన్నికల సమయాల్లోనూ, బీజేపీ ప్రభుత్వాలు కష్టాల్లో చిక్కుకున్నప్పుడల్లా ఆ పార్టీ నేతలు హిందుత్వాన్ని, జాతీయవాదాన్ని తెరపైకి తెస్తుంటారు. ఆ రెండింటికీ విదేశీ శక్తులు, సరిహద్దు దేశాల వల్ల ముప్పు పొంచి ఉందని ఊదరగొట్టి, భయపెట్టి.. జాతీయ వాదాన్ని రెచ్చగొట్టి ఓట్ల రూపంలో ప్రయోజనం పొందుతున్నారు. రామాజన్మ భూమి వివాదం, కార్గిల్ పోరాటం, జాతీయ పౌరసత్వ చట్టం వంటి వాటిని ఇలాగే వాడుకున్నారు. ఇప్పుడు కూడా అటువంటి అవసరమే వచ్చింది. మరో నాలుగు నెలల్లో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ తో సహా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. యూపీలో బీజేపీకి కొంత గడ్డు పరిస్థితులు ఉన్నాయని, మెజారిటీ బాగా తగ్గవచ్చని ముందస్తు సర్వేలు అంచనా వేసిన నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా సీఎం యోగి తాలిబన్ బూచిని రంగంలోకి దించినట్లు కనిపిస్తోంది.

పోటీ తీవ్రమైన పరిస్థితుల్లో..

గత అసెంబ్లీ ఎన్నికల్లో యూపీలో 300కు పైగా సీట్లతో బీజేపీ బ్రహ్మాండమైన విజయం సాధించింది. అయితే ముఖ్యమంత్రి యోగి అదిత్యనాథ్ హయాంలో నేరాలు పెరగడం, కరోనా నియంత్రణలో వైఫల్యం, గంగా నదిలో కరోనా మృతుల మృతదేహాలు తేలడం, మహిళలపై అఘాయిత్యాలు, కేంద్ర వ్యవసాయ చట్టాలకు నిరసనగా పెల్లుబుకుతున్న రైతు ఆగ్రహం, లఖిమ్ పూర్ ఖేరి వంటి ఘటనలు యోగి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతకు కారణం అవుతున్నాయి. మరోవైపు ప్రియాంక సారథ్యంలో గతం కంటే కాంగ్రెస్ పుంజుకుని సవాల్ చేస్తోంది. సమాజ్వాదీ, బహజన్ సమాజ్ పార్టీలు ఉండనే ఉన్నాయి. ఇన్ని సవాళ్లను ఎదుర్కొని మళ్లీ అధికారంలోకి రావడం కత్తిమీద సాము వంటిదే. బహుశా అందుకేనేమో తాలిబన్ అంశాన్ని సీఎం యోగి మాటిమాటికీ ప్రస్తావిస్తూ మోదీ నాయకత్వంలో దేశానికి ఎదురులేదని చెబుతున్నారు. ఆ విధంగా దేశాన్ని కాపాడగలిగేది బీజేపీయేనని ఎలుగెత్తి చాటడం ద్వారా ప్రజల మద్దతు పొందాలన్నది ఆయన లక్ష్యం అన్నట్లు కనిపిస్తోంది.

Also Read :  Steel Plant – Pawan Kalyan : అఖిల పక్షం సరే.. కేంద్రాన్ని ప్రశ్నించరేమి?